- సీఎం, మంత్రుల ఖాతాల్లోకి అవినీతి సొమ్ము
- నల్గొండ రైతు నిరాహార దీక్షలో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల ఖాతాల్లో డబ్బులు చేరాయని నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై సిట్, సీబీఐకి విచారణ అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. నల్గొండ కలెక్టరేట్ ఎదుట మంగళవారం రైతు నిరాహార దీక్ష ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు.
సీఎం ధైర్యం ఉంటే పార్టీ చిహ్నాలతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సవాలు విసిరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో సీఎం రాజీనామాలు చేయించి మళ్లీ గెలవాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమై రైతులు, విద్యార్థులు, వృద్ధులను మోసం చేసిందని ఆరోపించారు. రుణమాఫీ, పంట బోనస్, రైతు భరోసా, ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీజేపీ నల్గొండ, సూర్యాపేట జిల్లాల అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, చల్లా శ్రీలత రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, నాయకులు ఓరుగంటి వంశీ, చంద్రశేఖర్, భవనం ప్రభాకర్ రెడ్డి, రామరాజు యాదవ్, శ్రీదేవి రెడ్డి, వెంకటరెడ్డి, రాజేందర్ రెడ్డి, ఫకీర్ మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
