అక్షర ప్రపంచం : విధి ఆడిన వింతాట

అక్షర ప్రపంచం : విధి ఆడిన వింతాట

ఇది వేణుగోపాల్ నక్షత్రం రాసిన ‘‘శ్రీగీతం’’. ఫ్యాక్షనిజం పడగనీడలో విరిసిన ప్రణయరాగం. విధి ఆడిన వింతాట. ఈ నవల సినిమా తీయడానికి పనికివస్తుంది. పరిశోధనాంశంగా కూడ స్వీకరించదగినది.ఇందులో శ్రీకాంత్ హీరో. గీత హీరోయిన్. ఈ పేర్లను పొదివి పుచ్చుకొని ఈ నవల ‘శ్రీగీతం’ అయింది. పేరు పెట్టడంలోనే కాదు. కథను తీర్చిదిద్దడంలో, లక్ష్యాన్ని సాధించడంలో రచయిత ఆరితేరాడు. ఇందులోని పాత్రలు, దృశ్యాలు, సంఘటనలు, పాఠకులు ఊహించని మలుపులు, నవలా రచనలో రచయిత ఒడుపులు ఆకర్షిస్తాయి.ఈ నవల ఫ్యాక్షనిజంతో ప్రారంభమవుతుంది. అంతులేని ప్రేమతో అంతమవుతుంది. మధ్యమధ్యలో ఫ్యాక్షనిజం, ప్రణయం దోబూచులాడుతాయి. ఫ్యాక్షనిజం నీడను విడిచి ప్రశాంత జీవనం గడపాలని ఆస్తిని సైతం వదులుకొని చేతిలో ఉన్న ఎంబిఏ డిగ్రీతో నగరంలో చేరి బిజినెస్ ప్రతాపరెడ్డి కోటీశ్వరుడైనా, అదే ఫ్యాక్షనిజానికి పరోక్షంగా తన కూతురు పదినెలల పాటు ఉక్కిరిబిక్కిరౌతుంది. బాల్యంలో భయం భయంగా ఉన్న గీత తదనంతర కాలంలో పరిస్థితులకు ఎదురొడ్డి వీరోచిత పోరాటం చేసి రాష్ట్రపతి చేతుల మీదుగా ‘నారీశక్తి పురస్కార్’ అందుకుంటుంది.

శ్రీకాంత్​ను బాల్యం నుండీ పేదరికం వెంటాడినా ట్యూషన్ చెప్పుకుంటూ చదివి ఉద్యోగం చేస్తూ మంచిపేరు తెచ్చుకొన్నాడు. అనంతరం చేయని నేరానికి హంతకుడిగా ముద్రపడి జైలు పాలయినా తన ఆశయాన్ని వీడక ప్రపంచంలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రూపొందించి దేశానికే గర్వకారణమై గూగుల్ నుండి ఐదు మిలియన్ల ఆఫర్​ పొందాడు. ఒక్క నిమిషంలో చావు సమీపిస్తుందనుకున్న తరుణంలో ఏ శేఖరం వల్ల తాను రక్షింపబడ్డాడో అతని కొడుకునే జైలుకు పంపిన మల్లేశ్ పశ్చాత్తాపంతో అప్రూవర్​గా మారాడు. చావు నుండి తప్పించుకోవాలని నగరానికి వచ్చిన అశోక్ అంతమయ్యాడు. ఒకప్పుడు అబార్షన్ చేయించుకోవాలనుకున్న గీత, తర్వాత మనసు మార్చుకొని బిడ్డను కని తన భర్తను నిర్దోషిగా నిరూపించి లోకానికి సగర్వంగా చాటింది.

ఇంకా శివారెడ్డి వర్గంపై పగబట్టిన వెంకటరెడ్డి శ్రీకాంత్​ను చంపాలనుకోవడం, చంపడానికి సుపారీ తీసుకున్న కరడుగట్టిన మస్తాన్ మనసునే గీత మార్చడం, చైన్ స్నాచర్లను సన్మార్గులుగా శ్రీకాంత్ మార్చడం - ఇవన్నీ విధి ఆడిన వింతాటలే ! ఇవన్నీ ఒక ఎత్తు - గీత శ్రీకాంత్​ల ప్రణయం మరొక ఎత్తు. గీతకు శ్రీకాంత్​తో ఎప్పుడో చిన్నప్పుడు రెండు సంవత్సరాలు కూడ సరిగ్గా లేని ఆ పరిచయం ఒక జీవితానికి సరిపోయేంత ఎనర్జీ నిచ్చింది. గీత డిగ్రీ చదువుతూనే శ్రీకాంత్ కోసం వెతికింది. వెతికినా దొరకని శ్రీకాంత్ వెతకనప్పుడే వచ్చాడు. 

ప్రతి సంఘటనలో గీత కోసం స్వప్న అందించిన తోడ్పాటు చూస్తే ప్రతి వ్యక్తీ స్వప్న వంటి స్నేహితురాలు ఉండాలనుకుంటారు. ఈ సవల చదివాక గీత వంటి ప్రేమికురాలు, స్వప్న పంటి స్నేహితురాలు, నర్సింగ్ వంటి పోలీస్ అధికారి, శ్రీకాంత్ వంటి సమాజ ప్రేమికుడు, సూర్య వంటి గురువు ఉండాలని కోరుకుంటారు. ఇంకా జైలర్, రాజేశ్, వెంకట్, రాజలింగం, చంద్రకళ, శకుంతల తదితర పాత్రలన్నీ సముచితంగా ఒదిగినాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ నవలలో సంభాషణలు సహజాతిసహజంగా ఉంటాయి.

వేణుగోపాల్ కవి, కథకుడు, నవలా రచయిత, సినిమా నిర్మాత. అతడు అమెరికాలో ఉన్నా అతని మనసు ఇండియాలోనే ఉంటుంది. అతని నుంచి మరెన్నో కథలు, నవలలు, సినిమాలు రావాలని అభిలషిస్తూ అభినందనలు. 

- ఎ. గజేందర్ రెడ్డి