ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

వ‌ట్‌ప‌ల్లి, వెలుగు :  దసరా పండుగ సందర్భంగా వ‌ట్‌ప‌ల్లిలో శనివారం ఏర్పాటు చేసిన అల‌య్ బ‌ల‌య్ కార్యక్రమం ధూం ధాంగా సాగింది. అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిర‌ణ్ ఆధ్వర్యంలో వ‌ట్‌పల్లి మార్కెట్ యార్డులో జరిగిన సంబరాలలో ప్రజా ప్రతినిధులు, తెలంగాణ సింగర్స్, రచయితలు, జ‌బ‌ర్దస్త్ ప్రోగ్రామ్​ ఆర్టిస్టులు సందడి చేశారు. ముందుగా భవానీ మాతకు, జమ్మి చెట్టుకు పూజలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప‌థ‌కాల‌ను పాట‌ రూపంలో ఎమ్మెల్సీ, రచ‌యిత గోరటి వెంక‌న్న వినిపించి అందరిని ఉత్సాహపరిచారు. సింగ‌ర్స్‌, రైట‌ర్స్ మిట్టపల్లి సురేంద‌ర్, మ‌ధుప్రియ వారి బృందం పాడిన పాట‌లు, జ‌బ‌ర్దస్త్​ ఆర్టిస్ట్ ర‌చ్చ ర‌వి చేసిన కామెడీ అంద‌రిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ఎంపీ  బీబీపాటిల్, ప్రెస్ అకాడ‌మి చైర్మన్​ అల్లం నారాయ‌ణ హాజ‌రయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు అందరిని ఒక దగ్గరకు చేర్చి మంచితనాన్ని నేర్పిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కులు చంటి రాహుల్ కిర‌ణ్‌, మ‌ఠం భిక్షపతి, పైతర సాయికుమార్‌, ఎంపీపీ ప‌త్రి కృష్ణవేణి న‌ర్సింలు, జ‌డ్పీటీసీ అప‌ర్ణ శ్రీ‌కాంత్, మునిప‌ల్లి ఎంపీపీ శైలజ‌,  టీఆర్ఎస్ మండ‌ల అధ్యక్షుడు గోపాల్‌, స‌ర్పంచ్ సురేఖ బుద్దిరెడ్డి, ప్రధాన కార్యద‌ర్శి శివాజీ రావు, వైస్ ఎంపీపీ నాగ‌రాణి బస్వరాజ్‌, ఎంపీటీసీ ఇందిరాబాయి రాజేంద‌ర్‌, రైతుబంధు మండ‌ల అధ్యక్షుడు అశోక్‌గౌడ్, నియోజ‌క‌వ‌ర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

లీఫ్ ఆర్టిస్టుకు బంగారు బతుకమ్మ అవార్డు

నారాయణ్ ఖేడ్, వెలుగు:  నారాయణఖేడ్ పట్టణానికి చెందిన లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ ను శనివారం హన్మకొండలో విస్త్రం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి బంగారు బతుకమ్మ అవార్డు, కళాసామ్రాట్ బిరుదుతో సత్కరించారు. ఈ కార్యక్రమం పట్టణంలోని పోతన విజ్ఞానపీఠంలో జరిగింది. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ఆకుపైన వేసిన చిత్రాలకు రాష్ట్రస్థాయి అవార్డు దక్కడం ఆనందంగా ఉందన్నారు. 

కేసుల్లో శిక్షల శాతం పెంచాలి

సిద్దిపేట రూరల్, వెలుగు : లాంగ్ పెండింగ్  ట్రయల్  కేసులలో శిక్షల శాతం పెంచాలని సీపీ ఎన్.శ్వేత అన్నారు. శనివారం సీపీ ఆఫీస్ లో ఆమె పోలీస్ అధికారులు, సర్కిల్ కోర్టు డ్యూటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సర్కిల్, డివిజన్ వారీగా జిల్లాలో వివిధ కోర్టులలో లాంగ్ పెండింగ్ ట్రయల్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోర్టులో పెండింగ్ ఉన్న కేసులను చాలెంజ్​గా తీసుకొని డిస్పోజల్ చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏసీపీలు దేవారెడ్డి, రమేశ్, సతీశ్, రవీందర్ రాజు, రఘుపతి రెడ్డి, సైదా నాయక్, దుర్గ పాల్గొన్నారు.

త్వరలో మహిళా సపోర్ట్ సెంటర్..

మహిళల రక్షణ కోసం త్వరలో జిల్లాలో మహిళా సపోర్ట్ సెంటర్ ప్రారంభించనున్నట్లు సీపీ శ్వేత తెలిపారు. శనివారం సీపీ ఆఫీస్ లో మహిళల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆమె పోలీస్ అధికారులకు అవగాహన కల్పించారు. సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మహిళా సపోర్ట్ సెంటర్ ను ప్రారంభిస్తామన్నారు. గృహహింస, వరకట్నం కేసులలో హైకోర్టు ఆదేశానుసారం సెంటర్​లో మూడుసార్లు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, కౌన్సిలింగ్ పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు ఆమె సూచించారు. 

కేసుల్లోని వెహికల్స్​ను తీసుకెళ్లండి

సిద్దిపేట రూరల్, వెలుగు : జిల్లాలోని పోలీస్ స్టేషన్ ల పరిధిలో వివిధ కేసులలో పట్టుబడ్డ  75 వాహనాలను డాక్యుమెంట్లు చూపి ఆరు నెలలలోపు యజమానులు తీసుకెళ్లాలని సీపీ శ్వేత  సూచించారు. లేకపోతే ఆ వెహికల్స్​ను వేలం వేస్తామని తెలిపారు. వివిధ కేసులలో ఉన్న వాహనాలు పెద్ద కోడూరు గ్రామ శివారులో ఉన్న సీఏఆర్ హెడ్ క్వార్టర్ లో ఉంచామని, ఆరు నెలల్లోపు బాధితులు తమ వాహనాలను గుర్తించి తీసుకెళ్లాలని చెప్పారు. వాహనాల్లో 65 బైక్ లు, ఐదు ఆటోలు, ఐదు ఫోర్ వీలర్లు ఉన్నాయని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఆర్ఎస్ఐ వెంకటేశం 9440504908, సీసీఆర్బీ ఇన్స్​పెక్టర్ సైదా నాయక్ 8333998690, రిజర్వ్ ఇన్స్​పెక్టర్ ధరణి కుమార్ 833998698 ను సంప్రదించాలని కోరారు.

బీజేపీ సభకు భారీ ఏర్పాట్లు

నర్సాపూర్, వెలుగు : నర్సాపూర్ పట్టణంలో ఆదివారం నిర్వహించే బీజేపీ బహిరంగ సభకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. భారీ కటౌట్లు, కాషాయ జెండాలను పెట్టారు. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, పరకాల మాజీ ఎమ్మెల్యే భిక్షపతి తన అనుచరులతో బీజేపీలో చేరనున్నారు. సభకు భారీ సంఖ్యలో జనాలను తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సభకు ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి తరుణ్​ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, చేరికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరు కానున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు.

కాలుష్య సమస్య పరిష్కరించట్లేదని కంపెనీకి తాళం

మెదక్ (మనోహరాబాద్), వెలుగు:  కాలుష్యం సమస్యపై ప్రజలు కన్నెర్ర చేశారు. మేనేజ్​మెంట్ కు ఎన్నిసార్లు చెప్పినా, ఆందోళనలు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహించి ఏకంగా కంపెనీకి తాళం వేశారు. ఈ ఘటన శనివారం రాత్రి మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం చెట్ల గౌరారంలో జరిగింది. రంగాయపల్లి, చెట్ల గౌరారం గ్రామ సరిహద్దుల్లో ఉన్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీ నుంచి దట్టమైన పొగలు వెలువడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం గంటల తరబడి పెద్ద మొత్తంలో కాలుష్యం వెలువడి ప్రజలకు ఇబ్బంది కలిగింది.  దీంతో రంగాయపల్లి గ్రామస్తులు తరలి వచ్చి కంపెనీ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కంపెనీ గేట్ కు తాళం వేశారు. దీంతో లోపల ఉన్న కార్మికులు బయటకు రాలేకపోగా, రాత్రి షిఫ్ట్ లో కంపెనీకి వెళ్లాల్సిన వారు బయటే ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు రెండు గంటల పాటు ఆందోళన కొనసాగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ప్రజలకు నచ్చజెప్పి కంపెనీకి వేసిన తాళం తీయించారు.

పిచ్చి కుక్కల దాడిలో ఆరుగురికి గాయాలు

తూప్రాన్, వెలుగు : పిచ్చికుక్కల దాడితో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ లో శనివారం జరిగింది. పట్టణంలోని 4వ వార్డులో  హరిణి(03) పై కుక్క దాడి చేయడంతో పక్కనే ఉన్న దుర్గయ్య అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో కుక్కలు అతడిని కూడా కరిచాయి. ఆ తర్వాత చంతు(48) జస్మత్ (07) విక్రమ్​సింగ్(03)తోపాటు మరొకరిపై దాడి చేశాయి. వీరిలో తీవ్రంగా గాయపడిన దుర్గయ్య, హరిణిని బెటర్​ ట్రీట్మెంట్​ కోసం హైదరాబాద్ కు తరలించారు. మిగతావారికి తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేశారు. 

వీఆర్ఏల రాస్తారోకో

'మెదక్ (శివ్వంపేట), వెలుగు : తమ న్యాయమైన డిమాండ్ లను తీర్చాలంటూ వీఆర్ఏలు శనివారం  శివ్వంపేట మండల కేంద్రంలో తూప్రాన్–నర్సాపూర్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. స్థానిక తహసీల్దార్ ఆఫీస్ నుంచి ర్యాలీగా తరలి వచ్చి రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించగా, అక్కడ కూడా వారు ధర్నాకు దిగారు. కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు బాలయ్య,  సత్తయ్య,  శ్రీకాంత్, దుర్గేశ్ పాల్గొన్నారు.

ట్రాక్టర్, బైక్​ఢీకొని ఒకరు మృతి

కోహెడ(హుస్నాబాద్​), వెలుగు : ట్రాక్టర్, బైక్​ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మండలంలోని మాలపల్లికి చెందిన బండి వెంకటయ్య(42) తన తమ్ముడు మొగిలితో కలిసి బైక్​పై హుస్నాబాద్​వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తున్నారు. ఎల్లమ్మ చెరువు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్​ వారి బైకును వేగంగా ఢీకొట్టింది. దీంతో బైక్​పైన ఉన్న ఇద్దరు అన్నదమ్ములకు తీవ్ర గాయలయ్యాయి. వారిని స్థానికులు కరీంనగర్​ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకటయ్య చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

బీజేపీ లీడర్లను వేధిస్తున్న సీఐపై చర్యలు తీసుకోవాలి

చేర్యాల, వెలుగు :  బీజేపీ లీడర్లను వేధిస్తున్న చేర్యాల సీఐ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు చేసినట్టు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొంగొని సురేశ్​గౌడ్ తెలిపారు. శనివారం ఆయన మద్దూరులో మీడియాతో మాట్లాడారు. చిన్న గొడవ విషయంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తనతోపాటు బీజేవైఎం మండల​ అధ్యక్షుడు శ్రీకాంత్, కార్యకర్త బస్వరాజుస్వామిని సీఐ తిడుతూ తమ వద్ద ఉన్న ఫోన్లు లాక్కుని కొట్టారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి సీఐ తొత్తుగా మారాడని మండిపడ్డారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అధికార పార్టీకి వత్తాసు పలికితే సమాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వెంటనే సీపీ స్పందించి  సీఐపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట బీజేవైఎం జిల్లా కార్యదర్శి మనోజ్ కుమార్, నాయకులు బసవరాజుస్వామి, బొల్లు కృష్ణ, గొడుగు ప్రశాంత్, బొల్లు రాజు, ఏలూరు శివ కృష్ణ,  కానకుంట్ల ప్రశాంత్, బాలకృష్ణ, రవి, కనకయ్య,  చింతల చందు,  రాకేశ్​పటేల్,  బైరి శ్రీకాంత్,  బొడ్డు ప్రశాంత్, సుఖేశ్​ఉన్నారు. 

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

మెదక్ (పెద్దశంకరంపేట), వెలుగు:  బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ పెద్దశంకరంపేట మండల శాఖ అధ్యక్షుడు కోణం విఠల్ అన్నారు. శనివారం మండల పరిధిలోని గొట్టిముక్కులలో ఆయన బీజేపీ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు బీజేపీలో చేరారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ బీజేపీ నాయకులు పత్రి రామకృష్ణ, మారుతి రెడ్డి, శేరి రామకృష్ణ, పేట మండల నాయకులు శ్రావణ్, సాయిలు, కుమార్, అంజయ్య, విశ్వనాథం పాల్గొన్నారు. 

కరెంట్ షాక్ తో వ్యక్తి..

సిద్దిపేట రూరల్, వెలుగు : ఇంట్లో కరెంట్ రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ మండలం బూర్గుపల్లి గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం. గ్రామానికి చెందిన గంగాధరి బాలమల్లు(45) వ్యవసాయంతో పాటు ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తూ  జీవనం సాగిస్తుండేవాడు. శనివారం తన ఇంట్లో విద్యుత్ సమస్య రావడంతో మెయిన్ బోర్డును రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి కిందపడిపోయాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.  

ఉర్సులో పాల్గొన్న నేతలు

మెదక్ (శివ్వంపేట), వెలుగు : శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కుల గ్రామంలో శనివారం జరిగిన ఉర్సు ఉత్సవాలలో  రాష్ట్ర మహిళా కమిషన్ చైర్​పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొన్నారు. వారి వెంట సర్పంచ్ బాలమణి నరేందర్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్ అలీ, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి, ఎంపీటీసీ దశరథ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణారావు, ఆంజనేయులు, వీరస్వామి ఉన్నారు. 

అస్వస్థతతో వీఆర్ఏ మృతి

మెదక్ (చేగుంట), వెలుగు: అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ ఓ వీఆర్ఏ మృతి చెందాడు. ఈ ఘటన మెదక్​ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లిలో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన వీఆర్ఏ చెంది సత్తయ్య (41) ఈ నెల 5న ఇంట్లో కళ్లు తిరిగి పడిపోయాడు. అతడిని వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు శనివారం చనిపోయాడు. అయితే సత్తయ్య వీఆర్​ఏల విషయమై బెంగతోనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమ్మె కారణంగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడం, కుటుంబ పోషణ భారంగా మారడంతో రోజూ తమతో చర్చిస్తూ బాధపడేవాడని చెబుతున్నారు. మృతుడికి భార్య స్వరూప, కూతురు అఖిల ఉన్నారు. 

బెల్ట్ షాపులను బంద్​ చేయాలి

  • ఎక్సైజ్​ స్టేషన్​ ఎదుట గ్రామస్తుల ధర్నా

కోహెడ(హుస్నాబాద్​), వెలుగు : బెల్ట్ షాపులను బంద్​ చేయాలని డిమాండ్ చేస్తూ కోహెడ మండలం బస్వాపూర్​ గ్రామస్తులు శనివారం హుస్నాబాద్ ఎక్సైజ్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బస్వాపూర్ లో బెల్ట్ షాపులు విచ్చల విడిగా నడుపుతున్నారన్నారు. ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు అమ్ముతూ దోచుకుంటున్నారని, అయినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని వాపోయారు. బెల్ట్​ షాపులలో మద్యంతో పాటు మత్తు పదార్థాలు అమ్ముతున్నారని ఆరోపించారు. అనంతరం ఎక్సైజ్​ ఆఫీసర్లకు వినతిపత్రం అందజేశారు. ఇదిలా ఉండగా గ్రామంలో బెల్ట్​ షాపులను నడపొద్దని, నడిపితే రూ.20 వేల ఫైన్​ విధిస్తామని తీర్మానం చేసినట్లు వారు తెలిపారు.

బీజేపీ లీడర్ల అరెస్టు

కంది, వెలుగు : కంది మండలం బ్యాతోల్​గ్రామ సమీపంలో శనివారం బీజేపీ లీడర్లను పోలీసులు అరెస్టు చేశారు. విజయదశమి పండుగ సందర్భంగా బుధవారం బ్యాతోల్​గ్రామంలో కొందరు ఒక ప్రాంతంలో పూజలు చేశారు. అయితే పూజలు నిర్వహించిన స్థలం తమదని మరోవర్గానికి చెందినవారు పూజలు చేసిన జెండాలను తొలగించారు. ఈ విషయమై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు శనివారం బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి రాజేశ్వర్​ రావు దేశ్​పాండే ఆధ్వర్యంలో పార్టీ నాయకులు గ్రామానికి వెళ్తున్నారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. నాయకులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్​స్టేషన్లకు తరలించారు.

చెరువులో పడి యువకుడు..

రామాయంపేట, వెలుగు : ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మెదక్​ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారంలో శనివారం జరిగింది. స్థానిక ఎస్సై రాజేశ్​తెలిపిన ప్రకారం..  గ్రామానికి చెందిన మల్లంగారి వెంకట్ రెడ్డి చిన్న కొడుకు ప్రశాంత్ రెడ్డి (25) శుక్రవారం పొలం వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. కాగా శనివారం అతడి మృతదేహం చెరువులో కనిపించింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.