కులగణనతో అందరికీ న్యాయం

కులగణనతో అందరికీ న్యాయం

స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు  దేశంలో కులగణన చేపట్టలేదు. మొన్న సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌‌‌‌ పార్టీ ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది. తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. ఆయా రాష్ట్రాల్లోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించింది. కేంద్రం మొన్నటివరకు కులగణన సాధ్యం కాదంటూ దాటవేసింది. 

దీంతో బిహార్‌‌‌‌, ఆంధ్రప్రదేశ్‌‌‌‌, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలు కులగణనను చేపట్టాయి. కానీ, దేశవ్యాప్తంగా కులగణన డిమాండ్‌‌‌‌పై ప్రతిపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. ఈ ఏడాది  బిహార్‌‌‌‌,  వచ్చే ఏడాది బెంగాల్‌‌‌‌, యూపీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బిహార్‌‌‌‌, యూపీ వంటి రాష్ట్రాలలో  కులాల ప్రభావం అధికంగా ఉంటుంది. దీనికితోడు కులగణన చేపట్టాలనే డిమాండ్‌‌‌‌ రోజురోజుకూ పెరుగుతున్నది. కాంగ్రెస్‌‌‌‌తోపాటు ప్రాంతీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. చివరికి కేంద్రం ఎట్టకేలకు కులాల లెక్క  పక్కాగా తేల్చడానికి సై అన్నది. 

జనాభా లెక్కలు ఎంత ముఖ్యమో కులగణన అంతకంటే ముఖ్యం. ఎందుకంటే అది సామాజికంగా చాలా ప్రభావం చూపెట్టే రాజకీయ అంశం.   బ్రిటిష్‌‌‌‌ ఇండియాలో1931 వరకు కులాలవారీగా జనాభా గణన జరిగింది. 1951లో  మొదటిసారి చేపట్టిన జనాభా లెక్కల్లో కులగణన చేయలేదు. 1961లో  చేపట్టిన జనాభా లెక్కల్లో రాష్ట్రాలు సొంతంగా ఓబీసీల లెక్కలను తేల్చవచ్చని  కేంద్రం సూచించింది.   ఇవాళ అనేకపార్టీలు కులగణనకు డిమాండ్​ చేయడంతో పాటు  ఆరు దశాబ్దాల తర్వాత కేంద్రం కులగణనకు పచ్చజెండా ఊపింది. 

ఓబీసీలుగా 3,743 కులాలు

మండల్ కమిషన్  ఓబీసీలుగా 3,743 కులాలు, సముదాయాలను గుర్తించింది. వీరికి ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్​ కేటాయించింది. రాజ్యాంగంలోని అధికరణ 15(4), 16(4) ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. అందువల్ల ఇతర వెనుకబడిన కులాల జనాభా 52 శాతంపైనే ఉన్నప్పటికీ కమిషన్ వారికి 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది. 

సామాజిక న్యాయ రాజకీయాలకు మండల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ సిఫార్సులే ఆధారం. అందుకే  కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, మహిళా బిల్లులో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ కోటా కల్పించాలని,  క్రిమీలేయర్‌‌‌‌ను 20 ఏళ్లపాటు లేకుండా చూడాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి. దేశ జనాభాలో 52 శాతం ఉన్న ఓబీసీలకు సుప్రీంకోర్టు విధించిన రిజర్వేషన్ల పరిమితి అడ్డంకిగా మారింది. 20 ఏళ్ల తర్వాత రిజర్వేషన్లను సమీక్షించాలని మండల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ చెప్పింది. ఇప్పుడు కులాల వారీగా లెక్కలు తేలితే మండల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ సిఫార్సులను అమలు చేయడానికి వీలవుతుంది. తద్వారా బీసీలకు సామాజిక న్యాయం దక్కాలనే నినాదం ఆచరణలోకి వస్తుంది. 

బిహార్​ కులగణనపై అభ్యంతరాలు

2011లో సామాజిక, ఆర్థిక-, కులగణనలను అప్పటి యూపీఏ ప్రభుత్వం చేపట్టింది. అయితే ఆ డేటాను ఎన్నడూ పూర్తిగా బయటపెట్టలేదు. తెలంగాణ రాష్ట్రంలో  బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం 2014లో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. అయితే  ఆ డేటాలో 90 శాతానికి పైగా బడుగు, బలహీనవర్గాల వారే ఉన్నారని చెప్పింది. కానీ, కులాల వారీగా నివేదిక వెల్లడించలేదు. దీంతో అటు కాంగ్రెస్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌  రెండూ విమర్శలు ఎదుర్కొన్నాయి.  

2023లో  బిహార్‌‌‌‌ ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో ఓబీసీలు, ఈబీసీలు 63 శాతం ఉన్నట్లు తేలింది. ఈడబ్ల్యూఎస్‌‌‌‌ కోటా కలుపుకుంటే ఆ రిజర్వేషన్లు 75 శాతానికి పెరిగింది. ఇది 50 శాతం కోటా పరిమితిని మించిపోతున్నదని, బిహార్‌‌‌‌ రాష్ట్రం నిర్వహించిన కులగణన చెల్లుబాటు కాదని, ఆ అధికారాలు  లేవని అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ అనేక మంది పాట్నా హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలు మళ్లీ మొదటికి వచ్చింది. 

కులగణనకు ఒడిశా, మహారాష్ట్ర తీర్మానాలు

ఒడిశా, మహారాష్ట్రల్లోనూ కులగణనపై తీర్మానాలు జరిగాయి.  2024లో ఆంధ్రప్రదేశ్‌‌‌‌ కులగణన చేపట్టింది. 2024 నవంబర్‌‌‌‌లో  తెలంగాణలో కులగణన జరిగింది. ఆ రిపోర్టు తప్పుల తడక అని బీసీ సంఘాలు, ప్రతిపక్షాలు, చివరికి ఆ పార్టీ నేతలూ తప్పుపట్టారు. ఇప్పుడు కేంద్రం చేపట్టబోయే లెక్కలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లెక్కల్లో తప్పులు ఉంటే తేలుతాయి. అలాగే  ఈడబ్ల్యూఎస్‌‌‌‌ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాక  జనాభాకు మించి 10 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారనే విమర్శలు వస్తున్నాయి. 

ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేదు. దీనికి కారణం కులాల లెక్కలు పక్కా లేకపోవడమే. ఇప్పుడు జాతీయ జనాభా లెక్కలతో పాటు ప్రతి వ్యక్తి కులాన్ని శాస్త్రీయంగా గుర్తిస్తారు. కులాల లెక్కలు తేలితే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇప్పటివరకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే అవకాశం లభిస్తుంది. కులగణన లెక్క తేలితే అది రాజకీయ ప్రాతినిధ్యానికి, సామాజిక న్యాయానికి దారి తీస్తుంది.

రాజకీయాల్లో కులాలకు పెరిగిన ప్రాధాన్యం

1980లో మండల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ సిఫార్సుల ఆధారంగా ఓబీసీలకు ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచే  రాజకీయం రంగంలో కులాలకు ప్రాధాన్యం పెరిగింది. నాటి నుంచి కులగణన డిమాండ్లు వస్తున్నాయి.  అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వాదిస్తున్నారు. కానీ, ఇందిరా సహానీ కేసులో రిజర్వేషన్లపై 50 శాతానికి మించకూడదని  సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 

ఆర్థికంగా  వెనుకబడిన అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని పార్లమెంటు నిర్ణయించింది.  దీంతో ఈడబ్ల్యూఎస్‌‌‌‌ రిజర్వేషన్ల తర్వాత ఆ 50 శాతం సీలింగ్‌‌‌‌ దాటిందనే వాదనలు ఉన్నాయి. అందుకే కాంగ్రెస్‌‌‌‌ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల సీలింగ్‌‌‌‌ ఎత్తివేస్తామని, ఈడబ్ల్యూఎస్‌‌‌‌ రిజర్వేషన్లలోనూ వెనుకబడిన వర్గాలకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. కులగణన తర్వాత ఓబీసీలపై రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉంటుందనేది తేలుతుంది. 

- ఆసరి రాజు,ఇండిపెండెంట్‌‌‌‌ జర్నలిస్ట్‌‌‌‌–