కర్నాటకలో నిరుద్యోగులకు భృతి

కర్నాటకలో నిరుద్యోగులకు భృతి
  •      డిగ్రీ చేసినోళ్లకు నెలకు 3 వేలు, డిప్లమా చేసినోళ్లకు రూ.1,500
  •     ‘యువ నిధి’ని ప్రారంభించిన సీఎం సిద్ధరామయ్య 

శివమొగ్గ: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 5 గ్యారంటీల్లో భాగమైన ‘యువ నిధి’ స్కీమ్​ను కర్నాటక ప్రభుత్వం ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద డిగ్రీ, డిప్లమా చేసిన నిరుద్యోగులకు స్టైపండ్ ఇవ్వనుంది. డిగ్రీ చేసినోళ్లకు నెలకు రూ.3 వేలు, డిప్లమా చేసినోళ్లకు రూ.1,500 ఇస్తుంది. ఈ స్కీమ్​ను శుక్రవారం శివమొగ్గలో సీఎం సిద్ధరామయ్య ప్రారంభించారు. అర్హులైన ఆరుగురు నిరుద్యోగులకు స్టైఫండ్ చెక్కులను అందజేశారు. 

ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్లు కేటాయించింది. ఇది వచ్చే ఏడాది రూ.1,200 కోట్లకు పెరుగుతుందని.. 2026 నుంచి ఏటా రూ.1,500 కోట్లు కేటాయించాల్సి ఉంటుందని సర్కార్ అంచనా వేసింది. కాగా, 2022–23 అకడమిక్ ఇయర్​లో పాస్ అయి, జాబ్ దొరకనోళ్లు ఈ పథకానికి అర్హులు. వీళ్లకు రెండేండ్ల పాటు స్టైఫండ్ ఇస్తారు. ఈ పీరియడ్ లో జాబ్ వస్తే స్టైఫండ్ ఆపేస్తారు. 

పైచదువులు చదువుకుంటున్నోళ్లు పథకానికి అర్హులు కాదు. కాగా, ఎన్నికల్లో చెప్పిన మేరకు 5 గ్యారంటీలను ప్రారంభించామని సీఎం సిద్ధరామయ్య అన్నారు. తాము ఇప్పటికే ప్రారంభించిన శక్తి, అన్న భాగ్య, గృహలక్ష్మి, గృహజ్యోతి గ్యారంటీల కింద 1.5 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని వెల్లడించారు. ఒక్కో కుటుంబానికి నెలకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు లబ్ధి చేకూరుతోందని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు.