పాదయాత్రల పర్వం..ఎవరు ప్రత్యామ్నాయం?

పాదయాత్రల పర్వం..ఎవరు ప్రత్యామ్నాయం?

ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రజా సమస్యలే వైఎస్సార్​పాదయాత్రను విజయవంతం చేశాయి. ఆ పాదయాత్రతోనే ఆయన అప్రకటిత సీఎం అభ్యర్థి అయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. అప్పటి నుంచి అధికారానికి పాదయాత్రలే ప్రధాన సాధనంగా భావిస్తున్న నాయకులు బాగా పెరుగుతున్నారు. చాలామంది తమ రాజకీయ జీవితానికి పాదయాత్రను ఒక మైలురాయిగా భావిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అన్ని పార్టీలు యాత్రలపైనే దృష్టిపెట్టాయి. 

బండి సంజయ్​ పాదయాత్ర

బీజేపీ స్టేట్​ చీఫ్ ​బండి సంజయ్​ పాదయాత్ర విడతల వారీగా కొనసాగుతున్నది. బీజేపీలో ఒక సాధారణ కార్యకర్త ఎంపీగా ఎన్నిక కావడం తెలంగాణ ప్రజల్లోనూ ఆయన పట్ల ఒక రకమైన ఆసక్తిని కలిగించింది. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణకు ఒక కొత్త నాయకుడిని పరిచయం చేయాలనుకొని ఆయనకు పార్టీ బాధ్యతలు ఇచ్చింది. గడిచిన 40 ఏండ్లలో ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలు పెడితే, తెలంగాణ ఏర్పడ్డాక కూడా 2016 వరకు టీడీపీ అలయెన్స్​తోనే బీజేపీ ఎక్కువ కాలం గడిపింది. అందుకే తెలంగాణలో బీజేపీ విస్తరణకు ఏనాడూ అవకాశం(1983లో తెలుగుదేశం పుట్టి ఉండకపోతే.. రాష్ట్రంలో బీజేపీ ప్రధాన పార్టీగా ఉండేది.) రాలేదు. 2016 నుంచి తెలంగాణలో ఒంటరిగా ఎదగాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగానే కొత్త నాయకత్వాన్ని ప్రజల వద్దకు పంపే పాదయాత్రకూ శ్రీకారం చుట్టింది. సంజయ్​ ఘాటు విమర్శలు, ఆయన తెలంగాణ యాస, భాషలు ఆ మేరకు గ్రామీణులను, యువతను ఆకట్టుకున్నది. బీజేపీకి 40 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నా.. టీడీపీతో సుదీర్ఘ కాల స్నేహం కారణంగా.. ఆ పార్టీ తెలంగాణ గ్రామాల్లో మళ్లీ పునరుజ్జీవం పొందుతున్నది. తొమ్మిదేండ్ల కేసీఆర్​ పాలనపై సంజయ్​ చేస్తున్న విమర్శలు పల్లెల దాకా వెళుతున్నాయి. బీజేపీని తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా నిలపడంలో అవి ఉపకరిస్తున్నాయి కూడా. అలాగే, కేసీఆర్​ ప్రభుత్వ అవినీతిపై సంజయ్​ తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న  బీజేపీయే ఆ అవినీతిని బయట పెట్టగలుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఆ నమ్మకమే తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి బలమైన కారణంగా మారింది. అవినీతిపై చర్యలు ఉంటే బీజేపీ గ్రాఫ్​మరింత పెరిగే అవకాశం ఉంటుందనేది విశ్లేషకుల మాట. కసి రాజకీయం చేస్తేనే బీజేపీలోకి వలసలు పెరిగే చాన్స్​ఉంది. మొత్తానికి సంజయ్​ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర తెలంగాణ గ్రామాల్లో బీజేపీకి పునాదులు వేసింది. ఆయన తన మొదటి పాదయాత్ర ముగింపు సభలో ‘బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం’ ఫైల్​పైనే మొదటి సంతకం పెడతామని ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ, ఆ హామీ ప్రతి తెలంగాణ వాసికి తెలిసేలా ఆశించిన స్థాయిలో ఆ పార్టీ ప్రచారం చేసుకోలేకపోతున్నది. తాము అధికారంలోకి వస్తే ఏంచేస్తాం, ఎలా పాలిస్తాం అనే టూకీ మెనిఫెస్టోను ప్రజలకు వివరించే ప్రయత్నం ఆ పార్టీ ఆశించిన స్థాయిలో చేసుకోలేకపోతున్నది. 

రేవంత్​ యాత్ర

కసి రాజకీయానికి మారుపేరుగా  రేవంత్ రెడ్డి పాపులర్.  కేసీఆర్ కు రాజకీయ బద్ధశత్రువుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు కావడానికి ఆయనకు అదే ఉపయోగపడి ఉంటుంది. కానీ సీనియర్స్​ నుంచి సహకారం లేకపోవడం, ఆయన కూడా తనదైన రాజకీయం నడపడం, సీనియర్లకు గిట్టడం లేదనే వాదనలూ ఉన్నాయి. ఏది ఏమైనా అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ‘హాత్​ సే హాత్​జోడో’ కార్యక్రమంలో భాగంగా రేవంత్ పాదయాత్రలు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ ప్రసంగాల్లో, మాటల్లో రాజకీయ చాతుర్యం కనిపిస్తుంటుంది. పేదలకు అనుమతిలేని ప్రగతిభవన్​ను మావోయిస్టులు బాంబులు పెట్టి కూల్చేయాలనడం.. ఒక సంచలనమే. గోదావరి బెల్ట్​లో ఆ మాట మాట్లాడటంలో రేవంత్ ​వ్యూహాత్మక రాజకీయం! ప్రతిపక్షంలో ఉన్నపుడు నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అని ఒకప్పుడు ఎన్టీఆర్​అన్నాడు, తర్వాత కేసీఆర్ దాన్నే వల్లెవేశారు. ఇపుడు రేవంత్​ మావోయిస్టులను జ్ఞాపకం చేయడం కూడా అలాంటిదే! మావోయిస్టుల సానుభూతి కోసం మాట్లాడిన ఎన్టీఆర్, కేసీఆర్,​ వారు అధికారంలోకి వచ్చాక అదే మావోయిస్టుల వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఇయ్యాల రేవంత్ కూడా గోదావరి బెల్ట్​లో ప్రజల సానుభూతి కూడగట్టే ప్రయత్నం చేశారు. రేవంత్​యాత్ర, వైఎస్​ స్థాయిలో లేకపోవచ్చు. కానీ, ఆయన పీసీసీ అధ్యక్షుడిగా తన పర్సనాలిటీని ప్రజలకు మరింత చేరువగా పరిచయం చేసుకుంటున్నారు. వరంగల్ డిక్లరేషన్​ కాంగ్రెస్​కు వర్కవుట్ అయితదా? ధరణి రద్దుతో పాటు, ఇతర హామీల్లో కొన్ని అలవికానివీ ఉన్నాయి. రేవంత్​ కసి రాజకీయం కాంగ్రెస్​ను అధికారంలోకి తేగలుగుతుందా? పూర్తి మెజారిటీ సాధిస్తే ఓకే, లేదంటే గెలిచిన వారిని పార్టీ ఫిరాయించకుండా ఆపడం పార్టీ చీఫ్​గా ఆయనకు కత్తిమీద సామే కావొచ్చు!

ఆర్ఎస్. ప్రవీణ్​కుమార్​

గురుకులాలను చక్కదిద్దిన ఉన్నతాధికారి ఆర్​ఎస్పీ. బ్యూరోక్రాట్​గా కేసీఆర్​ప్రభుత్వంలోని వైఫల్యాలను దగ్గరగా చూసిన అనుభవం ఆయనది. కేసీఆర్ పెట్టిన చాలా పథకాల్లో ఓట్లు తప్ప ప్రజలు లేరని ఆయన చెబుతున్నారు. ఆయన ఒక పార్టీ కన్వీనర్​గా పొలిటికల్​గుర్తింపు సాధించినా.. ఆయనకు వచ్చే ఓట్లు, సాధించే విజయం పై అందరికీ అనుమానాలున్నాయి. ఇవాళ ఉచిత విద్య, వైద్యం అనే అంశాన్ని తెలంగాణ రాజకీయాల్లో  ఒక అనివార్య డిమాండ్​గా మార్చిన ఘనత మాత్రం ఆర్​ఎస్పీదే. ఆయన రాజకీయంగా ఏ మేరకు రాణించారనే కన్నా.. సమాజానికి ఒక సందేశకుడిగా మాత్రం ప్రజల్లో ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ మేరకు ఆయన యాత్రలు సఫలమవుతున్నట్లే.

వైఎస్​ షర్మిల

వైఎస్​షర్మిల.. అధికార పార్టీ అవినీతి, అక్రమాలు, ప్రజా సమస్యలపై ఘాటు విమర్శలు చేస్తూ పాదయాత్రలు చేస్తున్నారు. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంత సమస్యలపైనే స్పందిస్తుండటం, అక్కడి స్థానిక నేతల అవినీతిపై బహిరంగంగా నిలదీస్తుండటం మిగతా వారి పాదయాత్రల కంటే కొంత భిన్న వైఖరికి ఊతమిస్తున్నది. అలాంటి నిలదీతలు సహజంగానే అక్కడి నేతలకు కంటగింపుగా మారుతున్నది. అందుకే ఆమె పాదయాత్రలో ఘర్షణ వాతావరణం కొనసాగుతున్నది. ఇలాంటి వాటి వల్ల ఆమె రాజకీయంగా మరింత ఫోకస్​అవుతున్నారు. ఆమె పార్టీ సాధించే విజయాలెన్నో తెలియదు కానీ, ఆమె గొంతు కేసీఆర్​ ప్రభుత్వ వైఫల్యాలను గ్రామాల దాకా చేరవేస్తూ వస్తున్నదనడంలో సందేహం లేదు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటే కీలకం

మొత్తంగా ప్రతిపక్ష లీడర్ల పాదయాత్రలతో రాష్ట్ర రాజకీయాలు రక్తి కడుతున్నాయి. ప్రతిపక్షాలన్నీ  సహజంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటునే ఆశిస్తాయి. వ్యతిరేక ఓటు చీలితే.. తమ గెలుపు సులభమని బీఆర్​ఎస్​ అధినేత ఆశిస్తూ ఉంటారు.2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటరు బలమైన అభ్యర్థిని వెతికి ఓటేశాడు కాబట్టే, 4 లోక్​సభ స్థానాల్లో బీజేపీ, 3 లోక్​సభ స్థానాల్లో కాంగ్రెస్​ గెలిచింది. ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టుకునే పార్టీదే తెలంగాణలో రేపటి విజయం. అందులో ఎవరికీ అనుమానం లేదు. అన్ని పార్టీల పాదయాత్రలు తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటరును తట్టిలేపగలుగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా 9 నెలల కాలముంది. ఆ లోపు పాదయాత్రలతో ప్రత్యామ్నాయం ఎవరు కాబోతున్నారు? బీజేపీ, కాంగ్రెస్​పార్టీల రాజకీయ వ్యవహార శైలి ఎలా ఉండబోతున్నదనే దానిపైనే ఆ పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

- కల్లూరి శ్రీనివాస్​ రెడ్డి,
సీనియర్​ జర్నలిస్ట్