ఉద్యోగులను తొలగిస్తున్న అమెజాన్

ఉద్యోగులను తొలగిస్తున్న అమెజాన్

రాబోయే రోజుల్లో టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మెటా (ఫేస్ బుక్), మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలు నష్టాలను తగ్గించుకోవడానికి వాళ్ల కంపెనీల్లో పనిచేస్తున్న చాలామంది ఉద్యోగులను పనిలోంచి తొలగిస్తున్నాయి. అయితే, తాజాగా ఈ -కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. చాలామందికి పింక్ స్లిప్ లు ఇచ్చి ఉద్యోగాలనుంచి తొలగించనున్నట్టు తెలుస్తుంది.

ప్రపంచంలో పెరుగుతున్న ఆర్థిక మాంద్యంవల్ల అమెరికన్ టెక్నాలజీ, ఈ- కామర్స్  సంస్థ అమెజాన్ ఉద్యోగుల కోత మొదలుపెట్టింది. అమెజాన్ లో పనిచేసిన ఒక టాప్ ఎగ్జిక్యూటివ్ పంపిన అంతర్గత మెమో ప్రకారం, కంపెనీ గత వారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

అమెజాన్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జామీ జాంగ్ తనను ఉద్యోగంనుంచి తొలగించినట్టు లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశాడు. అలానే రోబోటిక్స్ టీమ్ మొత్తానికి పింక్ స్లిప్‌లు అందజేశారని తన లింక్డ్‌ఇన్‌ ద్వారా పంచుకున్నాడు. లింక్డ్‌ఇన్ డేటా ప్రకారం, కంపెనీ రోబోటిక్స్ టీంలో మొత్తం 3,766 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 3,766 మంది ఉద్యోగులలో ఎంతమందిని ఉద్యోగాలనుంచి తీసేస్తున్నారో తెలియలేదు. అమెజాన్ ఇచ్చిన నివేదిక ప్రకారం కంపెనీకి లాభాలు చేకూర్చలేని టీంలను తొలగిస్తున్నట్టు తెలుస్తుంది.