ఫ్యూచర్​ కేసులో సుప్రీం ముందుకు అమెజాన్​

ఫ్యూచర్​ కేసులో సుప్రీం ముందుకు అమెజాన్​

ఆర్బిట్రేషన్​ ప్రొసీడింగ్స్​ అనుమతించాలని వినతి

న్యూఢిల్లీ: ఫ్యూచర్​ రిటెయిల్​ కేసులో ఆర్బిట్రేషన్​ ప్రొసీడింగ్స్​ మొదలెట్టేలా చూడాలని అమెజాన్​  సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సింగపూర్​ ఇంటర్నేషనల్​ ఆర్బిట్రేషన్​ సెంటర్ (ఎస్​ఐఏసీ) లో అంతకు ముందు ఆర్బిట్రేషన్​ ప్రొసీడింగ్స్​ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రొసీడింగ్స్​ను ఆపేందుకు ఫ్యూచర్​ గ్రూప్​ చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా కోర్టు ముందుంచారు అమెజాన్​ తరఫున వాదించిన  సీనియర్​ లాయర్​ గోపాల్​ సుబ్రమణియన్​. ట్రిబ్యునల్​ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఫ్యూచర్​ గ్రూప్​ ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేసిందని పేర్కొన్నారు. ఆర్బిట్రేషన్​ ప్రొసీడింగ్స్​ను ఎట్టి పరిస్థితుల్లోనూ  వాయిదా వేయరాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్​ కూపన్స్​లో అమెజాన్​ పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత ఫ్యూచర్​ గ్రూప్​ను రిలయన్స్​కు అమ్మాలని కిషోర్​ బియాని నిర్ణయించారు. కానీ, కొనుక్కునే హక్కు మొదటగా తమకే ఉంటుందంటూ అమెజాన్​ కోర్టుకెక్కింది. అప్పటి నుంచీ ఒకరిపై ఒకరు వేరు వేరు కోర్టులలో కేసులు దాఖలు చేసుకుంటున్నారు. ఈ న్యాయపరమైన పోరాటం గత ఏడాది కాలంగా సాగుతోంది. ప్రొసీడింగ్స్​ కొనసాగించాలనే ఉద్దేశంతో నవంబర్​ 28 న ఫైనల్​ హియరింగ్​ జరపాలని ట్రిబ్యునల్​ నిర్దేశించింది. ప్రొసీడింగ్స్​ నిలిపి వేసే ఉద్దేశంతోనే ఫ్యూచర్​ గ్రూప్​ 200 పైగా పిటిషన్లు దాఖలు చేసిన అంశాన్ని చీఫ్​ జస్టిస్​ చంద్రచూడ్​ ప్రస్తావించారు. కేసును ఆలస్యం చేసే ఉద్దేశమే ఇందులో కనబడుతోందని ఫ్యూచర్​ గ్రూప్​ న్యాయవాదికి చీఫ్​ జస్టిస్​ స్పష్టం చేశారు. ఇది ఇంటర్నేషనల్​ ఆర్బిట్రేషన్​. దేశంలోని కోర్టులు దేశ ప్రతిష్టను కాపాడేలా ఉండాలని చంద్రచూడ్​ అభిప్రాయపడ్డారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రల్​ ప్రొసీడింగ్స్​ను గౌరవించేలా గ్లోబల్​ ఇండియా ఉండాలని హితవు చెప్పారు. ఆర్బిట్రేషన్​ ప్రొసీజర్​ను అడ్డుకోవడాన్ని సమర్ధించలేమని ఆయన పేర్కొన్నారు