జాబ్​ నుంచి తీసేయలేదు.. అవన్నీ స్వచ్ఛంద  రాజీనామాలే : అమెజాన్​

జాబ్​ నుంచి తీసేయలేదు.. అవన్నీ స్వచ్ఛంద  రాజీనామాలే : అమెజాన్​

ఉద్యోగ కోతలపై వివరణ కోరుతూ కేంద్ర కార్మిక శాఖ నుంచి మంగళవారం అందిన నోటీసులపై ఈకామర్స్​ దిగ్గజం అమెజాన్​ స్పందించింది. అమెజాన్​ పబ్లిక్​ పాలసీ మేనేజర్​ స్మితా శర్మ ఇవాళ బెంగళూరులోని డిప్యూటీ చీఫ్ లేబర్​ కమిషనర్​ ఎ.అంజప్ప ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. అమెజాన్​ లో భారీగా ఉద్యోగ కోతలు జరుగుతున్నాయంటూ న్యాసెంట్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ ఎంప్లాయీస్​ సెనేట్​ (నైట్స్​) అనే సంఘం నుంచి  కేంద్ర కార్మిక శాఖకు అందిన ఫిర్యాదులో వాస్తవికత లేదని స్మితా శర్మ స్పష్టం చేశారు. అమెజాన్​లో ఏ ఒక్కరినీ ఉద్యోగం నుంచి తీసేయలేదని తేల్చి చెప్పారు.

కొంతమంది అర్హులైన ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ (వాలంటరీ సెపరేషన్​ ప్రోగ్రామ్​) పథకాన్ని మాత్రమే ప్రస్తుతం అమెజాన్​ అమలు చేస్తోందని అమెజాన్​ పబ్లిక్​ పాలసీ మేనేజర్​ స్మితా శర్మ అన్నారు. నవంబరు 16న అమల్లోకి వచ్చిన ఈ పథకం నవంబరు 30 వరకు అమల్లో ఉంటుందని ఆమె తెలిపారు. ఆసక్తి ఉన్న ఉద్యోగులు ఆలోగా దరఖాస్తులు సమర్పించవచ్చని కోరారు. ఈ పథకం ద్వారా ముందస్తుగా పదవీ విరమణ చేస్తున్న వారికి తగిన ఆర్థిక ప్రయోజనాలను కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు ఒకవేళ వద్దు అని భావిస్తే.. నిర్ణీత గడువులోగా స్వచ్ఛంద పదవీ విరమణ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవచ్చని వివరించారు.