అమీన్పూర్, వెలుగు: అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని కిష్టారెడ్డిపేటను 8 పంచాయతీలతో కలిపి కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు శనివారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కిష్టారెడ్డిపేటలో 8 గ్రామాల అఖిలపక్ష నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి రిలే దీక్షలో కూర్చున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నందారం నర్సింహాగౌడ్, కాంగ్రెస్ అమీన్పూర్ పట్టణ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, బీరంగూడ ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్‌యాదవ్ దీక్షకు మద్దతు తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ లక్షా ఇరవై వేల ఓట్లు ఉన్న అమీన్పూర్ మున్సిపాలిటీలో కేవలం 2 డివిజన్లు మాత్రమే చేశారని, 8 పాత గ్రామాలతో కలిపి కిష్టారెడ్డిపేటను కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొన్ని చోట్ల 20 వేల ఓట్లకు డివిజన్ ఏర్పాటు చేశారన్నారు. 40 వేల ఓటర్లు, 80 వేల జనాభా ఉన్న ఈ 8 గ్రామాలను కలిపి కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం డివిజన్ ఏర్పాటు చేసే వరకు తమ రిలే నిరాహార దీక్ష కొనసాగుతుందని తెలిపారు.
