కరీంనగర్ కాంగ్రెస్‍లో రసవత్తర రాజకీయం

కరీంనగర్ కాంగ్రెస్‍లో రసవత్తర రాజకీయం
  •     అల్గిరెడ్డి తరఫున అనుచరుల నామినేషన్​
  •     బరిలో ఉంటానంటున్న మాజీ ఎమ్మెల్యే
  •     రెండు సెట్ల నామినేషన్లు వేసిన వెలిచాల భార్య  రేఖ

కరీంనరగ్, వెలుగు : కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తరఫున ఆయన అనుచరులు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ప్రవీణ్​ రెడ్డి స్వయంగా మరో సెట్ నామినేషన్ దాఖలు చేస్తారని వెల్లడించారు. ఇప్పటికే ఈ నెల 22న కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ వేయగా, ఆయన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం బుధవారం రాత్రి ఖరారు చేసింది.

  బీఫాం కూడా అందజేసింది. అయితే, అంతకుముందే ప్రవీణ్ రావు తాను బరిలో ఉంటున్నట్లు ప్రకటించడం చర్చనీయంశంగా మారింది. ప్రవీణ్​రెడ్డి అనుచరులు మాత్రం గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రవీణ్ రెడ్డికి లోక్ సభ టికెట్ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని, ప్రవీణ్ రెడ్డి కచ్చితంగా పోటీలో ఉంటారని చెప్తున్నారు. 

రెండు సెట్ల నామినేషన్లు వేసిన రాజేందర్ రావు భార్య రేఖ

ప్రవీణ్​ రెడ్డి అనుచరులు నామినేషన్ వేసిన కొద్దిసేపటి ముందే కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు భార్య రేఖ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. స్ర్కూటినీలో రాజేందర్ రావు నామినేషన్ పై ఏవైనా అభ్యంతరాలు తలెత్తితే పోటీలో నిలిచేందుకే ముందు జాగ్రత్తగా ఆమెతో నామినేషన్లు వేయించినట్లు తెలిసింది. ఒకవేళ ప్రవీణ్​రెడ్డి కాంగ్రెస్ రెబల్​గా పోటీలో నిలిస్తే ప్రధానంగా హుస్నాబాద్, హుజురాబాద్ నియోజకవర్గాలతోపాటు ఇతర నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలుతుందనే చర్చ జరుగుతోంది.

ఖమ్మంలో మరో  ముగ్గురి నామినేషన్​

ఖమ్మం : ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బుధ వారం నలుగురు నామినేషన్లు వేశారు. మంగళవారం రామసహాయం రఘురాం రెడ్డి తరపున మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి అనుచరులు రెండు సెట్ల నామినేషన్లు వేయగా, బుధవారం మరో ముగ్గురు దాఖలు చేశారు. ఖమ్మం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో రాయల నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు, నాగ సీతారాములు కాంగ్రెస్ అభ్యర్థులుగానే నామినేషన్లు వేయడం సంచలనంగా మారింది. ఎవరికివారు తమకు హై కమాండ్ నుంచి సానుకూల సంకేతాలు ఉండడం వల్లే నామినేషన్ వేశామని చెబుతుండగా, బుధవారం రాత్రి ఖమ్మం అభ్యర్థిగా పార్టీ హైకమాండ్​ రఘురాంరెడ్డిని ప్రకటించి..బీఫాం కూడా అందజేసింది.