అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా ఇవాళ శుక్రవారం (2025 నవంబర్ 21న) థియేటర్లో రిలీజైన మూవీ ‘12ఎ రైల్వే కాలనీ’. హార్రర్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కింది. ఇందులో పొలిమేర ఫేమ్' కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటించింది. నాని కాసరగడ్డ దర్శకత్వం వహించగా, పొలిమేర’, ‘పొలిమేర 2’ సినిమాలకి పనిచేసిన రైటర్ కం డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ కథను అందించారు. అంతేకాకుండా కథ, స్క్రీన్ ప్లే, మాటలు & షోరన్నర్గా అనిల్ వ్యవహరించారు.
హీరో నరేష్ నుంచి ఫస్ట్ టైం హారర్ థ్రిల్లర్ జోనర్లో సినిమా వస్తుండటంతో భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే రిలీజైన టీజర్, ట్రైలర్ విజువల్స్ సినిమాపై ఉత్కంఠ కలిగేలా చేశాయి. దాంతో అల్లరి నరేష్తో పొలిమేర డైరెక్టర్ ఓ సరికొత్త ప్రయత్నం చేస్తున్నాడంటూ ప్రశంసలు కూడా వచ్చాయి. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలాంటి ట్విస్టులతో వచ్చింది? అల్లరి నరేష్ కి సరైన కథ పడిందా? లేదా? అనేది ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే:
కార్తిక్ (నరేశ్) ఓ అనాథ. వరంగల్‌లోని రైల్వే కాలనీలో తన స్నేహితులతో (హర్ష, గెటప్ శ్రీను, సద్దాం) కలిసి ఉంటాడు. వీరందరూ లోకల్ పొలిటిషన్ వరంగల్ టిల్లు (జీవన్ కుమార్) దగ్గర పని చేస్తుంటారు. కార్తిక్ వరంగల్ టిల్లుకి నమ్మిన బంటు. వరంగల్ టిల్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ.. వరుసగా రెండుసార్లు పరాజయం పాలవుతాడు. ఇక మూడో సారి ఎలాగైనా గెలవాలని టిల్లు కంకణం కట్టుకుంటాడు. ఈ క్రమంలో తన ప్రచార బాధ్యతలను కార్తిక్‌కి అప్పగిస్తాడు. ఇందులో భాగంగా కార్తీక్ నిర్వహించిన ఓ పోటీలో ఆరాధనను (కామాక్షి భాస్కర్ల)ను చూసి ప్రేమలో పడతాడు. తన ప్రేమని ఎన్ని విధాలుగా వ్యక్తపరిచిన, ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఆరాధన.
ఈ క్రమంలోనే కార్తీక్కి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వరంగల్ టిల్లు ఓ కవర్ ఇస్తాడు. అది ఓపెన్ చేయొద్దని.. ఎవరికి తెలియకుండా దాచాలని చెబుతాడు. దాంతో కార్తీక్ ఆ కవర్‌ని పట్టుకుని వెళ్తుండగా.. పోలీసుల రైడ్ జరుగుతుంది. ఇక చేసేదేం లేక రెండు, మూడు రోజులుగా తాళం వేసి ఉన్న ఆరాధన ఇంట్లో అది దాచాలని డిసైడ్ అవుతాడు కార్తీక్. అలా ఎవ్వరు లేని ఇంట్లోకి వెళ్లిన కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయి కళ్లు తిరిగి కిందపడతాడు. కట్ చేస్తే ఆసుపత్రిలో ఉంటాడు. ఆరాధన మరియు ఆమె తల్లిని ఎవరో అతి క్రూరంగా హత్య చేస్తారు. అక్కడి కనిపించిన ప్రతి దృశ్యం వింతగా, అనుమానాస్పదంగా ఉంటుంది. ఈ కేసుని పోలీస్ ఆఫీసర్ రానా ప్రతాప్(సాయి కుమార్) ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. ప్రైమ్ సస్పెక్ట్ కింద కార్తిక్‌నే పట్టుకుంటారు. రానా ప్రతాప్ సాయంతో ఎలాగో అలాగా కార్తిక్ బయట పడుతాడు.
కానీ, అసలు ఆ హత్యలు చేసిందెవరు? ఆరాధన ఇంట్లో జరిగిన సంఘటనలు ఏమిటి? ఇంతకీ ఆరాధన ఎవరు? ముంబైలో ఉన్న డాక్టర్ షిండే(అనీష్ కురువిల్లా)కి ఆరాధనకు ఉన్న రిలేషన్ ఏంటి? చనిపోయిన ఆరాధన.. కేవలం కార్తిక్‌కి మాత్రమే ఎందుకు కనిపించింది? టిల్లు అన్న కార్తీక్కి ఇచ్చిన పార్సిల్లో ఏముంది? ఈ మర్డర్ మిస్టరీని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రానా ప్రతాప్ (సాయి కుమార్) ఎలా ఛేదించాడు? అనేది తెలియాలంటే 12A రైల్వే కాలనీ చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
హైదరాబాద్‌లో జరిగిన యదార్థ సంఘటన స్ఫూర్తితో, స్క్రీన్ ప్లే బేస్డ్‌గా అనిల్ విశ్వనాథ్ ఈ కథ రాశారు. విజయ్ సేతుపతి ‘మహారాజా’ తరహాలో మూడు నాలుగు కథలు సమాంతరంగా జరుగుతుంటాయి. చాలా మైండ్ గేమ్ ఉంటుంది. ఇలాంటి స్క్రీన్‌ప్లేతో తెలుగులో చాలా తక్కువ సినిమాలు వచ్చాయని చెప్పుకోవొచ్చు.
హైదరాబాద్‌లోని కుందన్‌బాగ్ ప్రాంతంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల్ని ఆధారం చేసుకుని సినిమా కథనం రాసుకున్నట్లు సినీ వర్గాల సమాచారం. అందుకు తగ్గట్టుగానే బ్లాక్ మ్యాజిక్, ఆత్మలు అనే కాన్సెప్ట్‌ను జోడించి హారర్ టచ్‌తో థ్రిల్ పంచే ప్రయత్నం చేశారు కథ రచయిత పొలిమేర ఫేమ్' అనిల్ విశ్వనాథ్. 'మా ఊరి పొలిమేర', 'పొలిమేర 2' లాంటి సినిమాలు విజయం సాధించడంలో స్క్రీన్‌ప్లే కీలక పాత్ర పోషించింది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. ఈ క్రమంలోనే 12 A రైల్వే కాలనీపై వీపరీతమైన అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే 12 A రైల్వే కాలనీ ఇంట్రెస్టింగ్ కథ, కథనాలతో సాగింది.
ఫస్ట్ హాఫ్ మొత్తం కార్తీక్ ఫ్రెండ్స్ సీన్స్, పొలిటికల్ సీన్స్, హీరోయిన్ వెంట పడటం సీన్స్తో సాగుతుంది. ఇంటర్వెల్తో ఆడియన్స్కి పెద్ద ట్విస్టే ఇచ్చాడు డైరెక్టర్ నాని. ప్రేమ కథగా మొదలైన మూవీ.. అనుకోకుండా మర్డర్ మిస్టరీ చుట్టూ కథనంపై సెకండాఫ్లో సాగేలా రూపొందించారు. మధ్యలో హారర్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అల్లరి నరేష్ రెండు డిఫరెంట్ షేడ్స్లో కనిపించడం ఆసక్తి కలిగిస్తుంది. ఆ హత్యలను ఎవరు చేశారనే పాయింట్ చుట్టూ కథను మలుపు తిప్పడం, అందులో భాగంగా హత్యల విచారణలో వచ్చే కొన్ని ఇన్వెస్టిగేటివ్ సీన్స్ మెప్పిస్తాయి. క్లైమాక్స్ ట్విస్టు అదిరిపోతుంది. ఓవరాల్గా నరేష్ చేసిన కొత్త ప్రయత్నం ఆయన అభిమానులకి ఫుల్ మీల్స్ అని చెప్పాలి.
