బీఆర్ఎస్ మేనిఫెస్టోతో బీజేపీ, కాంగ్రెస్​కు వణుకు : అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

బీఆర్ఎస్ మేనిఫెస్టోతో బీజేపీ, కాంగ్రెస్​కు వణుకు : అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
  • స్వగ్రామం ఎల్లపల్లిలో ప్రచారం ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

 నిర్మల్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వణుకు పుడుతోందని, ఆ పార్టీలు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే ధైర్యం చేయలేకపోతున్నాయని మంత్రి, నిర్మల్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తన సొంత గ్రామమైన ఎల్లపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఇక్కడి ఆంజనేయ మందిరంలో పూజలు చేసి అనంతరం ర్యాలీ చేపట్టి సమావేశంలో మాట్లాడారు.

గతంలో బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని పథకాలను అమలు చేసిందని, వాటికి తోడుగా మరిన్ని పథకాలను కూడా అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ప్రస్తుతం మేనిఫెస్టోలోని అన్ని పథకాలను అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీలను ఆ పార్టీలను ప్రజలు నమ్మడం లేదని, ఆ పార్టీల నేతలకు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న బీఆర్ఎస్​ను ఆశీర్వదించాలని కోరారు. తన సొంత గ్రామ ప్రజలంతా తనకే అండగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, అల్లోళ్ల మురళీధర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి, కుమారుడు గౌతమ్, కోడలు దివ్యారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.