స్పెయిన్ సముద్ర తీరంలో డైవింగ్‌కు వెళ్లిన ఇద్దరికి పురాతన కాలం నాటి అరుదైన బంగారు నాణాలు దొరికాయి. ఈ నాణాలు రోమన్ చక్రవర్తుల కాలం నాటివని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. బావామరుదులైన లూయిస్ లెన్స్, సీజర్ గిమేనో స్పెయిన్‌లోని జిబియా పట్టణానికి సమీపంలో ఉన్న సముద్ర తీరంలో డైవింగ్‌కు వెళ్లారు. సముద్రపు అడుగున ఉన్న నాచు, పిచ్చిమొక్కలను క్లీన్ చేసే ప్రయత్నం చేశారు. ఏడు మీటర్ల లోతులో క్లీన్ చేస్తుండగా మెరుస్తున్న కొన్ని వస్తువులు వారి కంటపడ్డాయి. తొలుత వాటిని పది సెంట్ల కాయిన్స్ అనుకున్నారు. వాటిని బోటు దగ్గరకు తీసుకొచ్చి పరిశీలిస్తే రోమన్ చక్రవర్తుల బొమ్మలు కనిపించాయి. మిగతా నాణాలను వెలికి తీయడానికి రెండు గంటల సమయంపైగా పట్టింది. మొత్తం 53 బంగారు నాణాలను వారు గుర్తించారు. వాటిని యూరప్ అలికాంటె యూనివర్సిటీలోని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వారికి అప్పగించారు. పరిశోధనలు చేసిన ఎక్స్పర్ట్స్ ఆ నాణాలు 4, 5 శతాబ్దాలకు సంబంధించినవని గుర్తించారు. పదిహేను వందల ఏండ్ల క్రితం నాటివయినా నాణాలు కొంచెం కూడా చెక్కు చెదరలేదు. వాటిపై ఉన్న ఆనవాళ్లు, రాజుల బొమ్మలు స్పష్టంగా తెలుస్తున్నాయని ఆర్కియాలజిస్టులు తెలిపారు. ఈ నాణాలపై ఉన్న బొమ్మలు రోమన్ చక్రవర్తులు వాలెంటీనియన్ I, వాలెంటీనియన్ II, థియోడోసియస్ I, ఆర్కాడియో, హానోరియస్ విగా గుర్తించారు. క్రీస్తుశకం 409లో ఐబేరియన్ ద్వీపకల్పాన్ని రోమన్లు నాశనం చేశారు. అప్పుడు ఈ నాణాలు సముద్రంలో పడి ఉండొచ్చని ఆర్కియాలజిస్టులు అంటున్నారు. ప్రస్తుతం వీటిని శుభ్రం చేసి మ్యూజియంలో పెట్టడానికి రెడీ అవుతున్నారు.
