చేపపిల్లల సప్లై కాంట్రాక్ట్‌‌‌‌ మళ్లీ వారికేనా?.. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన వారికే మళ్లీ అవకాశం

చేపపిల్లల సప్లై కాంట్రాక్ట్‌‌‌‌ మళ్లీ వారికేనా?.. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన వారికే  మళ్లీ అవకాశం
  • బినామీల పేరుతో అర్హతలు లేకున్నా టెండర్లలో కాంట్రాక్ట్ దక్కించుకున్న వైనం
  • మత్స్యశాఖ అధికారులు ముడుపులు తీసుకొని కాంట్రాక్ట్ అప్పగించారన్న ఆరోపణలు   
  • కలెక్టర్ వద్దకు చేరిన చేపపిల్లల పంపిణీ పంచాయితీ

సూర్యాపేట, వెలుగు:  మత్స్యకారులకు ప్రభుత్వం ఫ్రీగా పంపిణీ చేసే చేపపిల్లల సప్లై కాంట్రాక్ట్‌‌‌‌ సూర్యాపేట జిల్లాలో ప్రతి సంవత్సరం కొందరి చేతుల్లోకే వెళ్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బినామీ పేర్లతో టెండర్లు వేస్తూ, ఆఫీసర్లను మేనేజ్‌‌‌‌చేస్తూ కాంట్రాక్ట్‌‌‌‌ దక్కించుకుంటున్నారని తెలుస్తోంది. 

చేప పిల్లలను పెంచే ఫామ్‌‌‌‌లు లేకున్నా ఉన్నట్లు చూపుతూ, పిల్లల పంపిణీలో అక్రమాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ సారి కూడా ఎలాంటి అర్హత లేని వారికి కాంట్రాక్టు అప్పజెప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని కొంతమంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడంతో చర్చనీయాంశంగా మారింది. 

ఈ సారి 3.50 కోట్ల టార్గెట్ 

రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా 2025 –- 26 సంవత్సరానికి సూర్యాపేట జిల్లాలో 3.50 కోట్ల పిల్లలు పంపిణీ చేయాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకున్నారు. జిల్లాలో మొత్తం 850 చెరువులతో పాటు మూసీ, పులిచింతల రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిపై 139 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, 3 మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాల్లో 15,736 మంది మత్స్యకారులు ఉన్నారు.

ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో పోసేందుకు 80 మిల్లీమీటర్ల నుంచి 100, చెరువులు, కుంటల్లో పోసేందుకు 35 నుంచి 40 మిల్లీమీటర్ల సైజ్‌‌‌‌గల చేప పిల్లలను సరఫరా చేయాల్సి ఉంటుంది. చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను పోయాల్సి ఉండడంతో ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది.

అక్రమార్కులకు టెండర్లు  

గత ప్రభుత్వ హయాంలో చేపపిల్లల పంపిణీలో అక్రమాలకు పాల్పడిన వారికే బినామీల పేర్లతో చేప పిల్లల సరఫరా కోసం టెండర్లు కట్టబెట్టారు. వీరికి సొంతంగా ఫామ్‌‌‌‌హౌజ్ లేకున్నా మత్స్యశాఖ ఆఫీసర్లతో చేతులు కలిపి ఈ సారి కూడా టెండర్లు వేసినట్లు సమాచారం. ఈ సంవత్సరం చేప పిల్లల సరఫరాకు మొత్తం 6  టెండర్లు వచ్చాయని ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే ఈ సారి కూడా వారికే కాంట్రాక్ట్‌‌‌‌క ట్టబెట్టేలా ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్ 1 బిడ్డర్ కు చేప పిల్లల పంపిణీ కోసం రిలీజ్‌‌‌‌ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఉండగా ఇక్కడ కేవలం లీజ్ డీడీ మాత్రమే ఉండి కాంట్రాక్టర్ తండ్రి పేరిట లీజ్ అగ్రిమెంట్ ఉన్నది.  దీంతో ఎల్ 1కు చేప పిల్లల పంపిణీకి క్వాలిఫై చేయకూడదు. అదే విధంగా చేపపిల్లల పంపిణీదారుడు బొచ్చ, రవ్వ, మూరుసు, బంగారు తీగ చేప పిల్లలను సప్లయ్ చేయాల్సి ఉంది. కానీ జిల్లాలో ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌కు కేవలం రొయ్యల చెరువును మాత్రమే చూపించి సప్లయ్ చేయడానికి అర్హత పొందాడు.  ఒక ట్యాంక్ తోనే మూడు రకాల చేప పిల్లలను ఎలా సప్లయ్ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా  మారింది. 

మరోవైపు టెండర్ దక్కించుకున్న మరో కాంట్రాక్టర్ కు లీజ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లలో ఒక సర్వే నెంబర్ ఉండగా ఫిషరీస్ డిపార్ట్ మెంట్ నుంచి ఇచ్చిన డీఎల్సి సర్టిఫికెట్ లో మాత్రం మరో సర్వే నెంబర్ ఉండడం గమనార్హం. దీంతో పాటు సదరు కాంట్రాక్టర్ కు చెరువులు లేకున్నా మత్స్యశాఖ అధికారులు క్వాలిఫై చేశారు. పాల్గొన్న ఆరుగురు కాంట్రాక్టర్లలో ఒక కాంట్రాక్టర్ ఖమ్మం జిల్లాలో డిస్ క్వాలిఫై అయిన కూడా సూర్యాపేట జిల్లాలో అధికారులు మాత్రం చేప పిల్లలను పంపిణీ కోసం ఒకే చెప్పేశారు. 

అధికారుల వద్దకు చేరిన చేప పంచాయితీ 

మత్స్యశాఖ అధికారులు అక్రమంగా చేప పిల్లల సప్లయ్ కావాలనే కొందరికి కట్టబెట్టడంతో కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నతాధికారులకు జిల్లా మత్స్యశాఖ అధికారులపై ఫిర్యాదు చేశారు. అన్నీ సక్రమంగా ఉన్నా  కూడా అధికారులు కావాలనే రిజెక్ట్ చేశారని ఎలాంటి అర్హత, ట్యాంకులు లేని వారికి చేప పిల్లల సప్లయ్ కాంట్రాక్ట్ అప్పగించారని ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ దృష్టికి తీసుకురావడంతో ఎంక్వైరీ చేపట్టినట్లు సమాచారం.