ప్రియాంకను పిలుస్తుండ్రు..

ప్రియాంకను పిలుస్తుండ్రు..
  • తమ రాష్ట్రానికి రావాలంటూ కాంగ్రెస్ నేతల డిమాండ్లు
  • ముఖ్యంగా తెలంగాణ, ఏపీ, కర్ణాటక, పీసీసీల ఒత్తిళ్లు
  • ఇందిరమ్మ ఇమేజ్ ప్రభావంపై ఆశలు

వెలుగు బ్యూరో: కాంగ్రెస్ లో ప్రియాంకా గాంధీ యాక్టివ్ గా మారడం దేశ వ్యాప్తంగా ఆ పార్టీ నేతల్లో కొత్త ఆశలు పెంచుతోంది. గతంలో సోనియాగాంధీ… మొన్నటివరకు రాహుల్ గాంధీ రావాలని కోరుకున్న నేతలు ఇప్పుడు ప్రియాంక వైపు చూస్తున్నారు. ఆమెకు ఉత్తరప్రదేశ్ లో పరిమితంగా పార్టీ బాధ్యతలను అప్పగించింది. అయినా సరే, మా రాష్ట్రానికి రావాలంటే మా రాష్ట్రానికి రావాలంటూ ఇతర రాష్ట్రా ల నేతలు ఏఐసీసీకి వినతులు పంపిస్తున్నారు. పలు రాష్ట్రా ల్లో ఆమెకు స్వాగతం చెబుతూ ముందే హోర్డింగులు కూడా పెట్టేస్తున్నారు. హైకమాండ్ ఆలోచన వేరేలా ఉన్నా… ప్రచారానికి ప్రియాంకను పంపించాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వచ్చి ప్రచారం చేయాలని ఇప్పటికే దాదాపు 20 రాష్ట్రాల కాంగ్రెస్ నేతల నుంచి ఏఐసీసీకి వినతులు వచ్చాయి. కొన్ని పీసీసీల నుంచి లేఖలు కూడా రాశారు. ఉత్తరప్రదేశ్ ఈస్ట్ ఇన్ చార్జ్ గా బాధ్యతలు తీసుకున్న ప్రియాంక అంతవరకే పరిమితం అవుతారని ఏఐసీసీ చెబుతున్నా రాష్ట్ర నేతలు తగ్గడం లేదు. జనవరి 23న ప్రియాంకను ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ యూపీ తూర్పు వ్యవహారాలను అప్పగించారు. దీనిపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం ఉప్పొంగింది. ఈ నిర్ణయం యూపీలోనే కాకుం డా దేశమంతా పార్టీ కేడర్ లో జోష్ నింపుతుందని రాహుల్ భావించారు.

అనుకున్నట్లుగా నే స్పందన వస్తున్నా.. అది ఇంకాస్త  ముందుకు పోయి అన్ని రాష్ట్రా ల్లోనూ ప్రచారం చేయాలని అడుతున్నారు.  ఇందిరాగాంధీని గుర్తుచేస్తారనే… నాయనమ్మ ఇందిరాగాంధీ పోలికలు స్పష్టంగా కనిపించే ప్రియాంకాగాంధీ ప్రచారానికి వస్తే బాగా కలిసొస్తుందని రాష్ట్రాల నేతలు నమ్ముతున్నారు. ఆమె వస్తే సభలకు భారీగా జనం రావడం ఖాయమని వారు భావిస్తున్నారు. ఇప్పటికీ ఇందిరమ్మ పేరు చెబితే ఓట్లేసే జనం ఉన్నారనీ, ప్రియాంక రాకతో ఆమెను గుర్తు చేసినట్లు ఉంటుందన్నది కాంగ్రెస్ నేతల ఆలోచన.

తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆశలు

ప్రియాంక ప్రచారానికి రావాలని మన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా హైకమాండ్ ను కోరుతున్నారు. గతంలో ఇందిరాగాంధీ పోటీ చేసిన మెదక్ పార్లమెంట్ సీట్ నుంచే ప్రియాంకను బరిలోకి దింపాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే రాహుల్ ను కోరారు. ఈనెల 5న రాహుల్ తో జరిగిన సమావేశంలో ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా ఇదే డిమాండ్ వినిపించారు. ఇందిరాగాంధీని పోలి ఉన్న ప్రియాంక ఏపీలో ప్రచారం చేయాలని రాహుల్ ను కోరినట్లు ఆంధ్రా పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి చెప్పారు. కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ, తమిళనాడు, గుజరాత్, రాజస్థా న్, పశ్చిమ బెంగాల్, హర్యానా , మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, బీహార్ నుంచి కూడా ఆమె రాక కోసం ఏఐసీసీకి వినతులు వెల్లువెత్తాయి. మరికొన్ని రాష్ట్రాల పీసీసీల నుంచీ ఇదే డిమాండ్ వినిపిస్తోంది.

అయినా… ఉత్తరానికే ప్రియాంక

రాష్ట్రాల నేతల డిమాండ్లు ఎలా ఉన్నా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రియాంక యూపీ దాటి ప్రచారం చేయకపోవచ్చని ఏఐసీసీ వర్గాలంటున్నాయి. రాహుల్ కు తోడుగా ఉండడం కోసమే ప్రియాంకను తెచ్చారు గానీ, ఆయనకు పోటీగా తీసుకురాలేదన్న సంకేతం పంపడానికే గాంధీ కుటుంబం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కి దేశవ్యాప్తంగా స్టార్ క్యాంపెయినర్ గా రాహుల్ ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గురువారం రాహుల్ తో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ చార్జుల సమావేశంలో అందరు జనరల్ సెక్రటరీలతో పాటే ప్రియాంకకు సీటు కేటాయించారుగానీ రాహుల్ పక్కన కూర్చోబెట్టలేదు. ఆయన పక్కన ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ చార్జి కేసీ వేణుగోపాల్, రాజ్యసభ, లోక్ సభల్లో పార్టీ ఫ్లోర్ లీడర్లు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గేకు సీట్లు కేటాయించారు. దీంతో ప్రియాంక మిగతావారితో సమానమనీ, వారికంటే ఎక్కువ కాదని సంకేతం ఇచ్చినట్లైంది. ఇప్పటి పరిస్థితుల్లో యూపీపైనే ప్రియాంక పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం మంచిదని గాంధీ కుటుంబం భావిస్తోంది. మొత్తం 80 స్థానాలున్న యూపీలో 44 సీట్లున్న ఈస్ట్ ప్రాంతానికి ఇన్ చార్జిగా ప్రియాంకను, పశ్చిమ యూపీలోని 36 సీట్లకు ఇన్ చార్జిగా జ్యోతిరాదిత్య సింథియాను నియమించారు.

యూపీ రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ అధికారంలో లేదు. గత పార్లమెం ట్ ఎన్నికల్లో అమేథీ, రాయ్ బరేలీ సీట్లను మాత్రమే పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ ఓట్ల శాతం కూడా 7 శాతానికి పడిపోయింది. యూపీలో గౌరవప్రదమైన సీట్లు సాధిస్తేనే కేంద్రంలో అధికారం అందుకోవడానికి వీలుంటుంది. దీంతో అటు బీజేపీకి, ఇటు తమను పట్టించుకోని ఎస్పీ, బీఎస్పీ కూటమికి గట్టి పోటీ ఇవ్వడానికి ప్రియాంకను పూర్తిగా యూపీలోనే ఉంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక అసలు పని మొదలు

గతంలోనూ ప్రియాంక కాంగ్రెస్ తరపున ప్రచారం చేసినా అమ్మ, అన్న నియోజకవర్గాలైన అమేథీ, రాయ్ బరేలీలకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఈ రెండు సీట్లు దాటి యూపీ అంతా ప్రచారం చేయనున్నారు. మూడు నెలల పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పూర్తిస్థాయిలో ప్రియాంక తన సమయాన్ని కేటాయించనున్నట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి ఆమె తన పని మొదలుపెట్టనున్నారు. ఈనెల 11న రాహుల్, ప్రియాంక కలిసి యూపీ వెళ్లను న్నారు. వారి రాక సందర్భంగా లక్నో ఎయిర్ పోర్ట్ నుంచి కాంగ్రెస్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీకి ప్లాన్ చేస్తున్నారు రాష్ట్ర నేతలు. మొదటి ర్యాలీతోనే అందరి దృష్టిని ఆకర్షించాలని వారు భావిస్తున్నారు. రాహుల్ టూర్ ఒక్కరోజే ఉండగా, ప్రియాంక 12, 13, 14 తేదీల్లో లక్నోలోనే ఉండి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్లాన్ చేయబోతున్నారు. ఒక ఎన్నికలకే పరిమితం కాకుండా దీర్ఘకాలికంగా రాష్ట్రంలో పార్టీని పటిష్ఠం చేసి, 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం చేయడం కూడా వ్యూహంలో భాగం అని చెబుతున్నారు. ఆమె ప్రచారంతో అద్భు తాలు జరుగుతాయన్న ఆశలు లేకపోయినా గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని రెట్టింపు చేసినా మంచి ఆరంభమేనని కాంగ్రెస్ నేతలంటున్నారు.

మరోవైపు ప్రియాంక యూపీ దాటి రారని ఏఐసీసీ సంకేతాలు ఇస్తుండడంతో ఇతర రాష్ట్రాల నేతలు నిరాశ పడుతున్నారు. అయితే రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమన్న ఆశ కూడా వారిలో కనిపిస్తోంది. ప్రస్తుతానికి యూపీకి పరిమితం చేసినా, తర్వాతైనా మనసు మార్చుకోవచ్చని వారు భావిస్తున్నారు.

నందుర్బార్ సెంటిమెంట్ పాటిస్తారా?

మహారాష్ట్రలో మారుమూల ప్రాంతమైన నందుర్బార్ నుంచి ప్రియాంక ప్రచారం మొదలుపెట్టాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏఐసీసీకి ఈమధ్యే లేఖ రాశారు. గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ ఇక్కడి నుంచే ప్రచారం మొదలుపెట్టి విజయాలు సాధించారని వారు చెబుతున్నారు. ఈ సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకొని ప్రియాంక కూడా ఇక్కడే ప్రచారం మొదలుపెట్టాలని మహారాష్ట్ర నేతలు హైకమాండ్ ను కోరారు. ఆమె ప్రచారం కోసం ఇప్పటికే ఏఐసీసీకి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ సుశీల్ కుమార్ షిండే మీడియాకు చెప్పారు.