అలియా భట్ లీడ్ రోల్‌లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న 'స్పై యూనివర్స్' సినిమాల్లో ఇదొకటి. అయితే ఇందులో అలియా పోషిస్తున్న క్యారెక్టర్ గురించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన ఈ సిరీస్ సినిమాలు అన్నింటిలో హీరోహీరోయిన్స్ స్పై ఏజెంట్స్ కాగా, ఇందులో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా అలియా పాత్ర ఉండబోతోందట. ఆమె ఓ పవర్‌ఫుల్ ఆల్ఫా కిల్లర్‌గా కనిపించబోతోందని తెలుస్తోంది.
చిన్నప్పటినుంచి కేవలం ప్రత్యర్థులను అంతమొందించడానికే ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఓ ప్రొఫెషనల్ హంతకురాలుగా నెగెటివ్ షేడ్స్ ఉండే యాంటీ-హీరో పాత్రలో అలియా నటిస్తోందని బాలీవుడ్ టాక్. తను తీసుకునే నిర్ణయాలు, తన కండిషన్స్ అన్నీ అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటూ ఆసక్తి రేపుతాయట.
అంతేకాక తను చేసిన భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయని సమాచారం. అలియాతో పాటు శర్వరీ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి 'ది రైల్వే మెన్' వెబ్ సిరీస్ ఫేమ్ శివ్ రవైల్ దర్శకత్వం వహిస్తున్నారు. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తుండగా అనిల్ కపూర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. జులై 10న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఓ వారం ముందుగా అంటే జులై 3నే రాబోతోంది.
