మరోసారి యోగి సర్కారును యూపీ ప్రజలు కోరుకోవట్లే

మరోసారి యోగి సర్కారును యూపీ ప్రజలు కోరుకోవట్లే

ఉత్తరప్రదేశ్ లో మోడీ ప్రారంభిస్తున్న ప్రాజెక్టుల్లో ఎక్కువ భాగం తాము మొదలుపెట్టినవేనని మాజీ సీఎం, సమాజ్‌వాదీ చీఫ్​ అఖిలేష్ యాదవ్ అన్నారు. మరోసారి యోగి ప్రభుత్వాన్ని ఉత్తరప్రదేశ్ కోరుకోవడంలేదని యోగ్యమైన ప్రభుత్వాన్నే ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం స్టూడెంట్స్‌కు ల్యాప్ ట్యాప్ ఇస్తే... బీజేపీ ప్రభుత్వం లాఠీలతో కొట్టిస్తోందన్నారు. తాము పేదలకు ఇళ్లు ఇస్తే... యోగి సర్కార్ రైతులను చంపించిందని ఆరోపించారు. ఇవాళ యూపీలో బలరాంపూర్‌‌లో సరయూ కెనాల్ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోడీ.. గతంలో పాలించిన పార్టీల మైండ్ సెట్ కారణంగానే అనేక కీలక ప్రాజెక్టుల పనులు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌‌గా అఖిలేష్ యాదవ్ లక్నోలో ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. గతంలో తమ ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టులనే ఇప్పుడు బీజేపీ ప్రారంభిస్తోందన్నారు. అయితే ఇవాళ మోడీ సభకు జనాలను ప్రభుత్వ బస్సుల్లో తీసుకెళ్లారని, కలెక్టర్లు బస్సులు ఏర్పాటు చేసి జనాలను తీసుకురావాలని లెటర్లు రాసి సభను విజయవంతం చేశారని అన్నారు. గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా చేయలేదన్నారు. 

యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తి కావొస్తున్నా.. నేటికీ వాళ్ల మేనిఫెస్టో అమలు చేయలేదని అఖిలేష్ ఆరోపించారు. ప్రకటనలు, పెద్ద పెద్ద హోర్డింగ్‌లు పెట్టుకోవడానికే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఉపాధి, ఉగ్యోగాలు, పెట్టుబడుల గురించి మాట్లాడే బీజేపీ నేతలు.. వారి ప్రభుత్వంలో ఎన్ని ఎంవోయూలు కార్యరూపం దాల్చి కంపెనీలు, పరిశ్రమలు మొదలయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు.