
- ప్రజా పాలనకు ప్రత్యేక సాఫ్ట్వేర్.. దరఖాస్తులోని వివరాల ఎంట్రీ
- కంప్యూటరైజ్ తర్వాత ఫోన్‌కు ఐడీ నంబర్ మెసేజ్
- గ్రామం యూనిట్‌గా గ్యారంటీల సమగ్ర సమాచారం
- ఆధార్‌తో డూప్లికేషన్‌కు చెక్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘‘అభయ హస్తం గ్యారంటీల’’ ప్రజా పాలన దరఖాస్తుల సమాచారాన్ని బిగ్ డేటాబేస్ కింద డిజిటలైజ్ చేసేందుకు కసరత్తు మొదలైంది. ఈ నెల 6వ తేదీ వరకు అప్లికేషన్లు తీసుకుని ఆ తరువాత వాటన్నింటిని కంప్యూటరైజ్ చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం రెడీ చేయిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా వచ్చిన దరఖాస్తులు, అందులో అర్హుల వివరాలతో పాటు ప్రతి కుటుంబానికి చెందిన సమగ్ర సమాచారం ఉండనుంది. గ్రామం యూనిట్‌గా ఒక్క క్లిక్‌తో రాష్ట్రంలో ఏ గ్రామంలో ఏ గ్యారంటీకి ఎంతమంది అప్లై చేసుకున్నారు? వారి అర్హత ఏమిటి? ఎంతమందికి లబ్ధి చేకురుతుంది? అనే వివరాలు తెలుసుకునేలా సాఫ్ట్ వేర్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఒక యూనిక్ ఐడీ నంబర్ ఇవ్వడంతో పాటు అప్లికేషన్ వారీగా మరో సబ్ నంబర్‌ను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఫలితంగా వచ్చిన దరఖాస్తుల విషయంలో ఒక స్పష్టత రావడంతో పాటు నిజమైన అర్హులకు గ్యారంటీలు అందించేందుకు గ్రామాల్లోనే లిస్ట్ డిస్ప్లే చేయడం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేయాలని రాష్ట్ర సర్కార్ ప్లాన్ చేసింది.
అప్లికేషన్‌తో అన్ని వివరాల సేకరణ
ప్రజా పాలనలో భాగంగా తీసుకునే దరఖాస్తులో ప్రభుత్వం అనేక వివరాలను సేకరిస్తోంది. ఇందులో మొదటి పేజీలో ఇంటి యాజమాని పేరు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరులు పేరుతో సామాజిక వర్గం, ఆధార్ నంబర్, రేషన్ కార్డు నంబర్, మొబైల్ నంబర్, చేస్తున్న వృత్తి వివరాలు తీసుకుంటున్నారు. దీంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు అందులో దరఖాస్తుదారునితో సంబంధం, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్లు సేకరిస్తున్నారు. ఇంటి నంబర్, వీధి, గ్రామం, మున్సిపాలిటీ, వార్డు నంబర్, మండలం, జిల్లా వివరాలు కూడా స్పష్టంగా తీసుకుంటున్నారు. ఈ వివరాలన్నింటికి ప్రభుత్వం తీసుకువస్తున్న సాఫ్ట్‌వేర్‌లో ఎంట్రీ చేయనున్నారు. ప్రతిదీ కూడా డూప్లికేషన్ లేకుండా ఒకసారి ఎంట్రీ చేసిన ఆధార్ మళ్లీ ఎంట్రీ కాకుండా చూడనున్నారు. ఇలా ఒక కుటుంబం నుంచి ఏయే గ్యారంటీకి అప్లై చేసుకున్నారో ఈజీగా తెలిసిపోనుంది. ఇందుకోసం దరఖాస్తుల్లో పెట్టుకున్న ఫోన్ నంబర్‌కు అప్లికేషన్ ఐడీ పేరుతో ఒక నంబర్‌ను మెసేజ్ పంపేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ మెసేజ్ కుదరకపోయినా ఆధార్ నంబర్‌తో వివరాలు వెతికేలా సాఫ్ట్‌వేర్‌ను రెడీ చేస్తున్నారు. అన్ని అప్లికేషన్లు తీసుకుని కుటుంబాల వారీగా ఎవరికి దేనికి అర్హత ఉన్నదో లేదోననేది సర్కార్ ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా ఫైనల్ చేస్తారు.
ఎస్కేస్కు.. ప్రజా పాలనకు తేడా ఇదే
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్)ను చేపట్టింది. ఆ టైంలో హైదరాబాద్, పట్టణాల్లో పనిచేస్తున్న వారంతా తమ సొంత గ్రామాలకు వెళ్లి వివరాలు ఇచ్చారు. అయితే ఎస్కేఎస్కు ప్రజా పాలనకు దగ్గరి పోలికలు ఉన్నప్పటికీ సమాచార సేకరణలో చాలా తేడాలున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఎస్కేఎస్లో భాగంగా అధికారులే ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కుటుంబాలు, ఇండ్లకు సంబంధించిన పూర్తిస్థాయి డేటా అప్పటి ప్రభుత్వం తీసుకున్నది. అయితే దాంట్లోని వివరాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారి కూడా బయటపెట్టలేదు. ఆ వివరాల ఆధారంగానే మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడల్లా మెజార్టీ ఓటర్లు ఎవరైతే ఉంటారో వారికి తాయిలాలు ప్రకటించేవాళ్లని ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న ప్రజా పాలన దరఖాస్తుల విషయానికొస్తే గ్యారంటీలకు అర్హత ఉన్నోళ్లు అప్లై చేసుకోవాలని తెలిపారు. దీంతో రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు సంబంధించి కాకుండా కేవలం ఎవరికైతే ప్రభుత్వ పథకాలు, సాయం అవసరం ఉందో వారి వివరాలే అందనున్నాయి. పైగా ఈ సమాచారం అంతా డిజిటైలైజ్ చేసి పబ్లిక్ డొమైన్‌లోనే పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.