ఆ ఊరంతా పెళ్లి కాని అమ్మాయిలే…

ఆ ఊరంతా పెళ్లి కాని అమ్మాయిలే…

ఊరు ఊరంతా అందమైన అమ్మాయిలే!. కానీ, ఆ ఊరివైపు చూసేందుకు మగాళ్లు అస్సలు ఆసక్తి చూపరు. ఆ ఊళ్లోని ఆడాళ్లు సగానికి పైగా పెళ్లిళ్లు కాకుండా మిగిలిపోయారు. అయితే ఆజన్మ బ్రహ్మచారిణిలుగా మిగిలిపోతామన్న రందీ వాళ్లలో ఎంత మాత్రం లేదు. హాయిగా పొలం పనులు చేసుకుంటూ బతుకుతున్నరు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది?

బ్రెజిల్‌‌‌‌లోని మినాస్‌‌‌‌ గెరాయిస్‌‌‌‌ రాష్ట్రం బెలోవాలో మున్సిపాలిటీ పరిధిలో నోయివా డో కోడెయిరో పట్టణం ఉంది. ఇక్కడి జనాభాలో పెళ్లీడుకొచ్చిన అమ్మాయిల సంఖ్య ఆరొందల పైనే. వాళ్ల వయసు ఇరవై నాలుగు నుంచి ముప్ఫై మధ్యలో ఉంటుంది. కానీ, సగం మందికి మాత్రమే పెళ్లిళ్లు అయ్యాయి. ఎంత ప్రయత్నించినా మిగతా వాళ్లకు జత దొరకడం లేదు. వాళ్లు విధించుకున్న కఠిన నిబంధనలే వాళ్లకు పెళ్లిళ్లు కాకపోవడానికి ప్రధాన కారణమంటే అతిశయోక్తి కాదు.

యాంటీ–మెన్‌‌‌‌ గ్రూప్‌‌‌‌?

‘పెళ్లిళ్లు అయ్యాక భార్యలతో పాటు ఆ ఊళ్లోనే భర్తలు స్థిరపడాలి’, ‘టాయిలెట్లు కడగడం’, ‘వంటలో సాయం చేయడం’, చివరికి అంట్లు తోమడం వంటి పనులు కూడా భర్తలే చేయాలి. కాంప్రమైజ్‌‌‌‌ అయ్యి ఆ ఊరి అమ్మాయిలను చేసుకున్నవాళ్లు కొందరైతే.. రూల్స్‌‌‌‌ నచ్చక చుట్టుపక్కల ఊళ్లలోని మగాళ్లు ఆ ఊరివైపే చూడటం మానేశారు. అలాగని తాము మగాళ్లకు వ్యతిరేకం కాదని.. సమాన హక్కులు ఉండాలనే తమ అభిమతమని వాళ్లు చెబుతున్నారు. ఎవరి అండా లేకుండా సామూహిక వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలను వాళ్లే చక్కదిద్దుకుంటున్నారు. వ్యవసాయం చేసుకుంటున్నవాళ్లలో ఉన్నత చదువులు చదివిన యువతులు ఉండటం విశేషం.

కట్టు కథా!

‘అందగత్తెలు.. విచిత్రమైన గ్రామం’ పేరిట బోలెడు మీడియా కథనాలు ఇంటర్నెట్‌‌‌‌లో వైరల్‌‌‌‌ అయ్యాయి. కొన్ని పత్రికలు  ‘సింగిల్‌‌‌‌ ఉమెన్‌‌‌‌ టౌన్‌‌‌‌’ అంటూ కథనాలు ఇచ్చాయి. అయితే ‘బీబీసీ బ్రెజిల్‌‌‌‌’ మాత్రం ఇదొక ఫేక్‌‌‌‌ స్టోరీ అంది. ఆ వెంటనే మెయిల్‌‌‌‌ఆన్‌‌‌‌లైన్‌‌‌‌, నోయివా డో కోడెయిరోని సందర్శించి ఆ టౌన్‌‌‌‌ నిజంగానే ఉందని నిర్ధారించి కథనం ప్రచురించింది. దానికి కొనసాగింపుగా.. టెలిగ్రాఫ్‌‌‌‌, అలస్కా టైమ్స్ లాంటి ప్రముఖ మీడియా సంస్థలు ఈ ఊరి ఉనికి నిజమేనని తేల్చాయి.