
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలే జీల్లో టీచింగ్ ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ జరగకుండా ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అడ్డుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధి కార పార్టీలో ఉన్న బడా నేతల ఒత్తిడితో సర్కారు కాలేజీల్లో రిక్రూట్‌మెంట్‌ను ఆలస్యం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో చేరిన మెరిట్ స్టూడెంట్స్ నష్టపోతున్నారని కాలేజీల ప్రిన్సిపాల్స్ చెబుతున్నారు.
రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 8 మెడికల్ కాలేజీల ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కాలేజీల్లో కాంట్రాక్ట్ బేసిస్‌లో పనిచేసేందుకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు కావాలంటూ ఈనెల ఒకటో తేదీన నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం 184 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే.. వంద మం ది కూడా అప్లై చేయలేదు. 81 ప్రొఫెసర్ పోస్టుల కు 12 పోస్టులు, 103 అసోసియేట్ ప్రొఫసర్ పోస్టులకు 25 మాత్రమే భర్తీ అయ్యాయి. మొ త్తం 37 మందికి 14న నియామక పత్రాలంద జేశారు. 20వ తేదీలోపు రిపోర్ట్ చేయాలని సూచించగా, కొంత మంది చేయకపోవడం గమనార్హం.
నిర్లక్ష్యమా.. కుట్రపూరితమా?
మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేయాలంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేసిన అనుభవం ఉండడంతోపాటు, నేషనల్ మెడికల్ కమిషన్ పేర్కొన్న అన్ని అర్హతలు ఉండాలి. అకడమిక్ ఇయర్ ప్రారంభం కావడానికి ముందే.. ఆ అకడమిక్ ఇయర్‌లో ఏ కాలేజీలో పనిచేస్తామో ఎన్‌ఎంసీకి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాలేజీ కూడా ఫలానా వ్యక్తి తమ కాలేజీలో పనిచేస్తున్నారని ఎన్‌ఎంసీకి చూపించుకుంటుంది. ఈ కండిషన్ల వల్ల అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, ఇతర టీచింగ్ ఫ్యాకల్టీ.. అకడమిక్ ఇయర్ మధ్యలో ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి మారడానికి అవకాశం ఉండదు.
ఒకవేళ మారినా అది నిబంధనలకు విరుద్ధం అవుతుంది. ఈ నెల ఒకటో తేదీన మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన నోటిఫికేషన్‌లోనూ ఈ క్లాజ్‌ను పొందుపరిచారు. 2022–23 అకడమిక్ ఇయర్ కోసం ఎన్‌ఎంసీ అసెస్‌మెంట్‌కు హాజరైన వాళ్లు ఎలిజిబుల్ కాదని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిబంధనలన్నీ తెలిసి కూడా నోటిఫికేషన్ ఆలస్యంగా ఇవ్వడంపై డాక్టర్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు లబ్ధి చేకూర్చేందుకేనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
చక్రం తిప్పిన బడా నేతలు!
రాష్ట్రంలో ఈ ఒక్క అకడమిక్ ఇయర్‌లోనే పదికి పైగా కొత్త మెడికల్ కాలేజీలకు ఎన్‌ఎంసీ నుంచి పర్మిషన్ వచ్చింది. ఈ నేపథ్యంలో అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల కొరత ఏర్పడుతుందని ముందే నుంచి అందరూ అంచనా వేస్తూ వచ్చారు. ఈ విషయంలో మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు కూడా స్పష్టమైన అవగాహన ఉంది. ఖాళీల భర్తీకి పర్మిషన్ ఇవ్వాలని ముందు నుంచే ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. కానీ సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఒకవేళ సర్కార్ ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే.. ప్రైవేటు కాలేజీల్లో పనిచేస్తున్న చాలా మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు వచ్చి ప్రభుత్వ కాలేజీల్లో చేరేందుకు ఆస్కారం ఉండేది.
రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు స్టాఫ్‌కు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదు. దీంతో ప్రభుత్వ సర్వీస్‌లోకి వచ్చేందుకు ప్రైవేటు ఫ్యాకల్టీ ఇంట్రస్ట్ చూపించారు. ఈ విషయం ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలకు కూడా తెలుసు. దీంతో సర్కార్ కాలేజీల్లో రిక్రూట్‌మెంట్‌ను వాయిదా వేసేలా ప్రైవేటు మేనేజ్‌మెంట్లు చక్రం తిప్పాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులు, బీఆర్‌ఎస్ నేతలు, వారి కుటుంబ సభ్యుల యాజమాన్యంలోనే చాలా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దీంతో డాక్టర్ల ఆరోపణలకు మరింత బలం చేకూరుతున్నది.
కీలక సబ్జెక్టులే ఖాళీ!
ఈ నెల ఒకటో తేదీన ఇచ్చిన నోటిఫికేషన్‌లో జనరల్ మెడిసిన్, ఈఎన్‌టీ, ఆప్త ల్మాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్, డెర్మటాలజీ, రేడియో డయాగ్నస్టిక్స్, ఎమర్జెన్సీ మెడిసిన్ వంటి విభాగాల్లో 54 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు చూపించారు. వీటికి ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. సైకియాట్రీ విభాగంలో 5 పోస్టులు ఖాళీగా ఉంటే.. ఒక్కరే దరఖాస్తు చేశారు. దీంతో భావి డాక్టర్లకు ఈ కీలకమైన సబ్జెక్టులను ఎవరు నేర్పిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అకడమిక్ ఇయర్ మధ్యలో కూడా కాలేజీల్లో ఫ్యాకల్టీ, ఇతర సౌలతులపై ఎన్‌ఎంసీ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేస్తాయి. అలా చేసినప్పుడు ఫ్యాకల్టీ లేరని తెలిస్తే సీట్ల కోత విధిస్తాయి. కొన్నిసార్లు కాలేజీల పర్మిషన్లు కూడా రద్దు చేస్తాయి. గతేడాది ఇలాగే ఆకస్మిక తనిఖీలు చేసి మహావీర్, టీఆర్‌ఆర్, ఎంఎన్‌ఆర్ కాలేజీల పర్మిషన్లను రద్దు చేశాయి.