Akshaya Tritiya 2023 : అక్షయ తృతీయ.. బంగారం కొనేందుకు ఇదే మంచి ముహూర్తం

Akshaya Tritiya 2023 :  అక్షయ తృతీయ.. బంగారం కొనేందుకు ఇదే మంచి ముహూర్తం

అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే శ్రేయస్సు, సంపద సిద్ధిస్తాయని చాలా మంది నమ్ముతుంటారు. ఈ ఏడాదిలో ఏప్రిల్ 22, శనివారం నాడు అక్షయ తృతీయను పురస్కరించుకుని చాలా మంది ఇప్పటికే బంగారం, వెండి ఆభరణాలు కొనేందుకు క్యూలు కట్టారు. అంతే కాదు జ్యువెల్లరీ షాపులు సైతం ఈ పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పుడూ లేని ఆఫర్లు, డిస్కౌంట్లు అనౌన్స్ చేశారు. అయితే చాలా మంది బంగారం కొంటే మంచిదని చెప్తుంటారు. కానీ ఏ సమయంలో కొనాలి.. ఎప్పటిలోగా కొనాలనే విషయాలు మాత్రం చాలా మందిని కన్ఫ్యూజన్ లో పడేస్తాయి. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అక్షయ తృతీయ 2023 ముహూర్తం:

అక్షయ తృతీయ పూజ శుభ ముహూర్తం ఉదయం 7:49 గంటలకు ప్రారంభమై  ఉదయం 9:04 గంటలకు ముగుస్తుంది. ఏప్రిల్ 23న ఇది చోఘడియ ముహూర్తం ప్రకారం ఉదయం 7:26 గంటలకు ప్రారంభమై 7:47 గంటలకు ముగుస్తుంది.

బంగారం కొనడానికి మంచి సమయం..

అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి శుభ ముహూర్తం ఏప్రిల్ 22న ఉదయం 7:49 గంటల నుంచి ఏప్రిల్ 23న ఉదయం 5:48 గంటలలోపు ఎప్పుడైనా కొనొచ్చు.

బంగారం కొనుగోలు చేసేందుకు ఉ.7.49 అని చెప్పిన దాని ప్రకారం చూస్తే.. చాలా మందికి ముందుగా వచ్చే ప్రశ్న.. ఆ సమయంలో బంగారం దుకాణాలు ఓపెన్ చేస్తారా.. అలాంటప్పుడు ఎలా కొనుగోలు చేయాలి అని. ఈ ప్రశ్నకు సరైన సమాధానం లేకపోయినప్పటికీ.. ఉన్న శుభ ముహూర్తంలో వీలైన సమయంలో బంగారాన్ని కొనుగోలు చేయాలని మరికొందరు సూచిస్తు్న్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ...

అక్షయ తృతీయను తెలంగాణ. ఆంధ్రప్రదేశ్‌లలో ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున ముఖ్యంగా మహిళలు బంగారం లేదా నగలను కొనుగోలు చేస్తారు. అక్షయ తృతీయ నాడు సింహాచలం ఆలయంలో ప్రత్యేక ఉత్సవ ఆచారాలు నిర్వహిస్తారు. ఈ రోజున గంధం లేకుండా నిజ రూప దర్శనంలో స్వామి వారు దర్శనమిస్తారు.