- కాగజ్ నగర్ ఎఫ్‌డీవో అప్పయ్య
కాగజ్‌నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ కు ఆనుకుని ఉన్న మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజురా ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచారంపై అలర్ట్ గా ఉన్నామని ఎఫ్ డీవో అప్పయ్య తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కాగజ్‌నగర్ అడవులకు 80 కిలోమీటర్ల దూరంలో 30 ఏనుగుల గుంపు సంచరిస్తోందని చెప్పారు. కొన్నేళ్ల కింద ప్రాణహిత మీదుగా రాష్ట్రంలోకి రావడంతో ప్రాణ నష్టం జరిగిందని గుర్తు చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రంలోకి వచ్చినా ఎదుర్కొనేందుకు అటవీ శాఖ సిద్ధంగా ఉందన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా ఏనుగుల గుంపు కనిపిస్తే అక్కడికి వెళ్లవద్దని సూచించారు. ఫొటోలు, వీడియోలు తీసేందుకు దగ్గరగా వెళ్లడం, వాటిని బెదిరించేందుకు పటాకులు కాల్చడం, డప్పు చప్పుళ్ళు చేసి భయపెట్టడం చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రస్తుతం ఏనుగుల గుంపు ఛత్తీస్గఢ్ అడవుల వైపు వెళ్తున్నట్లు సమాచారం ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. సరిహద్దు గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు అవగాహన, టామ్ టామ్ వేయిస్తున్నారని చెప్పారు. ఏనుగుల సంచారంపై ఎలాంటి సమాచారం తెలిసినా సమాచారం ఇవ్వాలని కోరారు.
