
కరోనా రెండు వేవ్స్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు థియేటర్స్ దగ్గర జాతర మొదలైంది. దానికి కారణం ‘అఖండ’. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది. రిలీజై పది రోజులు దాటుతున్నా కలెక్షన్ల ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడీ సినిమా హిందీలో రీమేక్ కానున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో సూపర్ హిట్టయిన సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్ అవడం కామనే. ఇప్పుడు ‘అఖండ’ కోసం కూడా అక్కడి మేకర్స్ రెడీ అవుతున్నారట. రీమేక్ రైట్స్‌ను తీసుకునేందుకు భారీ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయట. ఆల్రెడీ డీల్ సెట్ అయినట్టేనని సమాచారం. మరోవైపు బాలయ్య లాంటి మాస్ హీరోని తలపించే హీరో బాలీవుడ్‌లో ఎవరనేది హాట్ టాపిక్ అయ్యింది. అజయ్ దేవగన్ కానీ అక్షయ్ కుమార్ కానీ చేస్తారని అంటున్నారు. అజయ్, అక్షయ్‌ల పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా వీరిద్దరూ పరకాయ ప్రవేశం చేయగలరు. అందుకే వీరిలో ఎవరైనా ‘అఖండ’గా మెప్పించగలరనే నమ్మకంతో ఉన్నారట మేకర్స్. ప్రస్తుతమైతే ఇద్దరూ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి చివరికి ఎవరు ఫైనల్ అవుతారో.. వీరిద్దరూ కాకుండా ఇంకెవరైనా తెరమీదికి వస్తారో.. అసలీ వార్తలో ఎంత నిజముందో!