
వనపర్తి/చిన్నచింతకుంట, వెలుగు : ఆగస్ట్ 15 లోగా భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. పది, పదిహేను రోజుల్లో ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని, సర్వేయర్ల కొరత తీర్చేందుకు ప్రతి మండలానికి పది మందికి తగ్గకుండా సర్వేయర్లను నియమిస్తామని చెప్పారు. ప్రతి ప్రైవేట్ సర్వేయర్‌కు ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ ఇస్తామన్నారు. వనపర్తితో పాటు మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌లో బుధవారం నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సుకు మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకోగలుగుతారని, రెవెన్యూ ఆఫీసర్లే బాధితుల ఇండ్ల వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. గత ప్రభుత్వం నాలుగు గోడల మధ్య కూర్చొని, తమకు నచ్చినట్లు ధరణిని రూపొదించిందని, దీనివల్ల రైతులు అరిగోస పడ్డారన్నారు. తాము అందరి ఆమోదంతోనే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. గత పదేండ్లలో కేసీఆర్ కుటుంబం దోచుకున్న వేలాది ఎకరాలు ఈ చట్టంతో బయటపడుతున్నాయన్నారు. అందుకే ఈ చట్టాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. భూ భారతిచట్టాన్ని పకడ్బందీగా, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా అమలు చేయాలని ఆఫీసర్లకు సూచించారు.
జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ చట్టాన్ని అమలు చేస్తామన్నారు. పదేండ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని కేసీఆర్.. 16 నెలల్లోనే కాంగ్రెస్ 57,672 ఉద్యోగాలు ఇవ్వడంతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. అంతకు ముందు వనపర్తి జిల్లాలో రూ. 193 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
వనపర్తిలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణు వర్ధన్‌రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొల్వాల్, అమ్మాపూర్‌లో ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయి, అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, ఆర్డీవో నవీన్ పాల్గొన్నారు.
అభివృద్ధి చేస్తే ఎందుకు ఓడిపోయిన్రు : మంత్రి జూపల్లి కృష్ణారావు
వనపర్తిలో జరిగిన మీటింగ్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. గత పదేండ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఎందుకు ఓడిపోయారో చెప్పాలన్నారు. పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదన్నారు.