ప్రాజెక్టుల అప్పులకే 15 వేల కోట్లు

ప్రాజెక్టుల అప్పులకే 15 వేల కోట్లు

ఇరిగేషన్ కు రూ.26 వేల కోట్లకు పైగా భారీ పద్దు  

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్ర బడ్జెట్ లో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ కు కేటాయింపులు భారీగానే కన్పిస్తున్నా.. ఈ నిధులతో అసలు ప్రాజెక్టులు పూర్తవుతాయా? అనే అనుమానం వస్తోంది. సాగునీటి పారుదల శాఖకు బడ్జెట్ లో రూ. 26 వేల కోట్లు కేటాయించారు. కానీ ఇందులో రెండు వంతుల నిధులు అప్పులు తిరిగి చెల్లించేందుకు, మెయింటెనెన్స్​కే పోతాయి. మిగిలిన ఒక్క వంతు నిధులతో అసలు ప్రాజెక్టుల పనులు ముంగటపడతాయా.. కాలువల్లో నీళ్లు పారుతాయా అనే సందేహం ఉన్నతాధికారులను తొలిచేస్తోంది. ప్రాజెక్టుల పనులకు కేటాయించిన పద్దుకు దాదాపు సమానంగా పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ప్రాజెక్టుల పనులు, పంట కాల్వలు ముంగట పడటం కష్టమే. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బడ్జెట్​ కేటాయింపులతో పాటు లోన్​లు తెచ్చి ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. ఇందులో మేజర్ ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇవ్వడంతో భారీగా నిధులు కుమ్మరించినా పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల కింద తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త ఆయకట్టు తెచ్చారే తప్ప సీఎం కేసీఆర్ మొదలు పెట్టిన ప్రాజెక్టుల కింద అదనంగా ఒక్క ఎకరానికీ నీళ్లు ఇవ్వలేదు. ఈ బడ్జెట్​లో ఇచ్చిన నిధులతోనూ కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. 

అప్పులు కట్టేందుకే రూ. 15,700 కోట్లు  

బడ్జెట్ లో ఇరిగేషన్ శాఖ నిర్వహణకు రూ.17,504 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.15,700 కోట్లు లోన్ ఇన్​స్టాల్​మెంట్ల చెల్లింపులకే పోనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన అప్పులకు రూ.12,500  కోట్లు, ఇతర ప్రాజెక్టుల అప్పుల రీపేమెంట్లకు రూ.3,200 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.9 వేల కోట్ల లోపే ఇచ్చారు. ప్రాజెక్టు పనులకు నిరుటి కన్నా తక్కువ నిధులే ఇచ్చారు. బడ్జెట్ పద్దు భారీగా ఉన్న ప్రాజెక్టులకు అరకొర కేటాయింపులే చేయడంతో సర్కారు పెట్టుకున్న ఆయకట్టు లక్ష్యం చేరడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మైనర్ ఇరిగేషన్​కు రూ.851.40 కోట్లు కేటాయించారు. 

నిరుడు బడ్జెట్​లో ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు విడుదల చేయకపోవడంతో రివైజ్డ్ ఎస్టిమేట్స్​లో కోతలు పెట్టారు. సుమారు వెయ్యి కోట్లకు పైగా నిధులకు కోత పడింది. ఇప్పటి వరకు చేపట్టిన పనులకు రూ.7 వేల కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇందులో కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల బిల్లులే రెండు వంతులు ఉన్నాయి. మిగతా ప్రాజెక్టుల బిల్లులూ చాలాకాలంగా పెండింగ్​లో ఉన్నాయి. అవి ఇస్తే తప్ప పనులు చేయబోమని కొందరు కాంట్రాక్టర్లు తేల్చిచెప్పారు. దీంతో ఆయా ప్రాజెక్టులు పట్టాలెక్కడంపై సందేహాలు నెలకొన్నాయి.