
- ఇగ ప్రచార జోరు
- పండుగ ముగియడంతో స్పీడ్ పెంచనున్న పార్టీలు
- నేటి నుంచి మళ్లీ జిల్లాలకు కేసీఆర్
- 27న కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాక
- 30, 31న ప్రియాంక, 1న రాహుల్ పర్యటన
- రేపు కాంగ్రెస్, బీజేపీ సెకండ్ లిస్ట్!
దసరా పండుగ ముగియడంతో పొలిటికల్ పార్టీలు ఎన్నికల ప్రచార జోరును పెంచేందుకు రెడీ అవుతున్నాయి. గడప గడపకు వెళ్లి ఓటర్లను కలువడం, రోడ్ షోలు నిర్వహించడం, వీలైనన్ని ఎక్కువ సభలు ఏర్పాటు చేయడం వంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. మళ్లీ పవర్ కోసం బీఆర్ఎస్.. అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీజేపీ పోటా పోటీగా తలపడుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ ఫస్ట్ లిస్టులు విడుదల చేశాయి. ఒకట్రెండు రోజు ల్లోనే ఆ రెండు పార్టీల సెకండ్ లిస్టులు రానున్నాయి.
భారీగా అగ్రనేతల సభలు
ఇప్పటికే మూడు రోజులు ఆరు నియోజకవర్గాల్లో సభలు చేపట్టిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.. మళ్లీ బుధవారం నుంచి సభలు నిర్వహించనున్నారు. బుధవారం అచ్చంపేట, వనపర్తి, మునుగోడు నియోజకవర్గాల ప్రచార సభల్లో ఆయన పాల్గొననున్నారు. బీజేపీ కూడా ప్రచార ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ నెల 27న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూర్యాపేటకు రానున్నారు. అక్కడ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 28న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, 31న యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ రానున్నారు. వచ్చే నెలలో బీసీ గర్జన సభను నిర్వహించాలని బీజేపీ భావిస్తున్నది. ఇక.. ఈ నెల 26, 27న ఇంటింటి ప్రచారం, 28 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు రెండో విడత బస్సు యాత్రలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. బస్సు యాత్రలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్నాటక సీఎం సిద్ధరామయ్య పాల్గొననున్నారు.
- 28 నుంచి కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర
- హాజరుకానున్న రాహుల్, ప్రియాంక, సిద్ధరామయ్య
- ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో యాత్ర
- రేపు, ఎల్లుండి ఇంటింటి ప్రచారం.. పాల్గొననున్న రాష్ట్ర ముఖ్య నేతలు
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఓవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తూనే, జాతీయ స్థాయి నాయకులతో భారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. గురువారం నుంచి వరుసగా ఇంటింటి ప్రచారం, రెండో విడత బస్సు యాత్ర నిర్వహించేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. 26, 27న ఇంటింటి ప్రచారం, 28 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు బస్సు యాత్ర చేపట్టనుంది. రెండో విడత బస్సు యాత్రకు హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇందులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొననున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బస్సు యాత్రను నిర్వహించేలా పార్టీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. రేపటి లోపు అధికారికంగా షెడ్యూల్ కూడా విడుదల చేయనున్నట్లు సీనియర్ నేత ఒకరు చెప్పారు. కాగా 28, 29 తేదీలలో కర్నాటక సీఎం సిద్ధరామయ్య.. 30, 31 తేదీలలో ప్రియాంక గాంధీ.. వచ్చే నెల 1న రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొననున్నారు.
బహిరంగ సభలు సైతం..
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగానే తొలుత ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ పై ఫోకస్ పెట్టి సభలు, సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు కవర్ అయ్యేలా బస్సు యాత్రను పూర్తి చేశారు. ఇప్పుడు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో యాత్ర నిర్వహించనున్నారు. ఈ నాలుగు జిల్లాల్లో బస్సు యాత్రతో పాటు కొన్నిచోట్ల బహిరంగ సభలను కూడా నిర్వహించేందుకు పార్టీ కసరత్తు చేస్తున్నది.
రెండ్రోజులు ఇంటింటి ప్రచారం
బస్సు యాత్రకు ముందు కాంగ్రెస్ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 26, 27 తేదీలలో ఇంటింటికీ వెళ్లనున్నారు. 26న ఉమ్మడి వరంగల్, నల్గొండ, హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. 27న ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్‌లో ప్రచారం చేయనున్నారు. ఈ రెండు రోజుల్లో 40 నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారం చేయనున్నారు. 10 మంది నేతలు రోజుకు రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. ఈ క్యాంపెయిన్ లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, మధుయాష్కీ, సీతక్క తదితరులు పాల్గొననున్నారు.