తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు దక్కని డిపాజిట్లు

తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు దక్కని డిపాజిట్లు

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఆ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని 8 స్థానాల్లో పోటీ చేస్తే, ఒక్క చోట కూడా డిపాజిట్ రాలేదు. జనసేకు అన్ని నియోజకవర్గాల్లో కలిపి వచ్చిన ఓట్లు మొత్తం 58,014 మాత్రమే. కూకట్‌‌పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్‌‌కుమార్‌‌ పోటీ చేయగా, ఇక్కడ సెటిలర్ల ఓట్లు భారీగా ఉండడంతో ఆయనకు 39,830 ఓట్లు వచ్చాయి.

పార్టీలో ఆయన ఒక్కడికే చెప్పుకోదగ్గ ఓట్లు పడ్డాయి. కొత్తగూడెం అభ్యర్థి లక్కినేని సురేందర్‌‌రావుకు 1,945 ఓట్లు, అశ్వారావుపేట(ఎస్టీ) అభ్యర్థి ముయబోయిన ఉమాదేవికి 2,281.. జనసేన తెలంగాణ ఇన్​చార్జ్, తాండూరు అభ్యర్థి నేమూరి శంకర్‌‌గౌడ్‌‌ కు 4,087..  ఖమ్మం అభ్యర్థి మిర్యాల రామకృష్ణకు 3,053.. కోదాడ అభ్యర్థి మేకల సతీశ్ రెడ్డికి 2,151..  నాగర్‌‌ కర్నూల్‌‌ అభ్యర్థి వంగ లక్ష్మణ్‌‌ గౌడ్‌‌ కు 1,955..  వైరా(ఎస్టీ) అభ్యర్థి డాక్టర్‌‌ తేజావత్‌‌ సంపత్‌‌నాయక్‌‌ కు 2,712 ఓట్లు వచ్చాయి. 

ప్రభావం చూపని పవన్..  

ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. తెలంగాణలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. నామినేషన్ల గడువు ముగుస్తుందనగా పార్టీలో చేరినోళ్లకు టికెట్లు ఇచ్చారు. దీంతో ప్రచారంలో అభ్యర్థులు వెనకబడ్డారు. ఇక ప్రచారం ముగుస్తుందన్న టైమ్ లో నాలుగైదు రోజులు మాత్రమే పవన్ ప్రచారం నిర్వహించారు.