మొన్నటికి మొన్న వానలు రికాంలేకుంట కురిసినయ్. వరదలొచ్చినయ్. ఊర్లు మునిగినయ్. ఇట్ల వాన ఎక్కువ కురిసినా.. కురవకున్నా ప్రాబ్లమే. దేశంలోనే ఎక్కువ వాన కురిసే ఏరియా ‘చిరపుంజి’ అని తెలుసు కదా... అక్కడ ఎప్పుడూ వాన పడతనే ఉంటది. ఆ వానకు తగ్గట్టు ప్రజల జీవనం ఉంటది. ఇట్ల ఎప్పుడూ వాన కురిసే ఊరే కాదు.. అసలు వాననే పడని ఊరుంది తెలుసా? వాన ఎప్పుడు పడుద్దో తెలియదు. అట్లని అది ఎడారి ప్రాంతం కాదు. పచ్చని ప్రకృతికి పెట్టింది పేరు కూడా. అదే ‘అల్ హుతైబ్’ ఊరు. ఇది యెమెన్‌లో ఉంది.
యెమెన్‌లోని అల్ హుతైబ్ ఒక అరుదైన ఊరు. అక్కడ వాన కురువదు. వాన పడకపోయినా జనాలు హాయిగా బతుకుతారు. పంటలు పండిస్తారు. ఆ ఊరు ప్రకృతి అందాలకు కూడా పెట్టింది పేరు. గ్లోబల్ టూరిస్టులను కూడా వెల్కం చెబుతుంది అల్ హుతైబ్.
రాజధాని ‘సనా’ శివారులో ఉంటుంది ఈ ఊరు.  భూమి నుంచి 3, 200 మీటర్ల ఎత్తులో కొండపై  ఉంటుంది.  ఎటు చూసినా అందమైన పరిసరాలుంటాయి.  చుట్టూ పచ్చని ప్రకృతి దృశ్యాలు  ఆకట్టుకుంటాయి. ఈ గ్రామంలో   ఇళ్లు  కూడా చాలా అందంగా ఉంటాయి. రాళ్లను చెక్కి వాళ్ల సంప్రదాయం ప్రకారం ఇళ్లు కట్టుకున్నారు.  వాటిని చూస్తే అర్బన్, రూరల్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది.   వాన ఎందుకు పడదంటే?
ఈ ఊళ్లో  వాన పడదంటే ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ, ఇక్కడ ఉరుములు, మెరుపులు, మేఘాలు అన్నీ  ఉంటాయి. మరి వాన కురవదెందుకు?  ఈ ఊరు  మేఘాల పైన ఉండటం వల్ల వాన పడదన్నమాట. సాధారణంగా మేఘాలు  భూమి నుంచి రెండు కిలోమీటర్ల  ఎత్తులో ఉంటాయి. ఈ ఊరు ఏకంగా  భూమికి మూడు కిలో మీటర్ల ఎత్తులో  ఉంటుంది.  అంటే.. మేఘాల పైన ఊరు ఉంటుంది. అందుకనే  మేఘాలు ఈ ఊరి కింది నుంచి పోతుంటయ్, కానీ వర్షించవు. వర్షం పడకుండా ఊళ్లో జనాలు ఎలా బతుకుతున్నారనే డౌట్ వచ్చింది కదా?   రాజధానికి దగ్గర్లోనే ఈ ఊరు ఉండటం వల్ల ట్రాన్స్‌పోర్టేషన్  బాగుంటుంది. కొండ కింది భాగంలో పంట పొలాలు  ఉన్నాయి. కొండపై ఉన్న ఊళ్లో వాతావరణం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కాకపోతే సూర్యోదయం అప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ వేడి ఉంటుంది.   రాత్రిళ్లు చలి కూడా  ఎక్కువే.
నీటి సౌలత్
నిజానికి యెమెన్‌లో నీటి సమస్య ఎక్కువే. పైగా సనాలో అది మరీ ఎక్కువ. ప్రపంచంలో ‘డ్రై సిటీ’ రాజధాని ఇదొక్కటే. దీంతో ‘సనా’ మున్సిపల్, వాటర్ కార్పొరేషన్ ఈ సమస్యలను తీర్చడానికి 2007లో కొత్త పద్ధతులు ఎంచుకుంది. మొబైల్ వాటర్ ట్యాంక్స్తో సిటీ మొత్తం వాటర్ సప్లయ్ చేస్తోంది. అక్కడ ఎత్తైన ఊరుగా ఉన్న అల్ హుతైబ్ కు కూడా మొబైల్ ట్యాంకులతో పాటు, పైపులతో నీళ్లను అందిస్తోంది. కొండ ప్రాంతంలో పోలాలు ఉంటాయి.
టూరిస్ట్ స్పాట్‌గా
కొండపై ఈ ఊరు ఉండడం వల్ల మేఘాల ప్రయాణం చాలా బాగా కనిపిస్తుంది. ఎప్పుడైనా వర్షం పడితే కొండపై నుంచి కిందికి వస్తూ వర్షాన్ని తాకొచ్చు. అలాగే కొండ కింది భాగంలో చిన్న చిన్న జలపాతాలు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి. ఇక్కడి ప్రజల లైఫ్‌స్టయిల్, ఇళ్ల ఆర్కిటెక్చర్, చేతికందే మేఘాలు ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఈ ఊరును చూడటానికి టూరిస్టులు లైన్ కడుతుంటారు.
అల్ హుతైబ్ కొండపై ‘క్వాట్’ అనే మొక్కలను ఎక్కువ పండిస్తారు. దీని నుంచి పూలు, మందులు తయారు చేస్తారు. ప్రధాన ఆదాయంగా ‘క్వాట్ కల్టివేషన్’ ఈ గ్రామంలో ఉంటుంది. దీనికి సనా వాటర్ కార్పొరేషన్ ఈ మొక్కల సాగు కోసం 37శాతం నీటిని అల్ హుతైబ్ కు అందిస్తుంది.
