
కరోనా ఫస్ట్, సెకెండ్ వేవ్స్‌తో కుదేలైన థియేటర్స్ వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. కానీ ఇంతలో కరోనా కేసులు మరింత పెరుగుతుండటం, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సెగ తగలడంతో పెద్ద సినిమాలు వాయిదా పడుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ఇటీవల వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీని పోస్ట్ పోన్ చేశారు. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న భారీ హిస్టారికల్ మూవీ ‘పృథ్వీరాజ్’. హిందూస్థాన్ సింహంగా పేరొందిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు దర్శకుడు చంద్రప్రకాష్ ద్వివేది. మానుషీ చిల్లర్ హీరోయిన్. సంజయ్ దత్, సోనూసూద్, అశుతోష్ రాణా, లలిత్ తివారి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ ప్రెస్టీజియస్ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. జనవరి 21న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనాతో కొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ మూసి వేస్తుండడం, మరికొన్ని చోట్ల యాభై శాతం ఆక్యుపెన్సీ లాంటి కారణాలతో పోస్ట్ పోన్ చేశారు.