స్వరాష్ట్రంలో సామాన్యూడికేం దక్కింది ?: ఆకునూరి మురళి

స్వరాష్ట్రంలో సామాన్యూడికేం దక్కింది ?: ఆకునూరి మురళి
  • బీఆర్ఎస్ పాలన మొత్తం మాఫియాల రాజ్యం
  • అన్నింట్లోనూ అవినీతి, దోపిడీ
  • కమీషన్ల కోసమే పథకాల అమలు
  • ప్రతిదాంట్లో సర్కార్ పెట్టిన ఖర్చుకు వచ్చిన ఫలితం సున్నా

తెలంగాణ వస్తే బ్రహ్మాండమైన మార్పు వస్తుందని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షించారు. కానీ ఇప్పుడు 1,400 మంది యువకుల త్యాగఫలం వృథా అయిందని బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, కూలీలు, చిన్న వ్యాపారులు, మహిళలు సహా సబ్బండ వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంటూ బీఆర్ఎస్ సర్కార్ పెద్ద ఎత్తున సంబురాలు చేస్తోంది. ఇవి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఉపయోగపడేవే తప్ప.. సామాన్యులకు సంతోషాన్ని ఇచ్చేవి కావు.

ఇంటింటికీ నీళ్లు ఇచ్చామని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని, హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని, కొత్త సెక్రటేరియెట్ కట్టామని, ఎత్తైన అంబేద్కర్ విగ్రహం పెట్టామని, దళితబంధుతో ఎస్సీలను బాగుచేశామని, చెరువులకు జీవం పోశామని, డబుల్ బెడ్రూం ఇండ్లు, శ్మశానాలు నిర్మించామని, విద్యా వ్యవస్థను బలోపేతం చేశామని, హరితహారంతో పచ్చదనం పెంచామని.. బీఆర్ఎస్ సర్కార్ గొప్పలు చెప్పుకుంటున్నది. కానీ ఇవన్నీ ఓట్లను దృష్టిలో పెట్టుకుని, అవినీతికి పాల్పడేందుకు, గొప్పలకు పోయి చేపట్టిన కార్యక్రమాలే తప్ప.. పెట్టుబడికి తగిన ఫలితం సాధించే కార్యక్రమాలు కావు. ఒక్క ఆసరా పింఛన్లు తప్ప అన్ని పథకాలూ అంతే. ప్రజలకు మేలు చేయాలని కేసీఆర్​కు ఎంతమాత్రం లేదు. 

తాగు నీళ్లు లేవ్.. సాగు నీళ్లు లేవ్ 

ఆడ బిడ్డ బిందె పట్టుకుని బయటకు వచ్చే పరిస్థితి ఉండొద్దని, నీళ్ల డబ్బాలు కొనుడు బంద్ కావాలని 2015లో కేసీఆర్ చెప్పారు. ఇంటింటికీ నీళ్లు ఇస్తామని చెప్పి రూ.36,900 కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ పథకం ప్రారంభించారు. కానీ ఇదంతా డొల్లే. చాలాచోట్ల నల్లాలే కనిపిస్తలేవ్. కొన్నిచోట్ల రెండ్రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావట్లేదు. కొన్ని వందల గ్రామాలకు నీళ్లే ఇవ్వట్లేదు. ఆడ బిడ్డలు ఇంకా వాగులు, వంకలు, బావులు, కామన్ నల్లాల దగ్గరకు బిందెలు పట్టుకుని పోతున్న పరిస్థితులే ఉన్నయ్. 

తాగు నీళ్ల పరిస్థితి ఇట్లుంటే.. సాగు నీళ్ల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ఫెయిల్ అయింది. దీనికింద 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని కేసీఆర్ చెప్పారు. 36 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామంటూ డీపీఆర్ లో పేర్కొన్నారు. కానీ ప్రాజెక్టు ద్వారా కనీసం 3 లక్షల ఎకరాలకైనా నీళ్లు అందుతున్నయా? అన్నది అనుమానంగా ఉంది. 2022 ఖరీఫ్, యాసంగి పంటలకు ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో చెప్పాలని ఆర్టీఐ ద్వారా అడిగితే సర్కార్ సమాధానం ఇస్తలేదు. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి నీళ్లిచ్చేందుకు అయ్యే కరెంట్ ఖర్చే రూ.50 వేలు. మిగతా పంపులు, కాలువలు, జలాశయాల మరమ్మతులు, జీతాలు తీసుకుంటే ఈ ఖర్చు రూ.లక్ష దాటుతుంది. అలాంటప్పుడు ఇది ఎలా గొప్ప ప్రాజెక్టు అవుతుంది? 

ఇక మిషన్ కాకతీయ కమీషన్ల కాకతీయగా మారింది. రాష్ట్రంలో మొత్తం 46 వేల చెరువులుంటే రూ.5వేల కోట్లతో 21 వేల చెరువులను పునరుద్ధరించామని చెబుతున్నారు. ఒక్కో చెరువుకు రూ.కోటి కేటాయించారని అనుకున్నా, అందులో కనీసం రూ.30 లక్షలు కూడా ఖర్చు కాలేదు. ఈ ప్రాజెక్టు కింద ఒక్క ఎకరమైనా అదనంగా పారిందా? అంటే అదీ లేదు. కొంత మేరకు మరమ్మతులు మాత్రం జరిగాయి. 

పేరు కోసమే సెక్రటేరియెట్ నిర్మాణం.. 

అన్నేసి కోట్లతో కొత్త సెక్రటేరియెట్ ఎందుకు కట్టినట్టు? సామాన్యులకు, టూరిస్టులకు అది గొప్పగానే కనిపిస్తుంది. కానీ నాలాంటి వాళ్లకు దాని వెనుక దాగివున్న మూర్ఖపు ఆలోచనలు కనిపిస్తయ్. బ్రహ్మాండంగా ఉన్న పాత బిల్డింగును కూలగొట్టి.. 10 శాతం కమీషన్ల కోసం, పేరు కోసం కొత్త బిల్డింగ్ కట్టారు. 

దళితుల ఆత్మగౌరవం నిలబెట్టారా? 

దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం కట్టినందుకు ధన్యవాదాలు. ఆ విగ్రహాన్ని నిలబెట్టిన సీఎం కేసీఆర్.. దళితుల ఆత్మగౌరవం గురించి నిజంగా ఆలోచించారా? విగ్రహానికి 2015లో శంకుస్థాపన చేసి 2023 దాకా ఎందుకు పూర్తి చేయలేదు? సీఎం అయినంక మొదటి 8 ఏండ్లలో ఒక్కసారైనా అంబేద్కర్ జయంతి నాడు ఆయనకు నివాళి ఎందుకు అర్పించలేదు? మరి ఈ లెక్కన కేసీఆర్.. అంబేద్కర్ కు ఏపాటి గౌరవం ఇచ్చారు. అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి ఆయన మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ ను పిలిపించి గౌరవించింది మహారాష్ట్రలోని ఎస్సీల ఓట్లు పొందడం కోసమేనన్నది నిజం కాదా? ఇప్పటికీ పోస్టింగ్ ల విషయంలో ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్​లపై ఎందుకు వివక్ష చూపుతున్నారు? 

దళితబంధు ఎన్నికల స్టంట్ కాదా?

దళితబంధు ఒక మోసపూరిత పథకం. ఓట్ల కోసమే పథకం ప్రారంభించి, మూడేండ్లయినా కేవలం 38,328 మందికే అమలు చేశారు. అంటే రాష్ట్రంలోని 18 లక్షల ఎస్సీ కుటుంబాలకు పూర్తిస్థాయిలో ఈ పథకాన్ని అమలు చేయాల్నంటే ఇంకా 141 ఏండ్లు పడుతుంది. పైగా ఈ పథకంలో బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు రూ.3 లక్షల కమీషన్ తీసుకుంటున్నారని స్వయంగా కేసీఆరే ఒప్పుకున్నారు. నిజానికి రూ.5 లక్షలు తీసుకుంటున్నట్టు మా పర్యటనల్లో తేలింది. 

విద్యావ్యవస్థ ధ్వంసం.. 

ప్రభుత్వ విద్యను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసింది. వెయ్యి గురుకులాలకు గాను దాదాపు 700 బడులకు శాశ్వత భవనాలు లేవు. ఇక గ్రామాల్లోని 29 వేల ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ‘మన ఊరు మన బడి’ మొక్కుబడిగా మొదలుపెట్టి మూలకు పడేశారు. దీని కింద రూ.9,278 కోట్లు అని ప్రకటించి 2022–23, 2023–24 బడ్జెట్లలో ఒక్క రూపాయి పెట్టలేదు. దేశంలోనే బాత్ రూమ్ లు లేని అత్యధిక స్కూళ్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. 2,124 బడుల్లో బాత్ రూమ్స్ లేవు. 11,124 బడుల్లో తాగడానికి మంచినీళ్లు లేవు. 6,800 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క టీచరే ఉన్నారు. 

ఉపాధి నిధులతోనే హరితహారం.. 

కేసీఆర్ ఊరికొక శ్మశానం కట్టించారు. కానీ అందులో 75 శాతం ఉపాధి హామీ నిధులే. కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.1,329 కోట్లతో 12,743 శ్మశనాలు కట్టిన్రు. హరితహారం కింద 266 కోట్ల మొక్కలు నాటేందుకు రూ.8,511 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవి కూడా ఉపాధి హామీ కింద వచ్చిన కేంద్ర ప్రభుత్వ నిధులే.  కానీ పెట్టిన మొక్కల్లో 20 శాతం కూడా బతకలేదు. 

మాఫియాల చేతుల్లో రాష్ట్రం.. 

రాష్ట్రంలో మొత్తం మాఫియా రాజ్యం నడుస్తున్నది. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఇసుక, లిక్కర్, భూములు, విద్య, వైద్యం, గ్రానైట్, ప్రాజెక్టులు, నియామకాలు.. ఇట్ల ప్రతి దాంట్లోనూ మాఫియా తయారైంది. వాగులు, నదులు ఉన్న దగ్గర ఒక్కో ఎమ్మెల్యే ఏడాదికి రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు అవినీతికి పాల్పడుతున్నారు. లిక్కర్ మాఫియా ఆధ్వర్యంలో 50 వేలకు పైగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. 111 జీవో రద్దు చేసి రూ.10 లక్షల కోట్ల భూ దందాకు తెరలేపారు. కార్పొరేట్ కాలేజీలు, ఆస్పత్రుల పేరుతో పేదలను దోచుకుంటున్నారు. ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకుంటున్నారు. ఈ విధంగా ముఖ్యమంత్రి, మంత్రులు సహా అధికార పార్టీ నేతలంతా అవినీతికి పాల్పడుతున్నారు. ఈ దారుణ పరిస్థితులను ప్రజలు గుర్తించి బీఆర్ఎస్ ను తరిమికొట్టాలి. 

ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధి జరిగినట్టా? 

రూ.8 వేల కోట్లతో 34 ఫ్లైఓవర్లు కట్టినంత మాత్రాన హైదరాబాద్ అభివృద్ధి జరిగినట్టా? అవసరం లేని చోట కూడా ఫ్లైఓవర్లు ఎందుకు కట్టిన్రు? దీంట్లో 15 శాతం కమీషన్ ఏ నాయకుడికి వెళ్తున్నది? పెద్ద వర్షం వస్తే కాలనీలు మునిగిపోతున్నాయి. రోడ్లు ఖరాబైతున్నాయి. చిన్న పిల్లలను కుక్కలు పీక్కు తింటున్నాయి. మ్యాన్ హోళ్లలో పడి మనుషులు చనిపోతున్నారు. మరి ఈ సమస్యల సంగతేంది? అభివృద్ధి పనుల్లో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు తీసుకుంటున్న 10 శాతం కమీషన్ల మాటేంది? బీఆర్ఎస్ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం 111 జీవో రద్దు చేసింది నిజం కాదా? దీని ద్వారా లక్ష కోట్ల ప్రయోజనం పొందుతున్నది నిజం కాదా?.. ఇంకోమాట గత ప్రభుత్వం కట్టిన ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు, పీవీ ఎక్స్ ప్రెస్ వే, హైదరాబాద్ సంస్కృతి, ఇక్కడి వాతావరణం, ఇప్పటికే ఉన్న ఐటీ ఇండస్ట్రీల వల్ల వివిధ పరిశ్రమలు నగరానికి వస్తున్నాయి.

తలసరి ఆదాయం పెరిగిందా? : తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే టాప్ అని సర్కార్ పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ ప్రముఖుల ఆదాయం పెరిగితే అందరి ఆదాయం పెరిగినట్టేనా? రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వీధి వ్యాపారులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు, ప్రైవేటు ఉద్యోగుల ఆదాయాలు పెరిగాయా?
15 లక్షల కోట్లు ఏడబాయె? : గత 66 ఏండ్లలో ప్రభుత్వాలన్నీ కలిసి రూ.80 వేల కోట్ల అప్పులు చేస్తే, ఈ తొమ్మిదేండ్లలో ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వమే రూ.5 లక్షల కోట్ల అప్పు చేసింది. ఈ 9 ఏండ్లలో ప్రభుత్వం మొత్తం రూ.15 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. మరి ఆ ఖర్చుకు ఫలితమేదీ? జరిగిన అభివృద్ధి ఏది? 

కౌలు రైతులకేది సాయం? 

10 ఎకరాల్లోపు భూమి ఉండి, వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్న రైతులకు మాత్రమే రైతుబంధు అమలు చేయాలి. అప్పుడే అది మంచి పథకం అవుతుంది. ఈ పథకం కింద 65 లక్షల మంది భూయజమానులకు ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.65 వేల కోట్లు పంపిణీ చేసింది. ఇందులో రూ.6,500 కోట్లు 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్లు, ధనవంతులైన రైతులకు అందింది. వీళ్లలో మంత్రి మల్లారెడ్డి లాంటోళ్లు చాలా మంది ఉన్నారు. ఇంకో రూ.10 వేల కోట్లు రైతులు కానీ భూయజమానులకు అందింది. వారిలో సినిమా యాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులు, వ్యాపారులు ఉన్నారు. వ్యవసాయం చేయని ఇంతమందికి రైతు బంధు ఇచ్చిన ప్రభుత్వం.. నిజంగా కష్టపడి వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులను మాత్రం మరిచింది.

ఇప్పటి వరకు ఇచ్చిన ఇండ్లు 29 వేలే..

డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిస్థితి అయితే మరీ దారుణం. రాష్ట్రంలో కనీసం 10 లక్షల మందికి పూర్తిగా ఇండ్లే లేవు. గుడిసెలు, గుడారాల్లో ఉంటున్నారు. ‘గత ప్రభుత్వాలు ఒకే రూమ్​తో ఇండ్లు కట్టించాయి. అల్లుడు వస్తే అత్త చీర కట్టుకోలేని పరిస్థితి ఉంది’ అంటూ 2016లో కేసీఆర్ అన్నడు. కానీ, గత ప్రభుత్వాలు ఏడాదికి 2 లక్షల ఇండ్లు కట్టిస్తే.. ఈయన మాత్రం ఈ 9 ఏండ్లలో పట్టుమని లక్ష మందికైనా ఇండ్లు ఇచ్చింది లేదు. ఇప్పటిదాకా ఇచ్చిన ఇండ్లు కేవలం 29 వేలే. 2016లో 2,29,451 ఇండ్లను మంజూరు చేసిన కేసీఆర్ సర్కార్.. 1,13,535 ఇండ్లను పూర్తి చేసింది. కట్టి ఐదేండ్లయితున్నా వాటిని పేదలకు పంచడం లేదు. ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఇండ్లను మంజూరు చేయిస్తుండడంతో వాళ్లు లబ్ధిదారుల నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇక సొంత జాగాలో ఇండ్ల నిర్మాణానికి గతంలో రూ.5 లక్షలు ఇస్తామని, ఇప్పుడేమో రూ.3 లక్షలే ఇస్తామంటున్నారు.

- ఆకునూరి మురళి,
 ఎస్డీఎఫ్ కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్