
జోగులాంబ గద్వాల: మద్యం మత్తులో ఓ మహిళ తన సొంత పిల్లలను చెరువులోకి తోసేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటన మల్లాపూర్ గ్రామం, కేటీ దొడ్డి మండలంలో చోటు చేసుకుంది. తాగుడుకు బానిసగా మారిన 32 ఏళ్ల మహిళ.. మద్యం మత్తులో తన ముగ్గురు పిల్లలను చెరువులోకి తోసేసి, తానూ నీళ్లలోకి దూకేసింది. ఆ పిల్లల్లో ఒకరికి పదేళ్లు, మరొకరికి మూడేళ్లు కాగా.. చిన్నపాపకు 11 నెలల వయస్సు. తొలుత ఇద్దరు పెద్ద కూతుళ్లను నీటిలోకి తోసిన మహిళ.. ఆ తర్వాత చిన్న పాపను నడుముకు తువ్వాళతో కట్టుకొని చెరువులోకి దూకింది. తల్లితోపాటు మిగిలిన ముగ్గురు పిల్లల శవాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతానికి సమీపంలోని పొలాల్లో సదరు మహిళ భర్త పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు.