- ఓ కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక కామెంట్స్
- మతమార్పిడుల కేసులో నిందితుడికి నో బెయిల్
- యూపీలో మత మార్పిడులు పెరుగుతున్నాయని వెల్లడి
ప్రయాగ్ రాజ్ : సామూహికంగా మత మార్పిడులు నిర్వహించే సమావేశాలను వెంటనే ఆపాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. అలాంటి సభలను అనుమతిస్తూ పోతే.. ఏదో ఒక రోజు దేశంలోని మెజార్టీ జనాభా మైనార్టీలుగా మారిపోతారని కీలక కామెంట్ చేసింది. యూపీలోని హమీర్ పూర్ నుంచి గ్రామస్తులను ఢిల్లీకి తీసుకెళ్లి క్రైస్తవ మతంలోకి మారుస్తున్నాడన్న కేసులో నిందితుడు కైలాస్ కు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు జడ్జి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ సోమవారం తిరస్కరించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ ఉంటుందని, మత ప్రచారం కూడా చేసుకోవచ్చని.. కానీ మత ప్రచారం అంటే ఇతరులను ఒక మతం నుంచి మరో మతంలోకి మార్చడం కాదని తేల్చిచెప్పారు. హమీర్ పూర్ నుంచి అనేక మందిని కైలాస్ తీసుకెళ్లి మత మార్పిడి చేయిస్తున్నాడని, అందుకు బదులుగా డబ్బులు కూడా తీసుకుంటున్నాడనేందుకు సాక్షులు కూడా ఉన్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలు, పేద వర్గాల వారిని చట్ట విరుద్ధంగా మత మార్పిడులు చేస్తున్నారన్న విషయం కూడా కోర్టు దృష్టికి వచ్చిందన్నారు.
విచారణ సందర్భంగా అడిషనల్ ఏజీ పీకే గిరి వాదిస్తూ.. అలాంటి సభలకు ప్రజలను పెద్ద ఎత్తున తీసుకెళ్లి మత మార్పిడి చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఇందుకోసం నిందితుడు కైలాస్ డబ్బులు కూడా తీసుకుంటున్నాడని సాక్షులు చెప్పారన్నారు. కైలాస్ తరఫు అడ్వకేట్ వాదిస్తూ.. రామ్ పాల్ ను నిందితుడు క్రైస్తవ మతంలోకి మార్చలేదని, కేవలం క్రైస్తవ సమావేశానికి మాత్రమే తీసుకెళ్లాడని చెప్పారు.
ఇదీ కేసు..
హమీర్ పూర్కు చెందిన రామ్ కాలీ ప్రజాపతి అనే మహిళ సోదరుడు రామ్ పాల్ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఢిల్లీలో ట్రీట్ మెంట్ చేయిస్తానని, వారంలో తిరిగి తీసుకొస్తానని చెప్పి అతడిని కైలాస్ తీసుకెళ్లా డు. తన సోదరుడు తిరిగి రాకపోవడంతో కైలాస్ను రామ్ కాలీ ప్రశ్నించగా.. సరైన జవాబివ్వలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామస్తులను ఢిల్లీకి తీసుకెళ్లి మతమార్పిడి చేస్తున్నారని పోలీసులు కేసు నమోదు చేశారు.
