గత బీఆర్ఎస్ సర్కార్ వేలం వెర్రి! : వేలానికి విచ్చలవిడిగా అనుమతులు

గత బీఆర్ఎస్ సర్కార్ వేలం వెర్రి! : వేలానికి విచ్చలవిడిగా అనుమతులు
  • ఎనిమిదేండ్ల కిందే సున్నపురాయి 
  • గని ఆక్షన్ కోసం కేంద్రానికి లేఖ
  • 11 మైన్స్​ను నోటిఫై చేసిన సెంట్రల్ గవర్నమెంట్
  • ఆరు గనుల వేలం కోసం పట్టుబడుతున్న కేంద్రం
  • ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు
  • గనులు కాపాడుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నాలు
  • ప్రభుత్వరంగ సంస్థలకే ఇవ్వాలని కోరే యోచనలో రేవంత్ ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గనుల వేలంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాచిన అంశాలన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. 2015లోనే భూపాలపల్లి ఏరియాలోని తాడిచెర్ల బొగ్గు గనిని ఓ ప్రైవేట్ కంపెనీకి 30 ఏండ్ల పాటు కేసీఆర్ సర్కార్ లీజుకు ఇచ్చింది. అదేవిధంగా, వివిధ ప్రాంతాల్లో ఉన్న ఐరన్ ఓర్, లైమ్ స్టోన్ (సున్నపు రాయి) గనుల వేలానికీ విచ్చలవిడిగా అనుమతులు మంజూరు చేసింది. ఎనిమిదేండ్ల కిందే సున్నపురాయి గనుల వేలానికి అనుమతించాలంటూ కేంద్రానికి బీఆర్ఎస్ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం 11 గనులను నోటిఫై చేసింది. వాటి వేలానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు పట్టుబడుతున్నది.
ఈ నెల 30లోగా కనీసం ఆరు గనులకు వేలం వేయాల్సిందేనంటూ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటీవల కేంద్రం అల్టిమేటం జారీ చేసింది. దీంతో ఇన్నిరోజులు సింగరేణి బొగ్గు బ్లాకులకే పరిమితమైందనుకున్న వేలం వెర్రి.. ఐరన్ ఓర్, సున్నపు రాయి గనులకు కూడా పాకినట్లయ్యింది. 

గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకం వల్లే..

గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకం కారణంగా విలువైన ఖనిజ సంపద ప్రైవేట్​పరం కాకుండా కాపాడుకునేందుకు కాంగ్రెస్​ సర్కారు మల్లగుల్లాలు పడుతున్నది. మరోవైపు బొగ్గు, ఐరన్​ఓర్, సున్నపురాయి గనులను వేలం ద్వారా తమవాళ్లకు కట్టబెట్టేందుకు అధికారంలో ఉన్నప్పుడే నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ నేతలు.. తీరా ఇప్పుడు నానాయాగీ చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు గనుల వేలానికి సంబంధించి కేంద్రం విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నది. ఈ క్రమంలో ప్రైవేటు కంపెనీలకు కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలకే మైన్స్ కేటాయించేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది.

సింగరేణి తరహాలోనే ప్రైవేటుకు..​

కేంద్ర ప్రభుత్వం 2015లో తెచ్చిన మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ సవరణ చట్టానికి బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్​లో మద్దతిచ్చారు. దీనిప్రకారం 2021 నుంచి 2023 మధ్యకాలంలో తెలంగాణకు చెందిన కల్యాణిఖని, కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం వేలం వేసింది. అందులో సింగరేణిని పాల్గొనకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోవడంతో కోయగూడెం, సత్తుపల్లి గనులు ప్రైవేట్​పరమయ్యాయి.

2020, సెప్టెంబర్ 16న కేంద్రానికి లేఖ

2015లోనే సింగరేణికి దక్కాల్సిన తాడిచెర్ల బొగ్గు గనిని అప్పటి కేసీఆర్ సర్కారు ఒక ప్రైవేట్ కంపెనీకి 30 ఏండ్ల పాటు లీజుకిచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వేలం వెర్రి ఇక్కడితో ఆగలేదు. బొగ్గు తరహాలోనే రాష్ట్రంలోని సున్నపురాయి, ఐరన్ ఓర్ గనులను కూడా తమ అనుయాయులు నడుపుతున్న ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకు ఎనిమిదేండ్ల కిందే ఫైళ్లు కదిపింది. 

ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాలోని పసుపులబోడు, సైదులునామా, సుల్తాన్ పూర్ సున్నపు రాయి గనులను వేలం వేస్తామని, ఇందుకు అనుమతించాలని 2020, సెప్టెంబర్ 16న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర గనులు, ఖనిజాల శాఖకు లేఖ రాశారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. గనుల వేలానికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించడంతో కేంద్రం ముందస్తు అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు 2021, డిసెంబర్ 12న కేసీఆర్ సర్కారుకు లెటర్ రాయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వేలం వేసేందుకు అనువైన 11 గనుల వివరాలను రాష్ట్ర సర్కారు నుంచి తెప్పించుకున్నది.  

కేంద్రం లేఖతో వెలుగు చూసిన వ్యవహారం

గనులు, ఖనిజాల వేలం ప్రక్రియ ఏయే దశల్లో ఉందో కేంద్ర ప్రభుత్వం ఇటీవల అన్ని రాష్ట్రాల్లో ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. ఈ సమాచారం ఆధారంగా తెలంగాణలో నోటిఫై చేసిన 11 గనుల వేలం ప్రక్రియను స్పీడప్ చేయాలని 2024, మే 20న కేంద్ర భూగర్భగనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. 2015 చట్టం ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 354 మేజర్ మినరల్ బ్లాకులను కేంద్రం వేలం వేసింది. 

వీటిలోని 48 బ్లాకుల్లో ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. ఈ క్రమంలోనే తెలంగాణలో కేంద్రం నోటిఫై చేసిన 11 గనుల వేలం ప్రక్రియను స్పీడప్​ చేయాలని కోరింది. జూన్ 30వ తేదీలోగా కేంద్రం నోటిఫై చేసిన 11 గనుల్లో కనీసం ఆరు గనులను వేలం వేయాలని గడువు విధించింది. లేకపోతే ఎంఎండీఆర్ చట్టంలోని సెక్షన్ 10 బీ, 11 ప్రకారం కేంద్రమే ఈ గనులను వేలం వేస్తుందని 
స్పష్టం చేసింది.

కాపాడుకునేందుకు రాష్ట్ర సర్కార్ తిప్పలు

కేంద్రం నోటిఫై చేసిన 11 గనుల్లో సూర్యాపేట జిల్లాలోని సైదులనామా, సుల్తాన్​పూర్, పుసుపులబోడు, ఖమ్మం జిల్లాలోని చింతలతాండ, ఆదిలాబాద్ జిల్లాలోని కంప జునపానితో పాటు మరికొన్ని ఉన్నాయి. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో ఈ గనులపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తున్నది. అప్పుడే ఈ గనుల వేలానికి ఒప్పుకోకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ఖనిజ సంపదను కాపాడుకోవాలనే సోయిని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను గత ప్రభుత్వం విస్మరించటం వల్లే ఈ దుస్థితి తలెత్తిందనే అభిప్రాయాలున్నాయి. తామే గనుల వేలానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని దాచిపెట్టి.. గడిచిన పదేండ్లు తెలంగాణలోని ఖనిజ సంపదను కాపాడినట్లు, ఇప్పుడు కాంగ్రెసే వచ్చి వేలం వేస్తున్నట్లు బీఆర్ఎస్ పెద్దలు మాట్లాడుతున్న తీరుపై ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.