స్టార్టప్​లలో అలజడి.. 2022 నుంచి 30 వేల మంది ఔట్​

స్టార్టప్​లలో అలజడి.. 2022 నుంచి 30 వేల మంది ఔట్​
  • ఈ ఏడాదే 13 వేల మందికి లేఆఫ్

న్యూఢిల్లీ:  నిధులు రాకపోవడం, వ్యాపారాలు సక్సెస్​ కాకపోవడం, గ్లోబల్​ మార్కెట్లలో ఇబ్బందుల వంటి వాటివల్ల భారతీయ స్టార్టప్​లు తమ ఉద్యోగులను విపరీతంగా తొలగిస్తున్నాయి.  ఇవి 2022 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 30వేల మందిని ఇంటికి పంపించాయి. ఎడ్​టెక్​  స్టార్టప్ ​ బైజూస్‌‌‌‌ త్వరలో దాదాపు నాలుగు వేల మందిని తొలగించే అవకాశాలు ఉన్నాయి. 2022 నుంచి ఇప్పటి వరకు, దాదాపు 95 స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు దాదాపు 31,965 మంది ఉద్యోగులను తొలగించాయి. ఖర్చులను తగ్గించడం,  లాభదాయకతను పెంచడమే లక్ష్యంగా లేఆఫ్​లు ఇస్తున్నాయి.  గత కొన్ని నెలలుగా తొలగింపుల సంఖ్య మందగించింది. ఇక నుంచి అయినా తమకు మంచి రోజులు వస్తాయని స్టార్టప్​ల ఉద్యోగులు ఆశిస్తున్నారు. అయితే, 2023లోనే సుమారు 49 స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు దాదాపు 13వేల మంది ఉద్యోగులను తొలగించాయి. చాలా స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు గుట్టుచప్పుడు కాకుండా లేఆఫ్‌‌‌‌‌‌‌‌లను ఇస్తున్నందున అసలు తొలగింపుల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, గత ఏడాది 51 స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు ఉద్యోగులను తొలగించగా, ఈ ఏడాది కేవలం తొమ్మిది నెలల్లో 49 స్టార్టప్​లు ఇప్పటికే తమ ఉద్యోగులను ఇంటికి పంపించాయి. డన్జో, బైజూస్, క్యూమాత్  సహా మరిన్నో స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు చాలా రౌండ్లలో లేఆఫ్​లు ఇచ్చాయి. ఆన్​లైన్​లో క్లాసులు నిర్వహించే బైజూస్ ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎడ్‌‌‌‌‌‌‌‌టెక్ స్టార్టప్. నష్టాల కారణంగా సంస్థలో భారీ మార్పులకు రెడీ అయింది. సంస్థ కొత్త సీఈఓ అర్జున్ మోహన్  నాలుగు వేల నుంచి ఐదు వేల ఉద్యోగాలను తొలగిస్తారనే భయాలు ఉన్నాయి.  2022 ప్రారంభం నుంచి ఇది  సుమారు 10వేల మందికి పింక్​స్లిప్​లు ఇచ్చింది.

నిధుల కొరతే అసలు సమస్య

పీక్ ఎక్స్​వీ (గతంలో సెకోవియా ఇండియా​), టెమాసెక్,  ఆల్ఫా వేవ్ వెంచర్స్ వంటి పెట్టుబడిదారుల మద్దతు ఉన్న నియోబ్యాంకింగ్ స్టార్టప్  ‘ఫై’ తన సిబ్బందిలో 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు సెప్టెంబరు 27న ప్రకటించింది. ఈ ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్ కంపెనీ ఆర్థిక సమస్యల కారణంగానే ఈ చర్య తీసుకుంటోంది. భారతీయ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు ఆగస్టు 2023లో ప్రైవేట్ ఈక్విటీ  వెంచర్ క్యాపిటల్ ఫండ్స్​ నుంచి 376 మిలియన్ డాలర్లను సేకరించాయి. అయితే ఇదే ఏడాది జులైలో వీటి విలువ 523 మిలియన్ డాలర్లు ఉందని వెంచర్ ఇంటెలిజెన్స్ డేటా తెలిపింది. ఇందులో గ్రాసరీ డెలివరీ స్టార్టప్​ జెప్టో వాటాయే 200 మిలియన్ డాలర్లు ఉంది. నిధులు రావడం లేదు కాబట్టి మరిన్ని కంపెనీలు మనుగడ కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాయని అంచనా.