న్యూ ఇయర్ : ఆ రాత్రి సిటీలోని అన్ని ఫ్లై ఓవర్లు మూసివేత

న్యూ ఇయర్ : ఆ రాత్రి సిటీలోని అన్ని ఫ్లై ఓవర్లు మూసివేత

కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా తెలంగాణ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పలు ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. 31, డిసెంబర్ 2023 నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. 

రోడ్డు మార్గాల మూసివేత : 

* నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర లైట్ మోటార్ వాహనాలకు అనుమతి లేదు.

* PVNR ఎక్స్ప్రెస్ వే రాత్రి10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర వాహనాలకు అనుమతి లేదు.

* ఈ క్రింది ఫ్లై ఓవర్లు రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు పూర్తిగా మూసివేయనున్నారు.
  
శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్లు (1 & 2), షేక్ పేట్ ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నెం.45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్,, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్-JNTU ఫ్లై ఓవర్, ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్, బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్ (బాలానగర్)

ప్రజలు తమ ప్రయాణ ప్రణాళికలను తదనుగుణంగా రూపొందించుకొని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని పోలీసులు అభ్యర్థించారు. 

2. క్యాబ్లు/టాక్సీ/ఆటో రిక్షా ఆపరేటర్లు (కాంట్రాక్ట్ క్యారేజీలు) :

* క్యాబులు /టాక్సీ/ఆటో రిక్షాల డ్రైవర్లు/ఆపరేటర్లు కచ్చితంగా యూనిఫామ్ ధరించాలి. వాళ్లు అన్ని డాక్యూమెంట్స్ వెంట ఉంచుకోవాలి.

* క్యాబ్ డ్రైవర్లు ఎలాంటి పరిస్థితులలోనూ రైడ్ నిరాకరించకూడదు. ఇది మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 178 ప్రకారం ఉల్లంఘన. ఉల్లంఘించిన వారికి రూ. 500 జరిమానా విధిస్తామని చెప్పారు పోలీసులు.  ఎవరైనా ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడితే బండి నెంబర్, సమయం, ప్రదేశం మొదలైన వివరాలతో వాట్సాప్ 9490617346 కు ఫిర్యాదు చేయవచ్చు. 

*  ప్రజలతో అనుచితంగా ప్రవర్తించకూడదు. లేదా అదనపు ఛార్జీలు డిమాండ్ చేయకూడదు.

బార్/పబ్/క్లబ్ వంటి సంస్థలకు సూచనలు : 

* ఏదైనా బార్/పబ్/క్లబ్ మొదలైనవి తమ ప్రాంగణంలో మద్యం సేవించిన కస్టమర్లు, అసోసియేట్లను వాహనాలు నడపడానికి అనుమతిస్తే.. నేరాన్ని ప్రోత్సహించినందుకు సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకోనున్నారు. 

*  మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే దుష్పరిణామాలపై తమ కస్టమర్లు, సహచరులకు ఖచ్చితంగా అవగాహన కల్పించాలి. మద్యం సేవించిన వారి ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలి. మద్యం తాగిన వ్యక్తులు తమ ప్రాంగణంలో వాహనం నడపకుండా ఆపాలి.

సాధారణ ప్రజలకు సూచనలు :

* ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా బండ్లు నడపడం వంటి ప్రమాదకర ఉల్లంఘనలు చేసే వారిని గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు అమర్చారు. 

* సైబరాబాద్ పరిధిలోని అన్ని రహదారులపై రాత్రి 8 గంటల నుండి డ్రంక్ అండ్  డ్రైవింగ్స్ పై విస్తృత తనిఖీలు నిర్వహిస్తారు.

*  సరైన పత్రాలు చూపించని పక్షంలో వాహనాలను తాత్కాలికంగా పోలీస్ వారు వారి కస్టడీలోకి తీసుకుంటారు.

* ఎవరైనా ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.

* చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లేదా మైనర్ డ్రైవింగ్ చేస్తే వాహనాన్ని నిర్బంధంలోకి తీసుకోనున్నారు. వాహన యజమాని, డ్రైవర్ ఇద్దరూ న్యాయస్థానంలో ప్రాసిక్యూట్ చేయబడతారు.

* అటువంటి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పుడు... తర్వాత ప్రయాణానికి పౌరులు తమ స్వంత ఏర్పాట్లు చేసుకోవాలి.

* వాహనాలలో అధిక -డెసిబెల్ సౌండ్, మ్యూజిక్ సిస్టమ్లను ఉపయోగించడం నిషేధించబడింది. ఒకవేళ అలా చేస్తే తదుపరి చర్యల కోసం వాహనాలు నిర్బంధించబడతాయి. RTO అధికారికి పంపిస్తారు. 

* నంబరు ప్లేట్లు లేని వాహనాలు నడిపితే ఆ వాహనాలను పోలీసులు తమ అదుపులోకి తీసుకుంటారు. అలాంటి వాహనాలను కూడా RTO అధికారికి పంపుతారు.

* వాహనాలలో కిక్కిరిసి ప్రయాణించడం, వాహనాల పై భాగంలో ప్రయాణించడం, బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బంది కలిగించడం వంటివి చేసినా కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.

* ట్రాఫిక్ పోలీసులు ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, మితిమీరిన శబ్దాలు, ప్రమాదకరమైన డ్రైవింగ్, ట్రిపుల్, మల్టిపుల్ రైడింగ్ మొదలైన వాటిపై కేసులను బుక్ చేస్తారు.

* పబ్లిక్ రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా, బాధ్యతతో.. సురక్షితంగా ప్రయాణించాలి.

తాగి వాహనం నడపడం వల్ల కలిగే పరిణామాలు :

* మద్యం తాగి వాహనం నడిపే ప్రతి ఒక్కరిపై మోటార్ వెహికల్స్ యాక్ట్, 1988లోని u/s 185 డిడి కేసులు బుక్ చేయబడును. వారందరినీ నిర్ణీత సమయంలో కోర్టుకు హాజరుపరుస్తారు.

* మొదటి నేరానికి జరిమానా రూ. 10 వేలు లేదా 6 నెలల వరకు జైలు శిక్ష. రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు నేరానికి పాల్పడితే రూ. 15000 లేదా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.

* మొదటి నేరానికి డ్రైవింగ్ లైసెన్స్ (DL) 3 నెలల పాటు సస్పెండ్ చేయబడును. రెండు, అంతకంటే ఎక్కువ సార్లు ఈ నేరానికి DL శాశ్వతంగా రద్దు చేయబడుతుంది. ఆ వ్యక్తి భారతదేశంలో డ్రైవింగ్ చేయడానికి అనర్హులు అవుతారు.

* మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా ఎవరైనా రోడ్డు ప్రమాదానికి గురైతే లేదా చనిపోతే ఐపీసీలోని U/s 304 పార్ట్-II (Culpable homicide not amounting to murder) క్రిమినల్ కేసు నమోదు చేయబడును. అరెస్టు చేసి జైలుకు పంపిస్తారు.