మల్లన్న జాతరకు మస్తు ఏర్పాట్లు

మల్లన్న జాతరకు మస్తు ఏర్పాట్లు
  •     పట్నం వారానికి  లక్ష మంది భక్తుల రాక
  •     ఆకాశన్నంటిన అద్దె గదుల ధరలు

సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: కోరిన కోర్కెలు తీర్చే కొమురవెల్లి  మల్లన్న మహా జాతర ఆదివారం నుంచి మూడు నెలల పాటు సాగనుంది. ఈ ఒక్క రోజే  దాదాపు లక్ష పై చిలుకు భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి రానుండడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు శనివారం రాత్రికే కొమురవెల్లికి చేరుతుండడంతో మూడు ప్రాంతాల్లో వెహికల్​పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.

భక్తులు ఆదివారం మల్లికార్జున స్వామిని దర్శించుకుని సోమవారం తెల్ల వారుజామున నిర్వహించే పెద్ద పట్నం, అగ్ని గుండాల కార్యక్రమం తర్వాత ఇండ్లకు వెళ్లిపోతారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే మహా జాతర 12 వారాల పాటు సాగి ఏప్రిల్​ 7తో ముగుస్తాయి. మూడు నెలల మహా జాతరకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, కర్నాటక రాష్ట్రాల నుంచి దాదాపు పది లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది.

స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా చలువ పందిళ్లు వేసి  క్యూలైన్లు ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదాల పంపిణీకి ఏర్పాట్లను పూర్తి చేశారు. తోట భావి వద్ద నిర్వహించే పెద్ద పట్నం, అగ్ని గుండాల కార్యక్రమంలో పాల్గొనే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్ల ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించే వారి కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

పట్నం వారం ప్రత్యేకత

సంక్రాంతి పండగ తరువాత వచ్చే మొదటి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు పిల్లా పాపలతో కొమురవెల్లికి చేరుకుని స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ కు చెందిన యాదవులు తమ ఇలవేల్పైన మల్లన్న దర్శనం కోసం భారీగా తరలివస్తారు.  ఆదివారం బోనాలు, బెల్లం పాయసాలను స్వామి వారికి సమర్పించి కుటుంబ సభ్యులతో సహ పంక్తి  భోజనాలు చేస్తారు.

తర్వాత  మల్లన్న సోదరి ఎల్లమ్మ కు బోనాలు సమర్పించి దర్శనం చేసుకుంటారు. సోమవారం ఉదయం హైదరాబాద్ యాదవ పూజారులు  నిర్వహించే పెద్ద పట్నం, అగ్ని గుండాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. పట్నం వారం సందర్భంగా అద్దె గదుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి.  దేవస్థానానికి సంబంధించి గదులు లేకపోవడంతో భక్తులు ప్రైవేటు గదులను అద్దెకు తీసుకుంటున్నారు.  వారు రెండు రోజులకు పది వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. పట్నం వారం సందర్భంగా పక్షం రోజుల క్రితమే గదులు అడ్వాన్స్ బుక్కింగ్ కావడంతో సామాన్య  భక్తులు రోడ్ల పైనే గుడారాలు వేసుకుని వంట వార్పు చేసుకుంటున్నారు. 

పోలీసుల  బందోబస్తు

పట్నం వారం సందర్భంగా కొమురవెల్లిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని కొమురవెల్లిని రెండు సెక్టార్లుగా విభజించి, టెంపుల్ ఆవరణ ఒక సెక్టార్ గా, పార్కింగ్ ప్రదేశాలను రెండో సెక్టార్​గా విభజించారు. కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టారు.

తోటబావి సమీపంలో వీఐపీ పార్కింగ్ ఏర్పాటు చేయగా, చేర్యాల, కిష్టంపేట,  సిద్దిపేట, కొమరవెల్లి కమాన్ నుంచి వచ్చే వాహనదారులు కొమురవెల్లి బస్టాండ్ పక్కన, హైదరాబాద్, ప్రజ్ఞాపూర్, కొడకండ్ల, చిన్న కిష్టాపూర్,  కొండపోచమ్మ టెంపుల్ నుంచి వచ్చే వాహనదారులకు పెట్రోల్ పంపు వెనుక భాగాన  ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.  సీపీ అనురాధ కొమురవెల్లిలో పర్యటించి క్షేత్ర స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్షించారు.