సిట్టింగ్ వర్సెస్ క్యాండిడేట్.. 10 నియోజకవర్గాల్లో కన్ఫ్యూజన్

సిట్టింగ్ వర్సెస్  క్యాండిడేట్..  10 నియోజకవర్గాల్లో కన్ఫ్యూజన్
  • పథకాలకు ఎవరికి వాళ్లు లిస్టు పంపుతున్న ఎమ్మెల్యేలు, అభ్యర్థులు
  • తాము పంపిన జాబితానే ఆమోదించాలంటూ ఆదేశాలు
  • మధ్యలో నలిగిపోతున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: అధికార పార్టీలో టికెట్ల కేటాయింపు నియోజకవర్గాల్లో కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. అసలే మళ్లీ చాన్స్ ఇవ్వలేదనే అసంతృప్తిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు.. ఆ స్థానంలో అభ్యర్థులుగా ఎంపికైన వాళ్ల నుంచి ఫిట్టింగ్ మొదలైంది. దీంతో రాష్ట్రంలోని 10 నియోజకవర్గాల్లో సిట్టింగ్ వర్సెస్ క్యాండిడేట్ లొల్లి ముదురుతున్నది. ఈ వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఎమ్మెల్యేలకు అప్పగించింది.

 నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా తన మనుషులు, పార్టీకి పనిచేసేటోళ్ల పేర్లను ఎమ్మెల్యేలు లబ్ధిదారుల జాబితాలో పెడుతూ వస్తున్నారు.ఇటీవల బీఆర్ఎస్ పార్టీ 115 మందితో అసెంబ్లీ క్యాండిడేట్ల జాబితాను ప్రకటించింది. అం దులో సిట్టింగ్ సీటు రానిచోట్ల పథకాలకు లబ్ధిదారుల ఎంపిక విషయంలో పెద్ద గొడవే జరుగుతోంది. ఈ విషయం సీఎం, మంత్రుల దృష్టికి కూడా వెళ్లినట్లు తెలిసింది.

ముందస్తు ప్రకటనతో నియోజకవర్గాల్లో ఎఫెక్ట్

స్టేషన్​ఘన్ పూర్, ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్, వేములవాడ, వైరా, ఉప్పల్ ఈ ఏడు స్థానాలకు సిట్టింగ్​లను కాదని అధికార పార్టీ వేరే క్యాండిడే ట్లను అనౌన్స్​ చేసింది. ఇక్కడ నువ్వా నేనా అన్నట్లుగా సిట్టింగ్‌‌ ఎమ్మెల్యేలకు, అభ్యర్థికి మధ్య వార్ జరుగుతోంది. కోరుట్ల సీటు మార్చినప్పటికీ.. అక్కడ సిట్టింగ్ తనయుడికే ఇవ్వడంతో సమస్య రాలేదు. ఇక జనగామ, నర్సాపూర్ టికెట్లు ఎవరికనేది ప్రకటించలేదు. దీంతో ఇక్కడ టికెట్ ఆశిస్తున్న వాళ్ల నుంచి సిట్టింగ్‌‌లకు స్కీముల లబ్ధిదారుల లిస్ట్​లో పేర్ల లొల్లి నడుస్తోంది. జనగామలో పథకాల సంగతి తాను చూసుకుంటానని ఎమ్మెల్సీ పల్లా బీఆర్ఎస్ క్యాడర్​కు చెబుతున్నట్లు తెలిసింది. 

ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కాదని ఇప్పటికే వివిధ స్కీముల కోసం కొందరి పేర్లను కూడా రాసుకున్నారు. నర్సాపూర్​లోనూ ఇంకా ఎవరు పోటీ చేస్తారనేది స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే ఈ స్థానంలో సిట్టింగ్ కాకుండా స్టేట్ ఉమెన్ కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆమె కూడా నర్సాపుర్ నియోజకవర్గం పార్టీ లీడర్లు, క్యాడర్​ను తనవైపునకు తిప్పుకునేందుకు స్కీములను ఎరగా వాడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలోనే ప్రభుత్వం వరుస పెట్టి పథకాలను కుమ్మరిస్తోంది. ఇందులో బీసీలకు, మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయం, దళితబంధు, గృహలక్ష్మీ వంటివి ఉన్నాయి. ఇతర ప్రభుత్వ పథకాలకు రిఫరెన్స్​లు ఇచ్చే పని కూడా క్యాండిడేట్లు మొదలుపెట్టారు.

అధికారులకు తలనొప్పి

అధికార పార్టీ టికెట్ అనౌన్స్ చేసినోళ్లు సిట్టింగ్​ల నుంచి క్యాడర్​ను కాపాడుకునేందుకు పథకాల్లో లబ్ధిదారులుగా చేస్తామని పేర్లు రాసుకుంటున్నారు. ఆ లిస్ట్​ను కలెక్టర్లకు, ఇన్‌‌చార్జ్‌‌ మంత్రులకూ పంపిస్తున్నారు. దీనిపై సిట్టింగ్‌‌ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తవుతున్నది. తాము ఇప్పటికే పేర్లు పంపించామని.. ఇప్పుడు కొత్తగా వేరే లిస్ట్​ రావడం ఏంటని అధికారులపై ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే లిస్టు ఫైనల్ చేయాలా? లేక అనౌన్స్ చేసిన క్యాండిడేట్ పంపిన పేర్లను తీసుకోవాలా? అనేది తెలియక కలెక్టర్లు, అధికారులు ఆగమాగం అవుతున్నారు.

కింది స్థాయిలో పోలీస్ స్టేషన్, మండల ఆఫీసుల్లోనూ క్యాండిడేట్లు ఆర్డర్స్ వేస్తున్నట్లు సమాచారం. దీంతో ఎవరి మాట వినకుంటే ఏమవుతుందోననే భయం అధికారులను వెంటాడుతున్నది. ఒకరి తర్వాత ఒకరు తమదే ఫైనల్ చేయాలని ఆల్టిమేటం ఇస్తున్నట్లు తెలిసింది. ఇన్‌‌చార్జ్‌‌ మంత్రి దగ్గరకూ రెండు లిస్ట్​లు వెళ్తుండటంతో.. సిట్టింగ్​లను కాదనలేక.. క్యాండిడేట్లకు సపోర్ట్ చేయలేక తలలు పట్టుకుంటున్నారు. ఈ గందరగోళం వచ్చే ఎన్నికలపై పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.