
- 15 రోజుల్లో పూర్తిస్థాయిలో వైద్యం
- ఎన్నికల ముందు హడావిడిగా ప్రారంభం
- డాక్టర్లు, సౌకర్యాల్లేక ఇప్పటిదాకా వైద్యం కరువు
గద్వాల, వెలుగు: గద్వాల జిల్లా అలంపూర్‌లో వంద పడకల దవాఖాన అందుబాటులోకి రానుంది. బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓట్లు దండుకోవాలన్న ఆలోచనతో అలంపూర్ చౌరస్తాలో నిర్మించిన ఆస్పత్రిని హడావుడిగా అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించకపోవడం, ఎలాంటి సౌకర్యాలుగానీ.. పరికరాలు గానీ ఏర్పాటు చేయకపోవడంవల్ల రోగులకు సేవలు అందలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సౌకర్యాలు కల్పించి సేవలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. బుధవారం నుంచి అవుట్పేషంట్సేవలు అందుబాటులోకి రానున్నాయి. 15 రోజుల్లో మిగిలిన అన్ని రకాల వైద్య సేవలు అందించనున్నట్టు అధికారులు చెప్తున్నారు.
ఈ హాస్పిటల్ ప్రారంభిస్తే ఇటిక్యాల, ఎర్రవల్లి, మానవపాడు, ఉండవెల్లి, అలంపూరు మండలాల ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా ఇక్కడి ప్రజలు కర్నూల్ హాస్పిటల్ కి వెళ్లాల్సివస్తోంది. హైవే మీద ప్రమాదాలు జరిగిన సందర్భాల్లోనూ గాయపడిన వారిని అటు మహబూబ్‌నగర్‌కు గానీ.. ఇటు కర్నూలుకు గానీ తరలించేవారు. ఇప్పుడు అలంపూర్ చౌరస్తాలోనే అస్పత్రి ఉండడంవల్ల యాక్సిడెంట్ జగిగితే పేషంట్లకు గోల్డన్ అవర్లోనే వైద్యం అందుతుందని, చాలామంది ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో తీవ్ర నిర్లక్ష్యం
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి బీఆర్ఎస్ సర్కార్ అలంపూర్ హాస్పిటల్ ను ఓపెన్ చేసి చేతులు దులుపుకుంది. డాక్టర్లను, సిబ్బందిని నియమించలేదు. ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయలేదు. దీంతో హాస్పిటల్ ప్రారంభించినా ఇక్కడి రోగులకు ఏ ప్రయోజనం కలుగలేదు. గద్వాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కావడంతో అక్కడ ఉన్న జిల్లా ఆస్పత్రి.. గవర్నమెంట్జనరల్హాస్పిటల్గా అప్‌గ్రేడ్ అయ్యింది. దీంతో అది వైద్యవిధాన పరిషత్ పరిధి నుంచి డీఎంఈ పరిధిలోకి మారింది. దీంతో గద్వాలలో వైద్యవిధాన పరిషత్ కింద పని చేస్తున్న పలువురు డాక్టర్లు, స్టాఫ్ నర్సులను అలంపూర్ కు బదిలీ చేశారు.
ఇక్కడకు బదిలీ అయిన డాక్టర్లలో సివిల్ సర్జన్ ప్రవీణ్, డెంటల్ సర్జన్ వృషాలి, అనస్థీషియనిస్ట్ వినోద్, జనరల్ ఫిజీషియన్లు అమీర్, కిరణ్ , పీడియాట్రిషియన్ శ్యామ్ ఉన్నారు. మిగిలిన విభాగాలకు చెందిన డాక్టర్లు 15 రోజుల్లో రానున్నారు. 12 మంది నర్సులు, 8 మంది స్వీపర్లు, నలుగురు సెక్యూరిటీ గార్డ్ లు కూడా విధుల్లో చేరారు. అల్ట్రా సౌండ్ స్కానర్స్, ఓటీ లైట్, ఓటీ టేబుల్స్, డెలివరీ టేబుల్స్, ఆక్సిజన్ సిలిండర్స్, ఎక్స్‌రే మెషీన్ఏర్పాటు చేశారు. హాస్పిటల్ లో స్వీపర్సు, సెక్యూరిటీ గార్డ్స్ తదితర సిబ్బందిని నియమించేందుకు ఏజన్సీకి బాధ్యతలు అప్పగించారు. అయితే తాము చెప్పిన వాళ్లనే పనిలో పెట్టుకోవాలని అటు బీఆర్ ఎస్ కు చెందిన ఎమ్మెల్యే అనుచరులతో పాటు ఇటు కాంగ్రెస్ లీడర్లు ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.
మొదట ఓపీ .. తర్వాత మిగతా సేవలు
అలంపూర్ హాస్పిటల్ లో బుధవారం నుంచి ఓపీ సేవలు మొదలు పెడుతున్నాం. త్వరలోనే మిగతా అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే హాస్పిటల్ లో 80శాతం వరకు ఎక్విప్ మెంట్ వచ్చింది. ఇంకా కొన్ని వైద్యపరికరాలు రావాల్సిఉంది.
సయ్యద్ భాష, సూపరింటెండెంట్, అలంపూర్ హాస్పిటల్