ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు: పొత్తులు ఎన్నికల ఎత్తుగడల్లో భాగమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కొత్తగూడెంలో బైక్​ ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్లబ్​లో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీల పునరేకీకరణ అవసరమని అన్నారు. సీపీఐ, సీపీఎంతో పాటు అన్ని ఎర్రజెండా పార్టీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో మహాత్మా గాంధీ పోటీ చేసినా గెలిచే అవకాశాలు లేవన్నారు.  సెప్టెంబర్​ 17ను వక్రీకరించేందుకు బీజేపీ చూస్తుందని విమర్శించారు.  కొత్తగూడెంలో సీపీఐ రాష్ట్ర నాయకుడు కాసాని ఐలయ్య, జిల్లా  కార్యదర్శి ఎస్కే షాబీర్​ పాషా, హేమంతరావు, విజయసారథి, అన్నవరపు కనకయ్య, మేరెడ్డి వసంత, మేరెడ్డి జనార్దన్​రెడ్డి, వై శ్రీనివాస్​రెడ్డి, మిర్యాల రంగయ్య, బందెల నర్సయ్య, దమ్మాలపాటి శేషయ్య, ధర్మా, మద్దెల శివకుమార్, అబీద్​, ఏపూరి బ్రహ్మం, ఖమ్మంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాగం హేమంతరావు, పోటు ప్రసాద్, జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.

కూనంనేనిపై కేసు నమోదు

ఖమ్మం రూరల్: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు భాగం హేమంతరావుపై రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఖమ్మంలో ఏర్పాటు చేసిన సభలో రూరల్​ సీఐ శ్రీనివాస్​ని ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, ఖాకీ డ్రెస్ తీసి జెండా కప్పుకొని రావాలని, ఇక్కడి నుంచి పంపించే దాకా వెంట పడతామని బెదిరించే ధోరణిలో మాట్లాడారు. హెడ్​ కానిస్టేబుల్​ ఫిర్యాదు మేరకు 505, 294 బీ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై​జక్కుల శంకర్​రావు తెలిపారు.

షోయబుల్లాఖాన్​ విగ్రహానికి క్షీరాభిషేకం

కూసుమంచి, వెలుగు: నిజాం నిరంకుశ పాలకు వ్యతిరేకంగా రచనలు రాసి రజాకార్ల చేతిలో అసువులు బాసిన తొలితరం పాత్రికేయుడిగా షోయబుల్లాఖాన్​ చరిత్రలో నిలిచి పోతారని హనుమకొండ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు అన్నారు. శుక్రవారం తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామంలో షోయబుల్లాఖాన్​ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కిసాన్​ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్​రెడ్డి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల అధ్యక్షులు గల్లా సత్యానారాయణ, కోనేరు సత్యానారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు నున్నా రవి, రుద్ర ప్రదీప్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంగల నారాయణ, నరేందర్​రావు, శ్రీనివాసరెడ్డి, ఉదయ్​ పాల్గొన్నారు.

ఆశ్రమ పాఠశాలలో అపరిశుభ్రతపై ఆగ్రహం

కామేపల్లి, వెలుగు: కామేపల్లిలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావీద్ పాషా శుక్రవారం తనిఖీ చేశారు. క్లాస్​ రూమ్స్, కిచెన్, పరిసరాలను పరిశీలించారు. ఆవరణలో వంట చేయడం, ఈగలు ఉండడాన్ని చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉడికిన గుడ్లపై ఈగలు వాలకుండా చూసుకోలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కందిపప్పు నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జ్వరంతో బాధపడుతున్న శశిరేఖతో మాట్లాడి వెంటనే వైద్యం అందించాలని సిబ్బందినిఆదేశించారు. పరిసరాలలో నీరు నిలువ ఉండడాన్ని గమనించి డ్రై డేపై టీచర్లకు అవగాహన లేకుంటే ఎలాగని ప్రశ్నించారు. ఆశ్రమ పాఠశాల దుస్థితిపై నివేదిక అందిస్తామని చెప్పారు. 

ఏటీడీవో విచారణ

పురుగుల అన్నం పెడుతున్నారనే వార్త రావడంతో వైరా ఏటీడీవో తిరుమలరావు శుక్ర వారం విచారణ చేపట్టారు. రహస్యంగా విచారణ జరిపిన ఆయన తమను భయపెట్టి వార్డెన్, సిబ్బందికి అనుకూలంగా రాసి ఇవ్వాలని ఒత్తిడి చేశారని విద్యార్థినులు తెలిపారు. దీనిపై ఏటీడీవోను వివరణ కోరగా విచారణ చేయొద్దా అంటూ ఎదురు
 ప్రశ్నించారు. 

జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలి

పాల్వంచ,వెలుగు: గిరిజన క్రీడాకారులు జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని ఐటీడీఏ డీడీ రమాదేవి పిలుపునిచ్చారు. మండలంలోని కిన్నెరసాని క్రీడా పాఠశాలలో క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరై ప్రైజులను అందజేశారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ క్రీడల్లో చురుకుగా పాల్గొనే వారు అన్నిరంగాల్లో ముందుంటారని చెప్పారు. క్రీడల అధికారి ఎం వీరానాయక్, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు బి వెంకటేశ్వర్లు, బాలసుబ్రమణ్యం, నగేశ్, హరికృష్ణ, గోపాలరావు, నాగే శ్వరరావు, రాంబాబు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు ఎంపీల పరామర్శ

మధిర, వెలుగు: టీఆర్ఎస్  లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం మధిర మండలం, పట్టణంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల మధిర 20వ వార్డు కౌన్సిలర్ ముత్తవరపు రాణి మృతి చెందగా, భర్త ప్యారీ, కుమార్తెలను పరామర్శించి సానుభూతి తెలిపారు. కౌన్సిలర్​ ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇటీవల చనిపోయిన మధిర మండలం దేశినేనిపాలెం టీఆర్ఎస్​ గ్రామ అధ్యక్షుడు పాలేటి శ్రీనివాసరావు కుటుంబసభ్యులను పరామర్శించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు తదితరులు పాల్గొన్నారు.

పాత పోలీస్ స్టేషన్ ను స్మృతి భవనంగా మారుస్తా

వేంసూరు, వెలుగు: వేంసూర్ గ్రామంలో నైజాం కాలంలో నిర్మించిన పోలీస్ స్టేషన్ ను రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుల స్మృతి భవనంగా మారుస్తామని బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను స్మరించుకుంటూ, పోరాట ప్రాంతాలను సందర్శించి నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. 1927లో వేంసూర్ లో నిర్మించిన పోలీస్ స్టేషన్ ను స్మృతి భవనంగా తీర్చిదిద్దే విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు, కృష్ణయ్య, మాజీ ఎంపీటీసీ మట్టా ప్రసాద్  
పాల్గొన్నారు.

కోడలిని చంపేందుకు యత్నించిన అత్తమామలపై కేసు

ఎర్రుపాలెం, వెలుగు: కోడలిపై కిరోసిన్​ పోసి హత్య చేసేందుకు యత్నించిన అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి.. మండల కేంద్రంలోని కొప్పు మార్కండేయులు గత ఏడాది కొవిడ్​ బారిన పడి చనిపోయాడు. అప్పటి నుంచి ఆయన భార్య కొప్పు అంజని (35) ఏపీలోని అల్లూరు గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. భర్త చనిపోయినప్పటి నుంచి ఆస్తి వివాదాలు కొనసాగడంతో అత్తింటికి దూరంగా ఉంటోంది. గురువారం ఇంటికి వచ్చేందుకు ప్రయత్నించగా అత్తమామలు కొప్పు విశాలాక్షి, రాఘవరావు ఆమెను అడ్డుకున్నారు. మహిళా సంఘాల సహకారంతో ఇంటికి వెళ్లిన అంజనిపై శుక్రవారం అత్తమామలు కొట్టేందుకు యత్నించడంతో పాటు కిరోసిన్ పోసి హత్య చేసేందుకు యత్నించారు. నాలుగేండ్ల కూతురు సీతాఅంశతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. 

టీఎన్జీవోస్  అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక

ఖమ్మం టౌన్, వెలుగు: టీఎన్జీవోస్  ఖమ్మం పట్టణ అధ్యక్ష,కార్యదర్శులుగా నాగుల్ మీరా, కట్ట నవీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్  అఫ్జల్ హసన్ తెలిపారు. టౌన్ అధ్యక్ష,కార్యదర్శులు సామినేని రఘుకుమార్, ఎండీ మజీద్  గెజిటెడ్ ఆఫీసర్లుగా ప్రమోషన్​ రావడంతో వారి స్థానంలో  అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకున్నట్లు చెప్పారు. జిల్లా కార్యదర్శి ఆర్వీ ఎస్ సాగర్, ఉపాధ్యక్షుడు నందగిరి శ్రీను, ట్రెజరర్  భాగం పవన్ కుమార్, ఆర్ఎన్  ప్రసాద్, కరణ్ సింగ్ పాల్గొన్నారు.

సెక్రటేరియట్​కు అంబేద్కర్​ పేరు పెట్టడం హర్షణీయం

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: కొత్తగా నిర్మిస్తున్న సెక్రటేరియట్​కు అంబేద్కర్​ పేరు పెట్టడం హర్షణీయమని మంత్రి పువ్వాడ​అజయ్​కుమార్​ అన్నారు. శుక్రవారం సిటీలోని టీఆర్ఎస్​ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా అంబేద్కర్, సీఎం కేసీఆర్​ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. అంబేద్కర్​ పేరు పెట్టడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. దళితుల పట్ల సీఎం కేసీఆర్​కు ఉన్న నిబద్ధత, గౌరవాన్ని అంబేద్కర్​ పేరుపెట్టి మరోసారి చాటుకున్నారన్నారు. కొంత మంది చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ తాతా మధుసూధన్, డీసీసీబీ చైర్మన్​ కూరాకుల నాగభూషయ్య, నగర మేయర్​ నీరజ, బొమ్మెర రామ్మూర్తి, సుడా చైర్మన్​ విజయ్, నాగరాజు, తోగర భాస్కర్, చింతనిప్పు కృష్ణచైతన్య పాల్గొన్నారు.

108 లేక తిప్పలు

కూసుమంచి, వెలుగు: మండలంలోని గోరీలపాడుతండాకు చెందిన బానోతు సుక్యా(71)ని పాము కాటు వేయడంతో మండలకేంద్రంలోని పీహెచ్​సీకి తీసుకొచ్చారు. డాక్టర్​ శ్రీనివాసరావు యాంటీ స్నేక్​ వీనమ్​ ఇంజక్షన్​ వేసి మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారు. 108 అందుబాటులో లేకపోవడంతో గంట సేపు వేచి చూసి ఆటోలో ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

లక్ష్మీతాయారు అమ్మవారికి అభిషేకం

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో లక్ష్మీతాయారు అమ్మవారికి శుక్రవారం పంచామృతాలతో అభిషేకం చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి విష్ణుసహస్ర పారాయణం నిర్వహించారు. మహిళలకు మంజీరాలు పంపిణీ చేశారు. అంతకుముందు ఉదయం గర్భగుడిలో రామయ్య మూలవరులకు స్వర్ణ కవచాలను అలంకరించారు. ప్రాకార మండపంలో కల్యాణమూర్తులకు నిత్య కల్యాణ క్రతువు జరిపించారు. సాయంత్రం దర్బారు సేవ చేసి అద్దాల మండపంలో స్వామికి సంధ్యాహారతి ఇచ్చారు. ఈవో శివాజీ దసరా మండప ప్రాంగణంలో జమ్మి మొక్కలను నాటారు. 

సమైక్యతా ర్యాలీకి వస్తే అన్నం పెట్టలే

అశ్వారావుపేట, వెలుగు: పట్టణంలో నిర్వహించిన సమైక్యతా ర్యాలీలో పాల్గొన్న వారికి అధికారులు కనీసం అన్నం కూడా పెట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. భోజనాల వద్ద తోపులాట జరగడం, అందరికీ భోజనం లేకపోవడంతో విద్యార్థులు, ప్రజలు ఇబ్బందిపడ్డారు. పేరాయిగూడెం సర్పంచ్ సుమతిని స్టేజీ మీదకు పిలవకపోవడంతో అలిగి వెళ్లిపోయారు. సభ జరుగుతుండగానే జనరేటర్ లో పొగలు రావడంతో కరెంట్​ సరఫరా నిలిచిపోయింది. ఏర్పాట్లు సరిగా చేయకపోవడంతో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన ఆకుల కృష్ణారావు జేబులో నుంచి రూ.5 వేలను దొంగిలించారు. 

నేలకొండపల్లి ఘటనపై విచారణకు ఆదేశం

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: గణేశ్​​నిమజ్జనం సందర్భంగా నేలకొండపల్లిలో జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించినట్లు సీపీ​విష్ణు ఎస్​ వారియర్​ తెలిపారు. నేలకొండపల్లి ఎస్సై స్రవంతిరెడ్డి దళితులను అవమానపరిచేలా దూషించారని ఆరోపిస్తూ ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నాయకులు గురువారం సీపీకి ఫిర్యాదు చేశారు. విచారణాధికారిగా అడిషనల్​ డీసీపీ(అడ్మిన్)​ డాక్టర్​ శబరీష్ ను నియమించారు. విచారణ నివేదిక ఆధారంగా ఎస్సైపై చర్యలు తీసుకుంటామని సీపీ​తెలిపారు.

సంబురంగా సమైక్యతా ర్యాలీలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలలో శుక్రవారం తెలంగాణ జాతీయ సమైక్యతా ర్యాలీలను నిర్వహించారు. ఖమ్మంలో చేపట్టిన ర్యాలీని మంత్రి పువ్వాడ అజయ్, కలెక్టర్​ వీపీ గౌతమ్, సీపీ​విష్ణు ఎస్​ వారియర్ ​జెండా ఊపి ప్రారంభించారు. వైరాలో ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్,సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కూసుమంచిలో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి, మధిరలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు,  రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, సీఎల్పీ నేత మల్లు  భట్టి విక్రమార్క, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు సమైక్యతా ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భద్రాచలంలో జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు పాల్గొన్నారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లందులో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, మణుగూరులో పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ర్యాలీని ప్రారంభించారు.  

- వెలుగు, నెట్​వర్క్​