ప్రపంచ టెక్, ఈ -షాపింగ్ దిగ్గజం ఉద్యోగులకు బిగ్ షాకిచ్చింది. 9 వేల మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ కష్టాల్లో ఉందని.. ఆర్థిక స్థిరత్వం కోసం.. కంపెనీ భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈవో ఆండీ జెస్సీ ప్రకటించారు. రెండవ రౌండ్ తొలగింపుల్లో భాగంగా 9000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. 22 నవంబర్ లో ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ స్టోర్స్ లో 18 వేల మందిని తొలగించింది.
అమెజాన్ తన 29 ఏళ్ల ప్రస్థానంలో ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగులను తొలగిస్తోంది. ఇప్పటికే అడ్వర్టైజింగ్ యూనిట్‌లోని కొంతమందిని పీకేసింది. దీంతో పాటు వీడియో గేమ్, ట్విచ్ లైవ్ స్ట్రీమింగ్ యూనిట్లలోని ఉద్యోగులను తొలగించింది. తాజాగా సెకండ్ రౌండ్ కింద 2023, మార్చి 20వ తేదీన 9 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ నిర్ణయాన్ని అమలు చేసింది. మొత్తంగా అమెజాన్ లో4 నెలల్లోనే 27 వేల మంది ఉద్యోగులను తొలగించింది.
ఆర్థిక గందరగోళ పరిస్థితుల్లో కార్పొరేట్ కంపెనీలు ఖర్చుల తగ్గింపు కోసం ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే అనేక కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలోనే అమెజాన్ తన క్లౌడ్ కంప్యూటింగ్, మానవ వనరుల విభాగంలో కొంతమంది ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం కంపెనీ కష్టమైన రోజులను చూస్తోందంటూ అమెజాన్ వెబ్ సర్వీసెస్ CEO ఆడమ్ సెలిప్‌స్కీ, హెచ్ఆర్ హెడ్ బెత్ గలెట్టి ఉద్యోగులకు సందేశం పంపారు.
అమెజాన్ లో ఉద్యోగాన్ని కోల్పోయిన వారిని చూసి ఇతర ఉద్యోగులకు కంటిమీదు కునుకు ఉండటం లేదు. తమ ఉద్యోగం కూడా ఎప్పుడు ఉంటుందో.... ఎప్పుడు ఊడుతుందోననే ఒత్తిడిలో ఉన్నారు.