బీజేపీ సీనియర్ల సెగ్మెంట్ల బాట.. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న నేతలు

బీజేపీ సీనియర్ల సెగ్మెంట్ల బాట.. నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న నేతలు
  • బీజేపీ సీనియర్ల సెగ్మెంట్ల బాట
  • నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న నేతలు
  • హైకమాండ్ ఆదేశాలతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని బీజేపీ సీనియర్లంతా అసెంబ్లీ బరిలో నిలిచేందుకు రెడీ అయ్యారు. అప్పుడే నియోజకవర్గాల్లో ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత సీనియర్ నేతలంతా నియోజకవర్గాల బాట పట్టారు. అవకాశం చిక్కినప్పుడల్లా నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ క్యాడర్ తో సమావేశాలు పెడుతున్నారు. ఎన్నికల పోటీలో ఉంటామనే సంకేతాలు ఇస్తున్నారు. ఈసారి సీనియర్లంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని హైకమాండ్ ఇప్పటికే స్పష్టం చేయడంతో మొదట్లో సీనియర్లంతా తటపటాయించినా, ఆ తర్వాత పోటీకి సిద్ధమయ్యారు. 

పార్లమెంట్ తప్ప అసెంబ్లీ వద్దే వద్దనుకున్న చాలా మంది సీనియర్లు హైకమాండ్ ఆదేశంతో దిగి వచ్చారు. ఈ జాబితాలో సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నారు. సిట్టింగ్ ఎంపీల్లో లక్ష్మణ్ ను మినహాయిస్తే.. మిగితా అందరూ దాదాపుగా బరిలో ఉంటారనేది స్పష్టమవుతోంది. ఇప్పటికే అంబర్ పేటలో కిషన్ రెడ్డి, కరీంనగర్ లో బండి సంజయ్, బోథ్ లో సోయం బాపూరావ్, ఆర్మూర్, కోరుట్ల నియోజకవర్గాల్లో ధర్మపురి అర్వింద్, హుజూరాబాద్ లో ఈటల, దుబ్బాకలో రఘునందన్ రావు, గద్వాలలో డీకే అరుణ, చెన్నూర్, ధర్మపురి నియోజకవర్గాల్లో వివేక్ వెంకటస్వామి, మహబూబ్ నగర్, షాద్ నగర్ లో జితేందర్ రెడ్డి, రాజేందర్ నగర్, తాండూర్ నియోజకవర్గాల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నంలో బూర నర్సయ్య.. ఇలా సీనియర్లంతా తమకు అనుకూలమైన ఒకటి లేదా రెండు నియోజకవర్గాలను ఎంచుకొని అక్కడే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. త్వరలోనే బీజేపీ మొదటి జాబితా రిలీజ్ కానుండటంతో అందులో ఈ సీనియర్ల నియోజకవర్గాలు ప్రకటించనున్నారు. దీంతో వారంతా ఇంకా తమ ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు.