టెన్త్ క్లాసు వరకు ఇంగ్లిష్​ మీడియం

టెన్త్ క్లాసు వరకు  ఇంగ్లిష్​ మీడియం

 

  •     అన్ని క్లాసులకూ ఒకేసారి
  •    తెలుగు మీడియం క్లాసులూ ఉంటయి: విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి  
  •     సబ్​కమిటీలో చర్చించి త్వరలో తుది నిర్ణయం తీసుకుంటం
  •     ఫ్యూచర్​లో ఇంగ్లిష్​ మీడియం టీచర్ పోస్టుల భర్తీకి ప్రాధాన్యం
  •     విమర్శలు మాని.. సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు సూచన 


హైదరాబాద్, వెలుగు: వచ్చే అకడమిక్​ఇయర్ లో ఫస్ట్ నుంచి టెన్త్ క్లాసు వరకు ఒకేసారి ఇంగ్లిష్​మీడియం క్లాసులు స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి చెప్పారు. దీనిపై సబ్​కమిటీలో చర్చించి తుదినిర్ణయం తీసుకుంటామన్నారు. అన్ని బడుల్లో తెలుగుమీడియం క్లాసులు కూడా కొనసాగుతాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదువుతున్న 22 లక్షల మందిలో 10 లక్షలకు పైగా స్టూడెంట్లకు ఇంగ్లిష్ మీడియం ఉందన్నారు. కొందరు ప్రతిపక్ష నేతలు కనీసం అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చౌకబారు విమర్శలు, రాజకీయాలు మాని, విద్యారంగ అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. బుధవారం హైదరాబాద్ లో తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడారు. జీవో 317 ద్వారా టీచర్ల అలకేషన్​ పూర్తయిన తర్వాత కొత్త రిక్రూట్​మెంట్ చేపడతామన్నారు. ఇంగ్లిష్ మీడియం క్లాసుల దృష్ట్యా.. రానున్న టీఆర్టీ నోటిఫికేషన్​లో ఇంగ్లిష్ మీడియం టీచర్ల భర్తీకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెలుగు మీడియం టీచర్లకు ఇంగ్లిష్ లో మెలకువల కోసం ఇటీవల అజీమ్ ప్రేమ్ జీ సంస్థ ద్వారా 1,400 మందికి ట్రైనింగ్ పూర్తయిందని, రానున్న రోజుల్లో టీచర్లందరికీ శిక్షణ ఇస్తామన్నారు. సర్కారు బడులు, గురుకులాల్లో కలిపి ఇప్పటి వరకు 30 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసినట్టు చెప్పారు. కరోనా కేసులు తగ్గితే విద్యాసంస్థలు తెరుస్తామని, ఈనెలాఖరు వరకు కేసులు తగ్గే చాన్స్​ఉందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. 

ఫస్ట్ ఫేజ్​లో 35 శాతం స్కూళ్ల అభివృద్ధి
‘మన ఊరు– మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్రంలో 35 శాతం స్కూళ్లను ఎంపిక చేసి డెవలప్ ​చేస్తామని సబితా రెడ్డి చెప్పారు. 9,123 స్కూళ్లలో సౌలత్​ల కోసం రూ. 3700 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఫస్ట్ ఫేజ్ లోనే 65 శాతం స్టూడెంట్లున్న స్కూల్స్​కవర్ అవుతున్నాయన్నారు. పనుల పర్యవేక్షణ బాధ్యత కలెక్టర్లకే ఇస్తున్నామన్నారు. స్కీమ్ అమలుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫండ్స్​తో పాటు సర్కారు నిధులు కలిసి రూ. 7,289 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. 

ఫీజుల నియంత్రణకు చట్టం 
ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కోసం పకడ్బందీ చట్టం తీసుకువస్తామని మంత్రి సబితారెడ్డి వెల్లడించారు. గతంలో సర్కారు వేసిన తిరుపతిరావు కమిటీ ఇచ్చిన రిపోర్టులోని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. పక్క రాష్ర్టాల్లో ఫీజుల కట్టడికి తీసుకుంటున్న చర్యలను కూడా అధ్యయనం చేసి చట్టం తీసుకొస్తామని ఆమె తెలిపారు.  జీవో 317తో ఇబ్బందులు పడుతున్న టీచర్లకు న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు. స్పౌజ్ టీచర్లతో పాటు, విడో, ఒంటరి మహిళా టీచర్లకు ఇబ్బందుల్లేకుండా చూస్తామని చెప్పారు. పరస్పర బదిలీలకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు.