లవ్లో పడతారు గంగూబాయ్తో

లవ్లో పడతారు గంగూబాయ్తో

‘ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌’ సినిమాతో టాలీవుడ్‌‌లో ఎంట్రీ ఇస్తుందనుకుంటే.. ఆ సినిమా రిలీజ్ లేటవ్వడంతో ఈలోపు ‘గంగూబాయ్ కథియావాడి’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఆలియా భట్. సంజయ్‌‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో జయంతీలాల్ గడ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆలియా చెప్పిన సంగతులు. 

  •     ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దాంతో ప్రేక్షకులు థియేట్రికల్ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ని మర్చిపోయారేమో, ఇంతకు ముందులా థియేటర్లకి రారేమో అని టెన్షన్ పడ్డాను. కానీ ఓ మంచి సినిమాని చూడ్డానికి ప్రేక్షకులు థియేటర్లకి తప్పకుండా వస్తారని ‘పుష్ప’ సినిమా నిరూపించింది. దాంతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. 
  •      ఈ సినిమా కథ విన్నప్పుడు ‘నేనిది చేయగలనా’ అని దర్శకుడిని ఆయన్ని అడిగాను. ఎందుకంటే గతంలో నేను పోషించిన పాత్రలకి పూర్తి డిఫరెంట్‌‌గా ఉందిది. కానీ నేను చేయగలనని ఆయన నమ్మారు. నాకు ధైర్యం చెప్పారు.  
  •     నేను చేసే పాత్రని పాత్రలా చూడను. నన్ను నేను అలా ఊహించుకుంటాను. డైరెక్టర్ విజన్‌‌కి తగ్గట్టు నన్ను నేను మార్చుకుంటాను. వాళ్లేం చెబితే అది చేస్తాను. అయితే ఈ సినిమా విషయంలో ఆ పద్ధతులేం పనికి రాలేదు. సంజయ్‌‌ సర్‌‌‌‌ స్క్రిప్ట్‌‌లో చాలా మార్పులు చేసేస్తుండేవారు. ే
  •  ఈ పాత్ర వాయిస్‌‌ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేశాను. గంగూబాయ్‌‌ చిన్నగా ఉన్నప్పుడు, పెద్దయిన తర్వాత తన వాయిస్‌‌లో మార్పు ఎలా చూపించాలనే దానిపై ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. అలాగే గుజరాతీ యాస పట్టుకోవడం కాస్త కష్టమయ్యింది. పైగా గంగూబాయ్ కథంతా 1950ల కాలంలో జరిగింది కదా. అప్పటి పరిస్థితుల్ని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా నటించాల్సి వచ్చింది. కొన్ని సీన్స్ కోసం బరువు కూడా పెరగాల్సి వచ్చింది.  
  •     సినిమా చూశాక అందరూ గంగూబాయ్‌‌ పాత్రతో లవ్‌‌లో పడిపోతారు. నేనైతే పూర్తిగా తన ప్రపంచంలోకి వెళ్లిపోయాను. నేను కామాఠిపురని ఎప్పుడూ చూడలేదు. ముంబైలోని ఫిల్మ్ సిటీలో వేసిన కామాఠిపుర సెట్‌‌ మాత్రమే చూశాను. కానీ అక్కడికి వెళ్లగానే వేరొక మనిషిలా మారిపోయేదాన్ని. ఇంట్లో కూడా నాకు తెలియకుండానే గంగూబాయ్‌‌లా కూర్చునేదాన్ని. తనలాగే మాట్లాడేదాన్ని. మా ఇంట్లో వాళ్లంతా ‘నువ్వు ఆలియావి కాదా’ అనేవారు. ఒకరు మరొకరిలా మారడం అంత ఈజీ కాదు. నేను మారానంటే ఆ క్యారెక్టర్ ఎంతో ఎమోషనల్‌‌గా ఉండటం వల్లే.
  •     గంగూబాయ్ జీవితాన్ని మలుపు తిప్పిన వ్యక్తి పాత్రలో అజయ్ దేవగన్ నటించారు. అంత గొప్ప నటుడితో కలిసి పని చేయడం నా అదృష్టం. చెప్పిన టైమ్‌‌ కంటే ముందే సెట్‌‌కి వచ్చేస్తారాయన. నాకంటే ముందే ఎక్కడ వచ్చేస్తారో అని తెగ టెన్షన్ పడేదాన్ని. నాకెన్నో సలహాలు, సూచనలు కూడా ఇచ్చేవారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను.  
  •     మొదట్నుంచీ ప్యాన్ ఇండియా యాక్టర్ అవ్వాలనేది నా కల. శ్రీదేవి తెలుగు, తమిళం, హిందీ అంటూ ప్రతి భాషలోనూ స్టార్ అయ్యారు. నేనూ అలా అవ్వాలి. అందుకు భాష సరిహద్దు కాదని నేను నమ్ముతాను. ‘ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌’ లాంటి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. దేవుడి దయవల్ల అక్కడితో ఆగిపోకుండా తెలుగులో నా ప్రయాణం మరింత ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాను. ‘ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌’ లేటవడం, ‘గంగూబాయ్’ ముందు రావడం ప్లాన్ ప్రకారం జరగలేదు. అలా కుదిరిందంతే. 
  •  ఒక సీన్‌‌ చేయడానికి ఒక్క పద్ధతే ఉండదనే విషయం ఈ సినిమాతో తెలుసుకున్నాను. మొదట్లో సీన్ చదివి సెట్‌‌కి వచ్చేదాన్ని. కానీ సెట్‌‌కి వెళ్లాక నా ఆలోచన మారిపోయేది. ఆ సిట్యుయేషన్‌‌లో గంగూబాయే ఉంటే ఎలా రియాక్టవుతుందో ఊహించుకునేదాన్ని. సీన్‌‌ పేపర్‌‌‌‌ ఒక స్టార్టింగ్ పాయింట్ అంతే. మనం ఎగరాలంటే రెక్కలు విప్పుకోవాలి కదా. నేనూ అదే చేసేదాన్ని.   
  • ఇలాంటి ఎమోషనల్‌‌ పాత్ర చేయడం కష్టమే. నేనిప్పటికీ ఆ పాత్రకి అటాచ్‌‌ అయి ఉన్నాను. మూడేళ్లుగా ఆ క్యారెక్టర్‌‌‌‌తో జర్నీ చేస్తున్నాను. ప్యాండమిక్‌‌ వల్ల రెండేళ్ల పాటు షూట్ చేశాం. అందుకే అందులో నుంచి బైటికి రావడం కష్టంగా ఉంది. ఆ పాత్ర నా మనసులోనే ఉండిపోయింది. ఆడియెన్స్ సినిమా చూశాక కానీ నా భారం తీరదు.