మహిళా ఓటర్లే కీలకం .. మద్దతు కోసం పార్టీల ప్రయత్నం

మహిళా ఓటర్లే కీలకం .. మద్దతు కోసం పార్టీల ప్రయత్నం

మెదక్, వెలుగు: ప్రధాన పార్టీలన్నీ మహిళాఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాయి. మెదక్​ లోక్​సభ నియోజకవర్గంలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళాఓటర్లే ఎక్కువగా ఉండడం ఇందుకు కారణం. ఈ నియోజకవర్గం పరిధిలో సిద్దిపేట, మెదక్, నర్సాపూర్​, సంగారెడ్డి, పటాన్​ చెరు, దుబ్బాక, గజ్వేల్​ ఉన్నాయి. ఇందులో పటాన్​ చెరు మినహా మిగిలిన ఆరు సెగ్మెంట్లలో మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. 

ఓటరు జాబితాల సవరణ అనంతరం నియోజకవర్గంలో 18,12,858 మంది ఓటర్లకు గాను పురుషులు 8,95,777 మంది, మహిళలు 9,16,876 మంది, ట్రాన్స్​ జెండర్లు 205 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 21,009 మంది ఎక్కువగా ఉన్నారు. ఓటర్లు ఎక్కువ గా ఉండడమే కాకుండా పోలింగ్​లో నూ మహిళలే క్రియాశీలంగా పాల్గొంటారు. ఇదివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో మహిళల పోలింగ్​ శాతమే అధికంగా నమోదయ్యింది. దీంతో మహిళల మద్దతు ఉంటే గెలుపు సులువు అవుతుందని పార్టీలు నమ్ముతున్నాయి. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికలలో విజయం కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్ మహిళ ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. 

 అందరి ఆశలు వాళ్లమీదే

కాంగ్రెస్​ పార్టీ మహిళలకు ఫ్రీ బస్​ సౌకర్యం కల్పించడంతోపాటు, గ్యాస్​ సిలిండర్​ రూ.500కే ఇస్తోంది. ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీదే ఇస్తామని ప్రకటించింది. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి స్కీమ్​ కింద ప్రకటించిన రూ. 2500 పార్లమెంట్​ ఎన్నికల తర్వాత అమలు చేయనున్నట్టు చెప్తోంది. కేంద్రంలో కాంగ్రెస్​అధికారంలోకి వస్తే పేద మహిళలకు ఏటా రూ.లక్ష ఇస్తామని మ్యానిఫెస్టోలో చెప్పడంతో మహిళా ఓటర్ల మద్దతు తమకే లభిస్తుందని ఆశిస్తోంది. ఈ అంశాలను పార్టీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయనుంది. బీఆర్ఎస్​తమ హయాంలో ఇచ్చిన స్కీమ్​లు, కాంగ్రెస్​ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ప్రచారం చేస్తోంది. బీజేపీ కేంద్రప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంతో పాటు రామాలయం సెంటిమెంట్​ మీద ఆశలు పెట్టుకుంది.