పేమెంట్ చెయాలంటే చెయ్యి చూపిస్తే సరి

పేమెంట్ చెయాలంటే చెయ్యి చూపిస్తే సరి

చెెయ్యిజూసి జాతకం చెప్పేటోళ్ల గురించి తెలుసు కదా. మన చేతులల్ల గీతలు, ముడతలను బట్టి మన ఫ్యూచరేంటో చెబుతామంటారు. వాళ్లయినా చివరకు చెయ్యి పట్టుకునే హస్తజాతకం చెబుతారు. కానీ, ఈ–కామర్స్​ దిగ్గజం అమెజాన్​ కూడా అదే బాటలోకి వచ్చేసింది. అయితే, ఇక్కడ చెయ్యిని దేనికి టచ్​ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి.. అమెజాన్​ తీసుకొస్తున్న ఈ కొత్త పద్ధతి జాతకం కోసమూ కాదు. మరేంటి..? ఎందుకా కొత్త పద్ధతి? అంటే, అమెజాన్​ ఆన్​లైన్​ స్టోర్స్​ నడుపుతున్నట్టే, అమెజాన్​ గో అనే షాపులనూ నడుపుతోంది. అక్కడ క్యాషియర్లు లేని కౌంటర్లను పెడుతోంది. దాని కోసం కస్టమర్లు షాపులోకి వచ్చేలా, పేమెంట్లు చేసేలా హ్యాండ్​ స్కానింగ్​ టెక్నాలజీని తయారు చేసింది. ఫేస్​రికగ్నిషన్​ తెలుసు కదా.. ఇప్పుడు బాగా ఫేమస్​ అయిన టెక్నాలజీ. దాని తరహాలోనే చెయ్యిని చూపించి లోపలికి వెళ్లాలన్నమాట. మళ్లీ షాపింగ్​ చేశాక డబ్బు కట్టేందుకూ చెయ్యినే చూపించాలి. దీనిపై అమెజాన్​ పేటెంట్​నూ పొందింది.

ఎలా పనిచేస్తుంది?

మామూలు బయోమెట్రిక్​ సిస్టమ్​లో ఫింగర్​ప్రింట్​ వెయ్యాలంటే దానిపై వేలిని పెట్టాల్సి ఉంటుంది. అయితే, అమెజాన్​ తయారు చేసిన ఈ బయోమెట్రిక్​ సిస్టమ్​లో చెయ్యిని ఆనించాల్సిన అవసరం లేదు. మనం చెయ్యి చూపించగానే బయోమెట్రిక్​ స్కానర్​ సిస్టమ్​లోని ఇన్​ఫ్రారెడ్​ లైట్​ చేతిలోని గీతలు, ముడతలు, నరాలు, రక్తనాళాలను స్కాన్​ చేస్తుంది. అయితే, ఇందులోనూ రెండు రకాలుంటాయి. ఫస్ట్​ పోలరైజేషన్​ లైట్​, సెకండ్​ పోలరైజేషన్​ లైట్​. ఫస్ట్​ పోలరైజేషన్​ లైట్​ అన్నింటినీ స్కాన్​ చేస్తే, సెకండ్​ పోలరైజేషన్​ లైట్​ వాటి ఫొటోలను తీస్తుంది. ఇన్​ఫ్రారెడ్​ లైట్​ సోర్స్​తో పాటు కంట్రోలర్​, కెమెరా ఉంటుంది. కావాల్సిన సామాన్లను కొన్నాక మళ్లీ పేమెంట్​ దగ్గరకు వెళ్లి మళ్లీ చెయ్యి చూపిస్తే సరిపోతుంది. పేమెంట్​ అయిపోతుంది. అయితే, అంతకుముందే వాళ్లు తమ బ్యాంకు వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇక, జస్ట్​ 300 మిల్లీ సెకన్లలోనే అమెజాన్​ హ్యాండ్​ రీడింగ్​ టెక్నాలజీ, కస్టమర్లను గుర్తిస్తుంది. దీని కోసం 2018 జూన్​ 21నే అమెజాన్​ పేటెంట్​కు అప్లై చేసింది. అయితే, తాజాగా అమెరికా పేటెంట్​ అండ్​ ట్రేడ్​మార్క్​ ఆఫీస్​ ఆ పేటెంట్​కు ఆమోద ముద్ర వేసింది.