నాగర్​కర్నూల్​లో కలెక్టరేట్​ఎదుట అఖిలపక్షం ధర్నా

నాగర్​కర్నూల్​లో కలెక్టరేట్​ఎదుట అఖిలపక్షం ధర్నా
  • ప్రభుత్వం కాకుండా బ్రోకర్లు తీసుకోవడమేమిటి ?
  • సర్కారుకు హ్యాండోవర్​ చేయడం వెనక కుట్ర
  • చట్టబద్దంగా భూసేకరణ చేయాల్సిందే 
  • బాధ్యులపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి 

నాగర్​కర్నూల్,​ వెలుగు: జిల్లాకు మంజూరైన మెడికల్​ కాలేజీకి అవసరమైన భూములను ప్రభుత్వం ద్వారా కాకుండా దళారీల ద్వారా గంజుకున్నారని ఆరోపిస్తూ నాగర్​ కర్నూలులో అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగారు. శుక్రవారం కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఎం, టీజేఎస్, ఎమ్మార్సీఎస్​, ఇతర పార్టీల లీడర్లు బాధిత కుటుంబాలతో కలిసి కలెక్టరేట్​ ఎదుట ధర్నాకు దిగాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి డా.నాగం జనార్దన్​రెడ్డి మాట్లాడుతూ జిల్లాకు మెడికల్​ కాలేజీ రావడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఉయ్యాలవాడలో ఎన్నో భూములున్నా దళితులు సాగు చేసుకుంటున్న భూములనే గుంజుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.  37 మంది రైతుల నుంచి 40ఎకరాలను మధ్యవర్తులు వచ్చి సంతకాలు పెట్టించుకొని తీసుకున్నారని, తర్వాత సర్కారుకు హ్యాండోవర్ ​చేశారన్నారు. అసైన్డ్ భూములను ప్రజావసరాల కోసం తీసుకోదలిస్తే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం చేయాలని, నోటీసులివ్వాలని, నష్ట పరిహారం చెల్లించాలన్నారు. ఇవేవి చేయకుండా ప్రైవేట్​ వ్యక్తుల ద్వారా భూములు తీసుకోవడం చూస్తే కుట్ర జరిగిందనే విషయం అర్థమవుతోందన్నారు. 

దీనిపై కలెక్టర్ ​వివరణ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమీషన్​తో పాటు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి దిలీపాచారి మాట్లాడుతూ తమ భూములు మోసపూరితంగా గుంజుకున్నారనని, మూడు రోజుల కింద దళితులు ఆందోళనకు దిగారని, అందులో మహిళలు, వృద్ధులు, పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా రోజంతా పోలీస్ స్టేషన్ల లో ఉంచి  తిండి కూడా పెట్టలేదన్నారు. బీఎస్పీ లీడర్లు రామకృష్ణ, రామచందర్​ మాట్లాడుతూ బలవంంగా భూములు తీసుకున్న వారిపై ఎస్సీఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్​ చేశారు. టీపీసీసీ వైఎస్​ ప్రెసిడెంట్ ​డా.మల్లురవి, డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి దిలీపాచారి, పార్లమెంట్​ కన్వీనర్ బుసిరెడ్డి సుధాకర్​ రెడ్డి, రాజవర్ధన్​రెడ్డి, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, రామచందర్, నాగన్న, సీపీఎం లీడర్లు పర్వతాలు, ఐద్వా గీత, ఆర్​.శ్రీనివాసులు, టీజేఎస్​నుంచి శ్యాంప్రసాద్​ రెడ్డి, జనసేన నుంచి లక్ష్మణ్​గౌడ్​, ఎమ్మార్పీఎస్​ నుంచి కోళ్ళ శివ, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.