- నగరాల్లోనూ గ్రీనరీకి ప్రాధాన్యత ఇవ్వాలి : మంత్రి తుమ్మల
హైదరాబాద్, వెలుగు : నగరాల్లోనూ గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన 15వ గ్రాండ్ నర్సరీ మేళాను ప్రారంభించి, మాట్లాడారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గ్రాండ్ నర్సరీ మేళాను ఆలిండియా హార్టీకల్చర్ పేరుతో పదేళ్లుగా కంటిన్యూగా ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు.
ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభించే అనేక రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. మెడిసినల్ ప్లాంట్లు, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కూడా ఉన్నాయని చెప్పారు. ఇంటి వద్ద కిచెన్ గార్డెన్, వర్టికల్ గార్డెన్, టెర్రస్ గార్డెన్‌ను వంటివి ఏర్పాటు చేసుకుంటే ఆక్సిజన్‌తో పాటు వర్క్ ప్రెజర్ తగ్గి మానసిక ఉత్సాహాన్ని పొందవచ్చని వివరించారు. మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా చేపట్టాలని మంత్రి సూచించారు.
160కి పైగా స్టాల్స్ ఏర్పాటు
ఈ నెల 5వ తేదీ రాత్రి 9 గంటల వరకు గ్రాండ్ నర్సరీ మేళా జరుగుతుందని మేళా ఇన్చార్జ్ ఖాలీద్ అహ్మద్ తెలిపారు. థాయ్‌ల్యాండ్‌తో పాటు దేశ విదేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి 160కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రూ.3 నుంచి రూ.16 లక్షల విలువైన మొక్కలు ఈ ప్రదర్శనలో లభ్యమవుతాయన్నారు. స్టాల్స్‌లో అరుదైన మొక్కలు, విత్తనాలు, ఎరువులు, పరికరాలు ప్రదర్శన, విక్రయాలు జరుగుతాయని తెలిపారు.