అయోధ్య రాముడి ఆభరణాలు... మొత్తం ఎన్ని కోట్లంటే?

అయోధ్య రాముడి ఆభరణాలు... మొత్తం ఎన్ని కోట్లంటే?

అయోధ్య : అయోధ్యలోని భవ్య రామమందిరంలో కొలువైన బాలరాముడి విగ్రహ రూపం దేశం మొత్తాన్ని మంత్రముగ్ధులను చేసింది. అలాగే సోమవారం రామ్ లల్లా (చిన్ని రాముడు) కు అలంకరించిన ఆభరణాలు భక్తులను చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఈ అందమైన నగలను ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్‌‌స్టిట్యూట్ (ఐజీఐ) సర్టిఫికేషన్​ పొందిన లక్నోలోని హర్షహైమల్ షియామ్‌‌లాల్ జ్యువెలర్స్ రూపొందించారు. 

మకుటం(ముకుట్​) అని పిలిచే రామ్ లల్లా కిరీటాన్ని 1.7 కిలోల బంగారంతో తయారు చేశారు. మరో అర కిలో బంగారంతో హాలో(కిరీటం వెనక చుట్టు ఉండే వెలుగు లాంటిది)ఉంటుంది. కిరీటంలో 75 క్యారెట్ల వజ్రాలు, 135 క్యారెట్ల జాంబియన్ పచ్చలు, 262 క్యారెట్ల కెంపులు పొదిగారు. మకుటం మధ్యలో ఉన్న సూర్యుడు శ్రీరాముడి వంశమైన సూర్యవంశీ లోగోను సూచిస్తుంది.

తిలకం

సుమారు16 గ్రాములు ఉంటుంది. ఇందులో 3 క్యారెట్ సహజ వజ్రం, దాని చుట్టూ చిన్న వజ్రాలు దాదాపు 10 క్యారెట్లు ఉంటాయి.

ఉంగరాలు

కుడి చేతి ఉంగరం 4 క్యారెట్ల వజ్రాలు, 33 క్యారెట్ల పచ్చ, బంగారంతో 65 గ్రాములు ఉంటుంది. ఎడమ చేతి కోసం 26 గ్రాముల రూబీ రింగ్ లో వజ్రాలు, కెంపులు ఉన్నాయి.

హారాలు(నెక్లెస్​లు)

బంగారంతో చేసిన చిన్న గుండ్రని నెక్లెస్ 500 గ్రాముల బరువు ఉంటుంది, 50 క్యారెట్ల వజ్రాలు, 150 క్యారెట్ల కెంపులు, 380 క్యారెట్ల పచ్చలు పొదిగారు.

నడుము పట్టీ 

సుమారు 750 గ్రాముల బరువైన బంగారు నడుము పట్టీలో 70-క్యారెట్ల వజ్రాలు, 850 క్యారెట్ల కెంపులు, పచ్చలు పొదిగారు. 850 గ్రాముల బరువైన చేతి కడియాలను 22 క్యారెట్ల బంగారంతో చేశారు. దాదాపు 100 క్యారెట్ల వజ్రాలు, 320 క్యారెట్ల  కెంపులు, పచ్చలు వీటిలో పొదిగారు. అలాగే ఒక్కో కడియం సుమారు 400 గ్రాముల బరువు ఉంటుంది. బంగారం, వజ్రాలు, కెంపులు పొదిగి తయారు చేశారు.