భారత్ అభివృద్ధే నా జీవిత లక్ష్యం.. దేశం కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటా: ప్రధాని మోడీ

భారత్ అభివృద్ధే నా జీవిత లక్ష్యం.. దేశం కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటా: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: 2047 నాటికి వికసిత్ భారత్ సాధించి తీరుతామని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్ భారత్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, అంతరిక్షంలో అడుగుపెట్టడం, ఒలింపిక్స్ నిర్వహణ ఇలాంటివన్నీ సాధ్యమేనని పేర్కొన్నారు. ఒక లక్ష్యం కోసం పని చేస్తున్నప్పుడు ఎప్పటికీ అలసిపోనని చెప్పారు. భారత్ అభివృద్ధే నా జీవిత ఆశయం.. సంకల్పం ఉంటే దేనినైనా సాధించవచ్చని పేర్కొన్నారు. దేశం కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటానని.. దేశమే తనకు మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

తాను ఇప్పటికీ విద్యార్థినేనని.. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటానని అన్నారు. ప్రజాజీవితంలో ప్రధాని మోడీ 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం (అక్టోబర్ 7) న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వికసిత్ భారత్ సంకల్ప్ సభ - సేవా జ్యోతి యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. 

ప్రజా ఆశీర్వాద బలం నన్ను ఇంతకాలం నడిపించిందన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినప్పుడు ఇంత దూరం వస్తానని ఆలోచించలే.. 25 ఏళ్లుగా నిరంతర ప్రజా సేవ అందిస్తానని నాడు ఊహించలేదని చెప్పారు. ప్రజా జీవితంలో తన ప్రయాణం ఇంత సుదీర్ఘకాలం నడవడానికి ఆశీస్సులు అందించిన దేశ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తు్న్నా.. నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రజలను ఎన్నిటికీ మర్చిపోలేనని అన్నారు. 

ప్రజా సేవ చేసేందుకు నాకు భగవంతుడు శక్తినిచ్చారు. ప్రజలు, భగవంతుడి ఆశీస్సులతో దేశానికి మరింత సేవ చేస్తానని పేర్కొన్నారు. నా దీర్ఘకాల ప్రజాసేవకు ఎంతో మంది మద్దతుగా నిలిచారు.. ప్రజలు, అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు నాకు తోడుగా నిలిచారన్నారు. 

ప్రజలకు ఇంకా సేవ చేసే శక్తి ఇవ్వాలని భగవంతున్ని రోజా కోరుకుంటానని తెలిపారు. నేను ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలని వాళ్లు తనను ఎన్నుకున్నారు. ప్రజలు నాపై ఎంతో నమ్మకం ఉంచారు. దానిని ఎప్పటికీ వమ్ము చేయనని చెప్పారు. ప్రజలకు సేవ చేయడంలో ఏనాడు వెనుదిరిగేది లేదన్నారు. తన దృష్టిలో ప్రజలే దేవుని స్వరూపం. దేశ ప్రజల విశ్వాసం, కార్యకర్తల అవిశాంత్ర శ్రమే నా అతిపెద్ద బలమన్నారు. 

ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు కొన్ని విమర్శలు వస్తాయి. కానీ విమర్శలను పట్టించుకుంటే ముందుకు వెళ్లలేమని అన్నారు. తనను వ్యక్తిగతంగా విమర్శిస్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తా. నన్ను రాజకీయంగా బలోపేతం చేసేది కూడా నా ప్రత్యర్థులేనని పేర్కొన్నారు. వారు ఎంతగా విమర్శలు చేస్తే.. నేను అంతగా ఆలోచించేవాడినని చెప్పారు.